వైవిధ్య చిత్రాలకు కేరాఫ్ శర్వానంద్...!

- March 06, 2025 , by Maagulf
వైవిధ్య చిత్రాలకు కేరాఫ్ శర్వానంద్...!

టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో మంచి టాలెంటెడ్ ఉన్న నటుడు అంటే టక్కును గుర్తొచ్చే పేరు శర్వానంద్. కెరీర్ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.ఇప్పటి వరకు శర్వానంద్ చాలా సినిమాలు చేశాడు. వాటిలో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.శర్వ ఎప్పటికప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ తెలుగు సినీ అభిమానులను అలరిస్తున్నాడు. ఓవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే క్లాస్ సినిమాలు, మరోవైపు కమర్షియల్ మాస్ చిత్రాలతో మెప్పిస్తున్నాడు. రెండు దశాబ్దాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న శర్వానంద్ పుట్టినరోజు నేడు.

శర్వానంద్ అలియాస్ మైనేని శర్వానంద్ 1984 మార్చి 6న మైనేని రత్నగిరి వర ప్రసాదరావు, వసుంధరా దేవి దంపతులకు విజయవాడలో జన్మించాడు. వీళ్లది బిజినెస్ ఫ్యామిలీ అయినప్పటికీ, సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. శర్వ పెద్ద తాత మైనేని హరిప్రసాదరావు భారతదేశం గర్వించదగ్గ అణుశాస్త్రవేత్త. టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, రానా దగ్గుబాటిలతో కలిసి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో శర్వా చదువుకున్నాడు. ఇప్పటికీ వీళ్ళు ముగ్గురూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ప్రభాస్ తోనూ శర్వాకి మంచి సాన్నిహిత్యం ఉంది.తరువాత సికిందరాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాడు.

చిన్నప్పటి నుండి తమ కుటుంబానికి సినీ ప్రముఖులు సన్నిహితులు కావడం, తన స్నేహితులు సైతం అదే నేపథ్యానికి చెందిన వారు కావడం మూలాన సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడే ముంబై వెళ్ళి కిశోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు. తన మిత్రుడు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధంతో అప్పట్లో చిరంజీవితో 'థమ్స్ అప్' యాడ్లో  నటించడం ద్వారా తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు.

2004లో 'ఐదో తారీఖు' అనే చిన్న సినిమాతో శర్వా డెబ్యూ ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన అనువాద చిత్రం ‘యువసేన’తో మంచి గుర్తింపును సంపాదించాడు. చిరంజీవి ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.’లో ఓ చిన్న పాత్రలో నటించినా, అది కూడా శర్వానంద్ కు గుర్తింపును సంపాదించి పెట్టింది. పలు చిత్రాల్లో 2004లో 'ఐదో తారీఖు' అనే చిన్న సినిమాతో డెబ్యూ ఇచ్చాడు. 'గౌరీ' 'శంకర్ దాదా ఎంబీబీఎస్' 'సంక్రాంతి' 'లక్ష్మి' వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'వెన్నెల' మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్‌తో ఆకట్టుకున్నాడు.

ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ హీరోగా చేయడం మొదలు పెట్టాడు. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో 'అమ్మ చెప్పింది' చిత్రంలో హీరోగా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ ప్రయాణంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘గమ్యం’ శర్వానంద్‌కు హీరోగా మంచి విజయాన్ని అందించింది. ‘గమ్యం’తో హీరోగా మంచి విజయం సాధించిన దగ్గర నుంచీ ఆచితూచి అడుగేస్తూ, మంచి కథలను ఎంపిక చేసుకోసాగాడు. ఆ ప్రయత్నంలో 'అందరి బంధువయా' 'ప్రస్థానం' వంటి చిత్రాలు మంచి సక్సెస్ సాధించడమే కాదు, అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి.

2013లో వచ్చిన జర్నీ చిత్రంతో శర్వా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 2014లో వచ్చిన 'రన్ రాజా రన్' మూవీతో బ్లక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఏడాది వచ్చిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’తో ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ‘రాజాధిరాజా, ఎక్స్ ప్రెస్ రాజా’తో రాజాలా సాగాడు. అలాగే, 2016 సంక్రాంతికి వచ్చిన ‘శతమానం భవతి’తో కెరీర్ బెస్ట్ హిట్ సాధించాడు శర్వానంద్. “రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం” ఇలా పలు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు . అయితే ‘శతమానం భవతి’లాగా గ్రాండ్ సక్సెస్‌తో పులకరించలేకపోయాడు.

’మహాసముద్రం’లో సిద్ధార్థ్ తో కలసి శర్వానంద్ అలరించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆశించిన విజయం దరి చేరలేదు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ జనం ముందు నిలచింది. ఇందులోనూ శర్వానంద్ తనదైన అభినయంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. చివరగా 'మనమే' సినిమాతో మరోసారి నిరాశే మిగిలింది. ప్రస్తుతం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటుగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'శర్వా 36'.. సంపత్ నంది డైరెక్షన్ లో 'శర్వా 38' సినిమాలు చేస్తున్నాడు. 

--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com