ఎంపీలకు భారీగా వేతనాలు పెంపు..

- March 25, 2025 , by Maagulf
ఎంపీలకు భారీగా వేతనాలు పెంపు..

న్యూ ఢిల్లీ: ఎంపీలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. ఎంపీల జీతాలను 24శాతం పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 2018 తర్వాత ఎంపీల జీతాలు, పెన్షన్లు పెరిగినట్లైంది. ఎంపీల నెల జీతం లక్ష రూపాయల నుంచి లక్ష 24వేలకు పెరిగింది. అలాగే మాజీ ఎంపీల పెన్షన్ నెలకు 25వేల నుంచి 31వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇక ఎంపీలకు డైలీ అలవెన్స్ రూపంలో ఇచ్చే మొత్తాన్ని 2వేల నుంచి 2,500 వేలకు పెంచారు. అలాగే దీనికి అదనంగా నియోజకవర్గ ఖర్చుల కోసం నెలకు 70వేలు, కార్యాలయాల ఖర్చుల కోసం అదనంగా నెలకు 60వేల రూపాయలను ఎంపీలు పొందనున్నారు. పెంచిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి రెండేళ్ల బకాయిలు కూడా రానున్నాయి.

ఇక ఇతర ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఎంపీలకు, వారి కుటుంబానికి ఏడాదికి 34 ఉచిత దేశీయ విమాన టికెట్లు, ఢిల్లీలో అద్దె రహిత వసతి సదుపాయం కల్పిస్తున్నారు. అధికారిక గృహాలను వద్దనుకునే వారికి నెలవారీ గృహ భత్యం 2లక్షలను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏటా 50వేల యూనిట్ల ఉచిత విద్యుత్, ఏడాదికి 4వేల కిలోలీటర్ల ఉచిత నీరు అందిస్తారు. అలాగే ఎంపీలు, వారి కుటుంబసభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ కింద సమగ్ర ఆరోగ్య సంరక్షణ కవరేజ్ అందిస్తారు.

2023 ఏప్రిల్ 1 నుంచి ఈ పెంచిన జీతభత్యాలు అమల్లోకి వస్తాయి. దీంతో వచ్చే నెల ఒకేసారి 5లక్షల 76వేల రూపాయలు పెరిగిన జీతంతో పాటు గడిచిన రెండేళ్ల కాలానికి సంబంధించి జీతాన్ని కూడా పెంచడం జరిగింది కాబట్టి.. ఆ వేతనాన్ని కూడా ఎంపీలు అందుకోబోతున్నారు. ప్రస్తుతం ఒక్కో ఎంపీ జీతం లక్ష రూపాయలు కాగా, ఇక నుంచి లక్ష 24వేల రూపాయలు అందుకోబోతున్నారు. 2018 తర్వాత ఎంపీల వేతనాలు పెంచడం ఇదే తొలిసారి. ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన వేతన పెంపు ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com