ఉగాది పండుగ

- March 30, 2025 , by Maagulf
ఉగాది పండుగ

ఉగాది పండుగతో చైత్రమాసం ప్రారంభమవుతుంది. వసుధపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది. మిగిలిన పండుగల కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది. సాధారణంగా పండుగలన్నీ ఏదో ఒక దేవత లేదా దేవుడికి సంబంధించి ఉంటాయి. ఉగాది ఇందుకు పూర్తి భిన్నం. ఏ దేవుడి పేరూ ఈ పండుగ రోజు వినిపించదు. ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (రుతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది. సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది. అంతేకాదు, ఎన్నో వైజ్ఞానిక అంశాల సమాహారంగానూ ఉగాది తన ప్రత్యేకతను చాటుతుంది.

తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ ఉగాది. ఈ సారి తెలుగు సంవత్సరాదిలో 39వ అయిన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఉగాది  రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. సంప్రదాయాలు, సదాచారాలతో పాటూ ఆరోగ్య సూక్తులూ, మానవ జీవన విలువలూ మేళవించిన అపూర్వ సమ్మేళనాలు పండుగలు.

ప్రతి మనిషిలోను శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే తన్మాత్రలుగా పంచభూతాలు అంతర్లీనంగా ఉంటాయి. ఇవే పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే రూపాల్లో బాహ్యంగా ప్రకటితమవుతాయి. ఇలా అంతర్బహిర్‌ రూపాల్లో ఉన్న పంచభూతాలను మనో నేత్రంతో దర్శించి, లౌకిక జీవనాన్ని సాఫల్యం చేసుకుంటూనే కైవల్యానికి సోపానాలు నిర్మించుకోవాల్సిన బాధ్యత మనిషిపై ఉంది.

దైనందిన జీవనంలోని ప్రతి అడుగులో ప్రకృతిని అనుసరిస్తూ, ‘ప్రకృతి’, ‘శక్తు’ల మేలు కలయికగా జీవన లక్ష్యాన్ని చేరుకోవాలనేది మన ప్రాచీనుల దిశానిర్దేశం. ఈ బాధ్యతల నిర్వహణలో మనిషికి చేయూత అందించేందుకు సర్వోపద్రష్టలైన మన ప్రాచీనులు ‘కాల’విభజన చేశారు. ఈ క్రమంలో భారతీయ జీవనంలోని అత్యున్నత వైజ్ఞానిక కోణం సమున్నతంగా ఆవిష్కృతం అవుతుంది.

తెలుగువారికి ఇష్టమైన పండుగ ఉగాది. కోయిల పాటే ఉగాది. చెట్ల చిగురే ఉగాది. షడ్రుచుల సమ్మేళనపు జీవితపు పరిమళమే ఉగాది. వసంతాగమన వేళ జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది.శిశిరంలో ఆకురాల్చిన ప్రకృతి.. వసంతంలోకి లేత ఆకుపచ్చగా.. కొత్త చిగుళ్లు వేసి నవ యవ్వనంలా కనిపిస్తుంది. కొత్త పూల నుంచి వీచే పిల్ల గాలికి పక్షులు కిలకిలరావాలతో గిలిగింతలు పెడతాయి. ఓటమి వెంటే గెలుపు ఉంటుందని... చీకటివెంటే వెలుగు ఉంటుందని...నమ్మకాన్ని వీడద్దని చెప్పే పండుగ ఉగాది.ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అంటే విశ్వానికి సంబంధించినది.. ధనసమృద్దిని కలిగించేది.

ప్రకృతి మొత్తం లే చివుళ్లతో, రంగురంగుల పూలతో ముస్తాబై ఆహ్వానం పలికే పండుగ ఉగాది. మత్త కోయిలల కుహూగానాలతో ఉగాదికి కొత్త సోయగాలు తీసుకువస్తాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు మత్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునుండే ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.

ఆశలు చిగురుల వంటివి. అవి ఎప్పుడూ వికసిస్తూ ఉండాలి. అలా కోరుకోవటమే నిత్య వసంతం అవుతుంది. ఎల్లప్పుడూ మంగళ ధ్వనులు వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత. ఈ విధంగా ఉగాది పండుగ మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది. ఉగాది పండుగ పునరుజ్జీవనానికి సంకేతం. అప్పటివరకు మోడుబారిన చెట్లు, తీగలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పూలు, కాయలతో కళకళలాడినట్టు కష్టనష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకుసాగాలనే సందేశాన్ని అందిస్తుంది. ఇదంతా ఉగాది పండుగలోని సామాజిక విజ్ఞానం.

శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది కావడం విశేషం. ఈ రోజు నుండే శాలివాహన శకం ప్రారంభమైందని చెబుతారు. ఉగాదిలోని యుగం అంటే ద్వయం, జంట అని కూడా అర్థం ఉంది. ఉత్తరాయన, దక్షిణాయన అను ద్వయాలు కలిస్తేనే యుగం.. సంవత్సరం అవుతుంది. దీనికి ఆది యుగాది. హైందవశాస్త్రం ప్రకారం తెలుగు నామ సంవత్సరాలు అరవై. అవి ప్రతియేడు ఒక క్రమంలో వస్తాయి. ఈ సారి శ్రీ విశ్వావసు తెలుగు సంవత్సరాల్లో 39వది.

ఉగాది రోజు సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది. బీడుపడిన భూములు మొలకలెత్తి ప్రకృతి పచ్చగా మారుతుంది. పచ్చని పంటపొలాలు, వాటిపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నలుగా కనువిందు చేస్తాయి. వీటన్నింటితో పాటూ ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది. ఉగాది రోజున కుటుంబ సభ్యులందరూ.. సూర్యోదయం ముందే లేచి కాలకృత్యాదులు ముగించుకొని సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని.. శీకాయపొడితో అభ్యంగన స్నానమాచరించాలనేది శాస్త్ర వచనం.

అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్ఠాదేవి నిష్క్రమించి.. లక్ష్మీదేవిని ఆహ్వానం పలకడమే దీని ఉద్దేశ్యం. సంవత్సరాది నుంచి ప్రాత: కాల ఉదయపు పూజ తర్వాత.. ‘ఉగాది పచ్చడి’ని నైవేద్యంగా స్వీకరించాలి. పంచాగం అంటే.. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము.. ఈ ఐదు కలిపి పంచాంగం అంటారు. ఈ రోజు తిథి దేవత, నక్షత్ర దేవత, వార దేవత, మాస దేవత, సంవత్సర దేవత, నవగ్రహ దేవతల అనుగ్రహం పొందడానికి ఏకైక మార్గం. ఈ రోజు పండితులను నూతన వస్త్రాలతో సత్కరించుట మహా పుణ్య ప్రదమని శాస్త్ర వచనము. ఇలా చేస్తే ఆ యేడాది నవగ్రహ పీడలు తొలిగుతాయనేది ప్రతీతి.

ఈ రోజు ఇంటిపై కాషాయ ధ్వజాన్ని అర్చించి ఇంటి ఆవరణలో ఎగరవేసినట్టైయితే.. ఆ గృహానికి సంపూర్ణ రక్ష. అంతేకాదు ఈ రోజు కొత్త కూష్మాండము (గుమ్మడికాయ) పూజ చేసి.. ఇంటి ముంగిట కుష్మాండ ధారణ చేయడం వలన గృహ, వాస్తు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

యోగ శాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది.ఈ ఆరు చక్రాలు మనం తీసుకునే ఉగాది పచ్చడిలోని ఆరు రుచులకు ప్రతీకలుగా నిలుస్తాయి.మూలాధారం–తీపి, స్వాధిష్టానం–వగరు, మణిపూరకం – చేదు, అనాహతం–పులుపు, విశుద్ధ- కారం, ఆజ్ఞ–ఉప్పు రుచులకు ఆలంబనగా ఉంటూ, మనిషి జీవక్రియల నిర్వహణలో తోడ్పడుతుంటాయి.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com