అస్సాం రాజకీయ దిగ్గజం-తరుణ్ గొగోయ్
- April 01, 2025
తరుణ్ గొగోయ్.. ఈశాన్య భారత రాజకీయాల్లో ప్రభల శక్తిగా ఎదిగిన రాజకీయ నేత. విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత జాతీయ రాజకీయాల్లో ఆ తర్వాత అస్సాం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అస్సాం రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అణిచి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు గొగోయ్. నేడు అస్సాం రాజకీయ కురువృద్ధుడు తరుణ్ గొగోయ్ జయంతి సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం...
తరుణ్ గొగోయ్ 1936,ఏప్రిల్ 1న అస్సాం ప్రావిన్స్ రాష్ట్రంలోని అవిభక్త శివసాగర్ జిల్లా గోలాఘాట్ పట్టణంలోని రంగజన్ టీ ఎస్టేట్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న కమలేశ్వర్ గొగోయ్, ఉష దంపతులకు జన్మించారు.గొగోయ్ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం టీ ఎస్టేట్ స్కూల్లోనే జరిగింది.హైస్కూల్ విద్య కోసం జోర్హాట్ పట్టణానికి చేరుకున్న గొగోయ్ అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నారు.జోర్హాట్ పట్టణంలోని జగన్నాథ్ బారువా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గౌహుతి యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు.
గొగోయ్ చిన్నతనం నుంచే టీ ఎస్టేట్‌లో పెరగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల జీవితాలను దగ్గరగా పరిశీలించేవారు. వేతనాల పెంపు కోసం వారు చేస్తున్న ఉద్యమాలకు విద్యార్ధి దశలోనే మద్దతుగా నిలిచేవారు. జోర్హాట్ పట్టణంలో చదువుతున్న సమయంలో విద్యార్ధి రాజకీయాల్లో అడుగుపెట్టారు. లా పూర్తి చేసిన జోర్హాట్ కేంద్రంగా తన లా ప్రాక్టీస్ మొదలుపెట్టిన గొగోయ్ కాంగ్రెస్ పార్టీలో చేరి పట్టణ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు.ఇదే సమయంలో అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.
1968లో జోర్హాట్ మున్సిపల్ సంఘం ఎన్నికల్లో కౌన్సిలర్‌గా ఎన్నికైన గొగోయ్ 1969లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచి జోర్హాట్ ప్రాంతంలో తిరుగులేని యువనేతగా ఎదిగారు. 1971లో జోర్హాట్ నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో అప్పటి కాంగ్రెస్ యువనేత సంజయ్ గాంధీ మద్దతుగా యూత్ కాంగ్రెస్ విభాగంలో పనిచేశారు. తన పనితీరుతో సంజయ్, ప్రధాని ఇదిరాలను మెప్పించి 1976లో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎమెర్జెన్సీ కారణంగా 1977 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ ఓటమి చెందినా జోర్హాట్ నుంచి గొగోయ్ రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
1977-80 వరకు కాంగ్రెస్ అగ్రనేతలకు సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రతినిధిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. సంజయ్ మరణం తర్వాత రాజీవ్ గాంధీ సన్నిహితుడిగా మెలిగారు.1983లో జరిగిన జోర్హాట్ లోక్ సభ ఉపఎన్నికల్లో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.1984-90 వరకు రాజీవ్ ఆదేశాల మేరకు ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీగా గడుపుతూ వచ్చారు.1986లో హితేన్ సైకియా గవర్నర్‌గా వెళ్లడంతో అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 1990 వరకు ఆ పదవిలోనూ కొనసాగారు.రాజీవ్- ఆసు అస్సాం ఒప్పందంలో గొగోయ్ సైతం కీలక పాత్ర పోషించారు.
1990లో సైకియా తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకం కావడంతో, గొగోయ్ తిరిగి జాతీయ రాజకీయాల్లో బిజీ అయ్యారు.1991 ఎన్నికల్లో కలిబోయర్ నుంచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికైన గొగోయ్ పీవీ మంత్రివర్గంలో ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రిగా 1991-96 వరకు పనిచేశారు. 1996లో ఎంపీగా ఓటమి చెందిన తర్వాత అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.1998లో తిరిగి కలిబోయర్ నుంచి ఐదోసారి ఎంపీగా, 1999లో ఆరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
గొగోయ్ అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనేక మార్లు ప్రయత్నాలు చేసినప్పటికి, హితేన్ సైకియా లాంటి రాజకీయ వట వృక్షం ఉండటంతో అది చాలా ఏళ్ళ వరకు సాధ్యం కాలేదు. కానీ,1996లో సైకియా మరణం తర్వాత గొగోయ్ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.పైగా సోనియా గాంధీ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో 1996లో తిరిగి అస్సాం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ప్రఫుల్లా మహంత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను, రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతల మీద అనేక ప్రజా పోరాటాలు గొగోయ్ నాయకత్వంలో జరిగాయి.
2001 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తొలిసారి సీఎం అయ్యారు. సీఎంగా ఎటువంటి అనుభవం లేకున్నప్పటికి పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికి రాష్ట్రంలోని ప్రధాన తీవ్రవాద సంస్థలను ఒకతాటిపైకి తెచ్చి వారితో శాంతి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ శాంతి ఒప్పందం గొగోయ్ రాజకీయ జీవితంలో కీలకమైన మలుపుగా చెప్పవచ్చు.
2006 ఎన్నికల్లో సైతం స్వతంత్ర పార్టీ ఎమ్యెల్యేల మద్దతుతో రెండోసారి సీఎం బాధ్యతలు చేపట్టిన గొగోయ్ రాష్ట్రాభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. అస్సాంలో ఉన్న కాటేజీ పరిశ్రమలతో పాటుగా టూరిజం, మైనింగ్ మరియు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు ఎర్ర తివాచి పరిచారు. గొగోయ్ పారిశ్రామీకరణ కొద్దీ మేరకు సఫలీకృతం కావడంతో రాష్ట్ర ఆదాయం క్రమక్రమంగా పుంజుకుంటూ వచ్చింది. పైగా తీవ్రవాదుల ఏరివేత, అసాంఘిక కార్యకలాపాలు బాగా తగ్గడం తన పాలన పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి 2011 ఎన్నికల్లో వరసగా మూడోసారి సీఎం అయ్యారు. అస్సాం రాజకీయ చరిత్రలో వరసగా సీఎం అయిన ఏకైక నాయకుడిగా గొగోయ్ నిలిచిపోయారు.
2014 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి అధికారం నుంచి దిగిపోవడం, తన పాలనా వ్యవహారాల్లో మునుపటి ఉత్సాహం ప్రదర్శించ లేకపోవడంతో గొగోయ్ క్రమంగా తన పట్టును కోల్పోతూ వచ్చారు. ఇదే సమయంలో మంత్రివర్గంలో నంబర్ టూగా ఉన్న సైకియా ప్రియ శిష్యుడైన హిమంత బిశ్వాస్ సర్మ రాజకీయ తిరుగుబాటు సైతం పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇవన్నీ కలిసి 2016 ఎన్నికల్లో తన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడి అస్సాం చరిత్రలో మొదటిసారిగా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు దారితీసింది. 2016 నుంచి 2020 వరకు అస్సాం అసెంబ్లీలో సాధారణ ఎమ్యెల్యేగా కొనసాగారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలోనే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడంలో గొగోయ్ తన వంతు పాత్ర పోషించారు. గాంధీల కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన గొగోయ్ సూచనలు, సలహాలు సోనియా తీసుకునేవారు. రాహుల్ గాంధీ సైతం గొగోయ్ సూచనలకు బాగా విలువిచ్చేవారు. తన కుమారుడైన గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఎదిగేందుకు రాహుల్ చేయూత ఇవ్వడానికి ముఖ్య కారణం గొగోయ్ గారే ముఖ్య కారణం.
ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని నడిచిన గొగోయ్, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికి పార్టీని, గాంధీల పరివారాన్ని వదలకుండా చివరి వరకు వీరవిధేయుడిగా నిలిచారు. ముఖ్యంగా సంగ్మా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న నాటి నుంచి ఈశన్య రాష్ట్రాల నుంచి తిరుగులేని కాంగ్రెస్ నేతగా చివరి శ్వాస వరకు చలామణి అయ్యారు. అస్సాం రాజకీయాలను ఒకటిన్నర దశాబ్దం పాటుగా తిరుగులేకుండా శాసించిన తరుణ్ గొగోయ్ తన 84వ 2020, నవంబర్ 23న అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!