అందాల అభినేత్రి-జయప్రద

- April 03, 2025 , by Maagulf
అందాల అభినేత్రి-జయప్రద

జయప్రద..80వ దశకంలో తన అందచందాలతో భారతదేశ యువతను ఉర్రుతలూగించిన నటి. అందంతోనే కాదు,అభినయంతోనూ జయప్రద మురిపించిన వైనాన్ని అభిమానుల మనసులు మరచిపోలేవు.నాటి మేటి హీరోలందరితోనూ నటించి జనానికి కనువిందు చేశారు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనూ అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ విజయవంతం అయ్యారు. నేడు అందాల అభినేత్రి జయప్రద పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

జయప్రద అసలు పేరు రవణం లలితారాణి. 1959, ఏప్రిల్ 3న రాజమండ్రి పట్టణానికి చెందిన రవణం కృష్ణారావు, నీలవేణి దంపతులకు జన్మించారు. 13వ ఏట నాట్యంలో శిక్షణ పొందారు. తండ్రి కృష్ణారావు ఫిలిం ఫైనాన్సర్‌. ఆయితే, ఆమె ఎప్పుడూ సినిమాల్లో నటించాలని అనుకోలేదు. అయితే స్కూల్‌ వార్షికోత్సవంలో లలిత రాణి నృత్య ప్రదర్శన ఇచ్చింది. దీంతో నటుడు ప్రభాకర రెడ్డి ‘భూమి కోసం’ చిత్రంలో ఓ పాటలో డ్యాన్స్ చేసే అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంతో లలితా రాణి జయప్రదగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ పాటలో నాట్యం చేసినందుకు రూ. 10 వేలు పారితోషకాన్ని అందుకుంది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూ పోయారు.

బాలచందర్, కె. విశ్వనాథ్ మరియు బాపు దర్శకత్వంలో వచ్చిన “అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సీతాకళ్యాణం” వంటి చిత్రాలలో జయప్రద అభినయం ఆకట్టుకుంది. ఇక నటరత్న ఎన్టీఆర్ సరసన నటించిన ‘అడవిరాముడు’ చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయారు. జయప్రద అప్పటి స్టార్ హీరోలందరితొనూ జోడీగా నటించి ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆమె ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ గార్లతో జతకట్టి మరపురాని విజయాలను అందుకున్నారు.

1980 ప్రారంభంలోనే జయప్రద హిందీ చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. తెలుగు అగ్ర దర్శకులైన రాఘవేంద్రరావు, బాపయ్య, తాతినేని రామారావు హిందీలో తీసిన చిత్రాల్లో ఆమె కథానాయకిగా నటించారు. వారి వల్ల జయప్రద హిందీలో నంబర్ వన్ హీరోయిన్‌గా 80వ దశకాన్ని ఏలారు. శ్రీదేవి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టే వరకు జయప్రద అగ్రపథాన దూసుకెళ్లారు.    

ఉత్తరాది సినీ ప్రేక్షకులు సైతం జయప్రద అందం, అభినయానికి ఫిదా అయిపోయి, ఫ్యాన్స్ అసోసియేషన్స్ మొదలు పెట్టారు. జయప్రద నటించిన హిందీ చిత్రాలు ఆబాలగోపాలాన్నీ ఆకర్షించాయి. ముఖ్యంగా నాటి యువకులను ఓ ఊపు ఊపేశాయి. దాంతో ఉత్తరాది వారు సైతం జయప్రదకు తమ గుండెల్లో గుడి కట్టి ఆరాధించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ ఇలా ఏడు భాషల్లో జయప్రద సుమారు 300 చిత్రాలకి పైగా నటించారు.

జయప్రద అందాన్ని కీర్తించని మనసుకు రసికతలేదని చెప్పవచ్చు.. విశ్వవిఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సైతం జయప్రద అందాన్ని ‘ఒన్ ఆఫ్‌ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ ఆఫ్ ద వరల్డ్’ అని కీర్తించారు. అంటే ఆ అందంలోని సమ్మోహన శక్తి ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జయప్రద అందాన్ని చూసి ఆ రోజుల్లో ఎందరో కవిపుంగవులు తమ కలాలకు పదను పెట్టి, అరుదైన పదబంధాలతో సరికొత్త కవితలు రాసి పులకించి పోయారు.

అందం అవకాశాలను తెచ్చి పెడితే …అభినయం అవార్డ్ లను తెచ్చి పెడుతుందనే మాట జయప్రద విషయంలోనూ నిజమైంది ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలిం ఫేర్‌ సౌత్‌ స్పెషల్‌ , ఫిలిం ఫేర్‌ ఉత్తమ నటి, ఫిలిం ఫేర్‌ సౌత్‌ జీవన సాఫల్య పురస్కారం సహా కళాశ్రీ, కళా సరస్వతి, కిన్నెర సావిత్రి అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా ఆమె సినీ రంగానికి చేసిన గుర్తుగా పలు రివార్డులను సైతం అందుకున్నారు.
 
జయప్రద సినీ, రాజకీయ జీవితంలో నటరత్న ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకం. నటిగా ఎదుగుతున్న సమయంలో ఆమెకు తన సినిమాల్లో పలు అవకాశాలు ఇచ్చి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకునేలా తోడ్పడ్డారు. జయప్రద ఆయన సరసన పౌరాణిక, జానపదం మరియు సాంఘిక వంటి డిఫరెంట్ జానర్స్ లో నటించి మురిపించారు.ఇక సోషియో మిథికల్ ఫాంటసీగా తెరకెక్కి అఖండ విజయం సాధించిన ‘యమగోల’లో అన్నగారితో జయప్రద వేసిన చిందు కనువిందు చేసి కనకవర్షం కురిపించింది. ఆయనతో జయప్రద నటించిన చివరి చిత్రం ‘సూపర్ మేన్’. ఈ చిత్రం తెలుగునాట సూపర్ హీరో మూవీస్ కు తెరతీసింది. ఇలా ఇన్ని రకాల వైవిధ్యమైన పాత్రలతో ఎన్టీఆర్ సరసన నటించిన నాయిక మరొకరు కానరారు.

చిత్రసీమలో ఆమెను స్టార్ చేసిన ఎన్టీఆర్, 1994లో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి, సముచిత గౌరవమిస్తూనే ఆమెను కళాకారుల కోటాలో రాజ్యసభకు నామినేట్ చేశారు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఉత్తరాదికి చెందిన రాజకీయవేత్త అమర్ సింగ్ సహచర్యంలో ఆమె సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2004,2009లలో రాంపూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయ విభేదాల వల్ల ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2019లో బీజేపీలో చేరారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలు పోషించడానికి జయప్రద ఉత్సాహంగా ఉన్నారు. 

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com