టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- February 25, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని గనులు, భూగర్భ వనరుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీచ్ సాండ్ ఖనిజాలు రాష్ట్రానికి సహజ వరమని, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తే భారీ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. ఖనిజాలను తవ్వి ఎగుమతి చేసే దశను దాటుకుని, రాష్ట్రంలోనే శుద్ధి, ప్రాసెసింగ్, తుది ఉత్పత్తుల తయారీ వరకు పూర్తి విలువ పెంపు గొలుసును నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
విజయవాడ నోవోటెల్ లో “బీచ్ సాండ్ ఖనిజాల నుంచి టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ , శాశ్వత అయస్కాంతాలు – ఆంధ్రప్రదేశ్‌లో దేశీయ విలువ పెంపు గొలుసుల నిర్మాణం: అవకాశాలు” అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి కొల్లు మాట్లాడుతూ, టైటానియం, రేర్ ఎర్త్ పదార్థాలు రక్షణ, అంతరిక్ష, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాలకు కీలకమని వివరించారు. భవిష్యత్ సాంకేతిక రంగాలన్నీ ఈ వ్యూహాత్మక ఖనిజాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు స్పష్టమైన విధానం, వేగవంతమైన అనుమతులు, భూకేటాయింపులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని టైటానియం, రేర్ ఎర్త్ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మాజీ డీఆర్డీఓ చైర్మన్ , ప్రభుత్వ సలహాదారు డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా టైటానియం, రేర్ ఎర్త్ మాగ్నెట్లకు భారీ డిమాండ్ పెరుగుతోందన్నారు. రక్షణ, అంతరిక్ష, క్షిపణి సాంకేతికత, అధునాతన ఇంజినీరింగ్ రంగాల్లో ఈ పదార్థాల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని వివరించారు. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా దిగుమతులపై ఆధారపడకుండ దేశం ముందుకు సాగగలదన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా లభించే బీచ్ సాండ్ ఖనిజాలను సాంకేతిక పరిజ్ఞానంతో విలువ పెంచితే అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడే స్థాయికి చేరుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని సతీష్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (గనులు) ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, దీర్ఘకాలిక ఖనిజ సరఫరా భద్రతతో పాటు పరిశ్రమలకు అనుకూల విధాన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీచ్ సాండ్ ఖనిజాల వినియోగంలో పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక విధాన స్థిరత్వం, స్పష్టమైన మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయని ముఖేష్ కుమార్ మీనా భరోసా ఇచ్చారు.
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పార్కులు, పోర్ట్ కనెక్టివిటీ వంటి అంశాలు ఆంధ్ర ప్రదేశ్ కు ఉన్న బలాలని చెప్పారు. వేగవంతమైన నిర్ణయాలతో పరిశ్రమలు త్వరగా స్థాపన దశకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశ్రమల వాతావరణాన్ని రాష్ట్రంలో ఏర్పరచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలను ఈ రంగంలోకి ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
ఏపీఎండీసీ వైస్ చైర్మన్ , ఎండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గుర్తించిన బీచ్ సాండ్ ఖనిజ నిల్వలు పరిశ్రమలకు దీర్ఘకాలిక ముడి సరుకు భద్రతను అందిస్తాయని తెలిపారు. శాస్త్రీయ తవ్వకాలు, సమర్థవంతమైన ఖనిజ వేరు చేసే యూనిట్లు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ముడి ఖనిజాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వరకు ఏపీఎండీసీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. పరిశ్రమలతో భాగస్వామ్యాల ద్వారా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఖనిజ అన్వేషణ విస్తరణతో పాటు సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బాధ్యతాయుత తవ్వకాలతో పాటు పారదర్శకతను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.
వర్క్‌షాప్‌లో నిపుణుల ప్యానల్ చర్చలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేయనుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్‌కు ట్రంప్ షాక్..
- లండన్‌లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









