సిద్ధాంత నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన బత్తిన

- April 04, 2025 , by Maagulf
సిద్ధాంత నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన బత్తిన

బత్తిన నరసింహారావు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కృషి చేసిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. విద్యార్ధి దశలోనే సంఘ్ సిద్ధాంతాలు, దేశం పట్ల ఎల్లలు లేని ప్రేమ ఆయన్ని క్రియాశీలక రాజకీయాల వైపు నడిపించింది. గల్లీ నుంచి ఢిల్లీ భాజపా అగ్రనేతల వరకు నరసింహారావు అందరికీ అత్యంత సుపరిచితులు. ఒకపక్క రాజకీయాల్లో రాణిస్తూనే వ్యాపార, సామాజిక సేవా రంగాల్లో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. భాజపా సీనియర్ నేత స్వర్గీయ బత్తిన నరసింహారావు మీద ప్రత్యేక కథనం...

బత్తిన నరసింహారావు 1945లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన అవిభక్త నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా బత్తినవారిపల్లె గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన బత్తిన రామయ్య, అక్కమ్మ దంపతులకు జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన  తర్వాత తదుపరి విద్యాభ్యాసం కోసం ఒంగోలు పట్టణంలో నివాసం ఉంటున్న మేనమామ కొండ్ల రామయ్య ఇంటికి చేరి ఒంగోలులోనే హైస్కూల్ మరియు ఇంటర్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత యూపీలోని అలహాబాద్ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ బీఎస్సి పూర్తి చేశారు.      

బత్తిన తండ్రి రామయ్య ఆరోజుల్లోనే ఆరెస్సెస్ సానుభూతిపరులు. స్వాతంత్య్రం ముందు నుంచే ఉదయగిరి ఆరెస్సెస్ శాఖను తమ ఇంట్లో నిర్వహించేందుకు సంఘ్ ప్రచారకులకు తోడ్పడ్డారు. తండ్రి స్పూర్తితో చిన్నతనంలోనే సంఘం పట్ల బత్తిన అభిమానాన్ని  పెంచుకున్నారు. ఒంగోలులో ఉన్న సమయంలో కూడా సంఘ శాఖలకు క్రమం తప్పకుండా వెళ్లివారు. సంఘంతో ఆయనకి ఉన్న ఘాడమైన అనుబంధం మూలంగా వారి సూచనల మేరకు యూపీ వెళ్లి చదివారు.

 అలహాబాద్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఆరెస్సెస్ విద్యార్థి సంఘం ఏబీవీపీలో పనిచేశారు. ఉన్నత విద్యను పూర్తి చేసుకొని ఒంగోలు చేరుకున్న తర్వాత 60వ దశకం చివర్లో భాజపా పూర్వ రూపమైన జనసంఘ్ పార్టీలో చేరారు. జనసంఘ్ పార్టీ తరపున ఒంగోలు ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు విస్తరణలో కీలకంగా వ్యవహరించారు.1972లో జైఆంధ్రా, 1975 లో ఎమెర్జెన్సీ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పాల్గొని జైలుకు సైతం వెళ్లారు.

1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆ పార్టీలో మొదట చేరిన అతి కొద్ది నేతల్లో బత్తిన ఒకరు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ విస్తరణ భాద్యతలతో పాటుగా పార్టీ కార్యక్రమాల కోసం నిధుల సేకరణలో ముందుడేవారు.  ఒంగోలు పురపాలక సంఘానికి 1982, 1987లలో వరుసగా ఇస్లాంపేట నుంచి రెండు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1990లో భాజపా అగ్రనేత ఎల్.కె.అద్వానీ చేపట్టిన రామాజన్మ భూమి రథ యాత్రలో భాగంగా ఒంగోలులో జరిగిన సభకు జిల్లావ్యాప్తంగా కార్యకర్తలను సమీకరించి సభను విజయవంతం చేయడంతో జాతీయ నేతల దృష్టిలో పడ్డారు.

భాజపా జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బత్తిన నరసింహారావు ఒంగోలు లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి పోటీ చేసి మరో మారు ఓటమి పాలయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల యుద్ధంలో ఓటమి పాలైనప్పటికి  పార్టీలో మాత్రం ఆయన కీలకమైన నేతగా కొనసాగుతూ వచ్చారు. మూడు పర్యాయాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, రెండు సార్లు ఉమ్మడి ఏపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో భాజపా సీమాంధ్ర కన్వీనర్‌గా పలు పోరాట కార్యక్రమాలు నిర్వహించారు.  
 
బత్తిన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికి వ్యాపారవేత్తగా సైతం బాగా రాణించారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఒంగోలు తిరిగొచ్చిన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్,విజయవాడ వంటి నగరాలకే పరిమితం అయినా ఖరీదైన త్రీ స్టార్ హోటల్ వ్యాపారాన్ని ఒంగోలు వంటి అభివృద్ధి చెందబోతున్న పట్టణానికి  పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.1980ల్లోనే ఒంగోలు నగరంలో అత్యాధునిక వసతులతో కూడిన హోటల్ మౌర్యను ప్రారంభించారు.హోటల్ రంగంలో విశేషమైన అనుభవం కలిగిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోటలియర్స్ రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా పలుమార్లు పనిచేశారు.

బత్తిన సామాజిక సేవా రంగంలో సైతం తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా విద్యారంగంలో ఆయన కృషి మరువలేనిది. జిల్లాకు చెందిన విద్యార్థులకు ఉన్నతమైన నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా చేసుకొని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్మారకార్థం ఆయన జయంతి రోజున 1987లో ఒంగోలు పట్టణంలో ఆంధ్రకేసరి విద్య కేంద్రం (AKVK )పేరిట విద్యా  సంస్థను తన సొంత నిధులతో ప్రారంభించారు. తొలుత జూనియర్ ఇంటర్మీడియట్‌ కాలేజీతో మొదలై నేడు డిగ్రీ, లా మరియు బీఈడీ కళాశాలలు ఆ సంస్థ కింద ఉన్నాయి. AKVK విద్యాసంస్థల సెక్రెటరీ& కరస్పాండెంట్‌గా సంస్థల అభివృద్ధికి తన చివరి శ్వాస వరకు కృషి చేశారు. నేడు ఈ విద్యాసంస్థల్లో వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో బత్తినకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎమెర్జెన్సీ సమయంలోనే అప్పటి జనసంఘ్ యువనేతగా ఉన్న వెంకయ్యనాయుడు గారితో కలిసి పనిచేశారు.1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ టిక్కెట్ మీద ఒంగోలు లోక్ సభకు పోటీ చేసిన వెంకయ్య ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అదే విధంగా 1978 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం ఉదయగిరి నుండి పోటీ చేసిన వెంకయ్య  గెలుపునకు కృషిచేశారు. అనంతర కాలంలో వెంకయ్యతో బాటే భాజపాలో చేరారు. వెంకయ్య రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్ప్పటికి ఎప్పుడు ఒంగోలు వచ్చినా బత్తిన ఇంట్లోనే ఆయన విడిది చేసేవారు.
 
బత్తిన నరసింహారావు గారి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన సతీమణి పేరు వసుంధర దేవి. భర్త రాజకీయాల్లో, వ్యాపారాల్లో తీరిక లేకుండా గడుపుతున్న సమయంలో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి భర్తకు తగ్గ ఇల్లాలు అనిపించుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కుమారులు మహేష్ ,రాజేష్, కుమార్తె దేవసేన. కుమారులిద్దరూ డాక్టర్స్‌గా రాణిస్తుంటే, కుమార్తె గృహిణిగా స్థిరపడ్డారు. వీరి మేనల్లుడు లంకా దినకర్ భాజపా సీనియర్ నాయకుడు మరియు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.    

సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా నమ్మిన సిద్దాంతలకు కట్టుబడి రాజకీయాలు చేసిన వ్యక్తి నరసింహారావు. ఈ క్రమంలో ఆయన ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కున్నప్పటికీ భాజపాను విడవకుండా ఆ పార్టీ సంస్థాగత బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చారు. బత్తిన వ్యక్తిగతంగా సౌమ్యుడు మరియు  స్నేహశీలి. రాజకీయ వైరుధ్యాలే తప్ప ఎటువంటి వ్యక్తిగత వివాదాలు లేకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలతో సత్సంబంధాలను నెరిపారు. పార్టీ అధిష్ఠానం అప్పగించిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడం ఆయన వ్యక్తిగత నిబద్ధతకు నిదర్శనం. పార్టీ పట్ల అచంచలమైన విధేయత కలిగిన బత్తిన నరసింహారావు అనారోగ్యం కారణంగా 2017, జూలై 27న కన్నుమూశారు.      

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com