సినిమాజివీ-ఆర్జీవీ

- April 07, 2025 , by Maagulf
సినిమాజివీ-ఆర్జీవీ

తెలివైన వారు ఏదో ఒక విధంగా తాము తరచూ వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. ఆ కోవకు చెందిన వారే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసిన వారెవ్వరూ కాదనలేరు. ఒకప్పుడు వైవిధ్యంతో అందరినీ ఆకట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ళుగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ సాగుతున్నారు. దాంతో మునుపటి వైభవం రామ్ గోపాల్ వర్మకు కరువైందనే చెప్పాలి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అనగానే ‘రియల్ క్రియేటర్’ అంటూ ఆసేతుహిమాచలపర్యంతం కీర్తించారు. నేడు వర్మ పుట్టినరోజు సందర్బంగా ప్రత్యేక కథనం....

సినీ ప్రేక్షకులకు ఆర్జీవీగా సుపరిచితమైన పెన్మత్స రామ్ గోపాల్ వర్మ 1962, ఏప్రిల్ 7న హైదరాబాద్ నగరంలో కృష్ణంరాజు, సూర్యవతి దంపతులకు జన్మించారు. హైదరాబాద్ మరియు విజయవాడలలో చదువుకున్నారు. విజయవాడ వి.ఆర్. సిద్దార్థ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తండ్రి సినిమా రంగంలో ఉండటంతో ఆ రంగం వైపు మక్కువ పెంచుకొని కాలేజీ సమయంలో విపరీతంగా సినిమాలు చూసేవారట. వాటిని తనదైన శైలిలో స్నేహితులతో చెప్పటం అలవాటు చేసుకున్నారు. దీంతో సినిమాలపై ఇష్టం ఏర్పడింది.

వర్మలో ఎలాగైనా సినిమా తీయాలనే కసి పెరిగింది. అవకాశాల కోసం ఎదురుచూసే సమయంలో హైదరాబాద్‌లో వీడియోలను అద్దెకిచ్చే షాపు పెట్టారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలోని వారితో పరిచయాలు పెంచుకున్నారు. ఒకటి, రెండు సినిమాలకు సహాయకుడిగానూ పనిచేశారు. ఈ దశలోనే ‘రాత్రి’ సినిమా తీయాలని అనుకున్నారు. అయితే ఆ సినిమా చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ‘శివ’ కథను సిద్ధం చేసి నాగార్జునకు వినిపించారు. 1989లో శివ చిత్రంతో దర్శకుడయ్యారు.

తెలుగు సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఎన్నో అత్యున్నత స్థాయిలను అందుకుంది. అయితే సినీ విశ్లేషకులు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమను ‘శివ’కు ముందు.. తర్వాత అంటూ విభజిస్తారు. అంతలా చెరగని ముద్రవేసింది ఆ సినిమా. ‘శివ’ ఒక ట్రెండ్‌ సెట్టర్‌. సైకిల్‌ చైన్‌తో కొడితే బాక్సాఫీస్‌ బద్ధలైపోయింది. అరే ఇలాక్కూడా సినిమా తీస్తారా? అని అనుకున్నారు చాలా మంది. యువత ‘శివ’ స్టైల్‌కు ఫిదా అయిపోయింది. తాను కళాశాల చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఘటనలకు ఈ సినిమా ద్వారా దృశ్య రూపమిచ్చారు వర్మ. కథ, కథనం అంతా కొత్తగా ఉండటం ప్రతీ ఒక్కరినీ ఆకర్షించింది. వర్మ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతో చాలా పాపులర్‌ అయిపోయారు వర్మ..

‘శివ’ సినిమాతో తనదైన ముద్రవేసిన వర్మ ఆ తర్వాత ‘క్షణ క్షణం’ తీశారు. వర్మ టేకింగ్‌ స్టైల్‌కు చిత్ర పరిశ్రమ మరోసారి ఫిదా అయిపోయింది. కీరవాణి స్వరపరిచిన ‘జామురాతిరి జాబిలమ్మ..’ పాట మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత ‘అంతం’తో మరోసారి తన మార్కును చూపించారు. ఈ దశలోనే తాను మొదట అనుకున్న ‘రాత్రి’ సినిమాను తీసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చారు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది.

మ్యాన్లీ స్టార్ జగపతిబాబుతో తీసిన ‘గాయం’ కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. కామెడీ జోనర్‌లో వచ్చిన ‘మనీ’.. ‘మనీ మనీ’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా వర్మ నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించి అభిరుచి ఉన్న దర్శకుడు అనిపించుకున్నారు.

‘శివ’తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన వర్మ బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను రూపొందించారు. ‘రంగీలా’ బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని నమోదు చేసింది. ప్రేమకథా, యాక్షన్‌ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో వర్మ తీసిన సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉండటం, విషయాన్ని లోతుగా అన్వేషించి చెప్పడం బాలీవుడ్‌కు బాగా నచ్చింది. అయితే తీసే ప్రతీ చిత్రంలో తనదైన మార్కును చూపేవారు వర్మ. ‘సత్య’, ‘జంగిల్‌’, ‘కంపెనీ’, ‘భూత్‌’, ‘నాచ్‌’, ‘సర్కార్‌’, ‘సర్కార్‌ రాజ్‌’, ‘డిపార్ట్‌మెంట్‌’, ‘ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో వర్మ మంచి పేరుతెచ్చుకున్నారు.

వర్మ తొలి నుంచి చేసిన చిత్రాల్లో ఎక్కువ సినిమాలు వాస్తవ ఘటనల ఆధారంగా తీసినవే. తానూ ఏ విషయంపైనైనా సినిమా చేయాలనుకున్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన తనదైన శైలిలో వెండితెరపై ప్రెజెంట్‌ చేస్తారు. గ్యాంగ్ వార్స్ అన్నా, దెయ్యాలతో భయపెట్టడమన్నా వర్మకు మహా ఇష్టం. తరచూ ఈ రెండు జానర్స్ లోనే సినిమాలు తీస్తూ సాగారు వర్మ. అయినా తన ప్రతి చిత్రంలోనూ వర్మ టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. కథను అతను తెరకెక్కించే విధానానికి ఎంతోమంది ఫిదా అయిపోయి అభిమానులుగా మారారు. వర్మ స్ఫూర్తితోనే తెలుగునాట ఎంతోమంది దర్శకత్వంపై అభిమానం పెంచుకోవడం విశేషం!

 విభిన్న చిత్రాలతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో.. వివాదాలతోనూ అదే స్థాయిలో నిలిచారు. తెలుగులో తాను రూపొందించిన ‘గోవిందా గోవిందా’ చిత్రం విషయంలో అప్పటి ప్రాంతీయ సెన్సార్ ఆఫీసర్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ఆ తరువాత తెలుగు చిత్రాలు తీయననీ భీష్మించారు. అమెరికా నుంచి అమలాపురం వరకూ.. దిల్లీ నుంచి గల్లీ వరకూ.. స్టార్‌ నుంచి సూపర్‌ స్టార్‌ వరకూ ఎవర్నీ వదిలిపెట్టరు. తాను తెరకెక్కించిన సినిమాల విషయంలో ఎవరి మాట వినరు. బెదిరింపులకు అసలు లొంగరు. ఎవర్ని పొగిడినా, ఎవర్ని తిట్టినా ‘అతిలోక సుందరి’ శ్రీదేవిని మాత్రం ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అంటారు.

వివాదాలే తన చిత్రాలకు పబ్లిసిటీగా వాడుకొని, లాభాలూ చూశారు. అయితే ప్రతీసారి అదే తీరున సాగుతున్న వర్మతీరు అభిమానులకు సైతం చిరాకు కలిగించింది. తన సంతృప్తి కోసమే తాను సినిమాలు తీసుకుంటానని, ఎవరికోసమో పంథా అసలు మార్చుకోననీ వర్మ కుండబద్ధలు కొట్టారు. అయినా వర్మను అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారు. వారందరూ గతంలో అయన ప్రతిభను తలచుకుంటూ, ఎందుకతను అలా మారిపోయారో అర్థం కాక సతమతమవుతున్నారు.

వర్మ తన చిత్రాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. తన రెండవ తెలుగు చిత్రం ‘క్షణక్షణం’తో కీరవాణికి సంగీత దర్శకునిగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాతోనే కీరవాణి బాణీలు జనాన్ని కట్టిపడేశాయి. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకునిగా రాష్ట్ర, కేంద్రప్రభుత్వ అవార్డులనూ సొంతం చేసుకున్నారు. తాజాగా కీరవాణి అంతర్జాతీయ స్థాయిలోనూ తన ‘ట్రిపుల్ ఆర్’ మ్యూజిక్ తో గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు.

ఈ నేపథ్యంలో కీరవాణి, ముప్పై ఏళ్ళ క్రితమే తన ఫస్ట్ ఆస్కార్ ను రామ్ గోపాల్ వర్మ ‘క్షణ క్షణం’ ద్వారా అందుకున్నానని, ఆ సినిమాలేకపోతే తాను లేనని అన్నారు. తనపై అంతగా కృతజ్ఞత ప్రదర్శించిన కీరవాణికి వర్మ “ఆ మాటలు నన్ను చచ్చిపోయేలా చేశాయి. ఎందుకంటే చనిపోయినవారినే జనం పొగడుతూ ఉంటారు” అంటూ సమాధానమిచ్చారు. ఇలా ఉంటాయి, మన వర్మ గారి స్పందనలు.  

వర్మ ఉండటం మన ‘ఖర్మ’ అని కొందరు విమర్శిస్తుంటారు. మరికొందరు వర్మ సినిమాకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ‘విశ్వకర్మ’ అంటారు. ఏ విషయానైనా కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పే వర్మ మరిన్ని మంచి చిత్రాలను తీయాలని కోరుకుంటూ ఆయన మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)    

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com