విలక్షణ నటి-కోవై సరళ

- April 07, 2025 , by Maagulf
విలక్షణ నటి-కోవై సరళ

ఆమె మాతృభాష మలయాళం.పుట్టిందేమో తమిళనాడు.చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను ఇట్టే ఆట పట్టించేవారు. అయితే అందరితోనూ కలసి పోవడం ఆమె నైజం. చిన్నప్పుడు యమ్.జి.ఆర్. సినిమాలు విపరీతంగా చూసి ఆనందించేవారు సరళ. ఆయన సినిమాల్లోని పాటలను సైతం భట్టీయం వేసి పాడుకుంటూ సాగేవారు సరళ. అలా సినిమాలపై సరళకు ఆసక్తి కలిగింది. సరళ తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో విజయకుమార్, కె.ఆర్.విజయ జంటగా నటించిన ‘వెల్లి రదం’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.

భాగ్యరాజా నటించి, తెరకెక్కించిన ‘ముందానై ముడిచ్చు’లో 32 ఏళ్ళ గర్భవతి పాత్రలో నటించారామె. అప్పుడు సరళ పదో తరగతి చదువుతున్నారు. తరువాత రెండేళ్ళకు అదే భాగ్యరాజాకు ‘చిన్నవీడు’ సినిమాలో 65 ఏళ్ళ తల్లి పాత్రలోనూ కోవై సరళ నటించి అబ్బుర పరిచారు.  ఇలా చిన్నా చితకా పాత్రలు పోషిస్తున్న సరళకు కమల్ హాసన్ నిర్మించి, నటించిన ‘సతీ లీలావతి’లో ఏకంగా ఆయనకు భార్యగా నటించే అవకాశం దక్కింది. అందులో కోవై సరళ, కమల్ హాసన్‌తో పోటీ పడి కామెడీ పండించాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ సినిమా విజయంతో కోవై సరళ తమిళనాట బిజీ కమెడియన్ అయిపోయారు.

తెలుగులో కోవై సరళ తొలి చిత్రం బి.విఠలాచార్య దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రూపొందిన ‘వీరప్రతాప్’. తరువాత ‘అమ్మ కడుపు చల్లగా, పెళ్ళాం చెబితే వినాలి, పెళ్లామా మజాకా, కుంతీ పుత్రుడు, భైరవద్వీపం, అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, పెళ్ళి’ వంటి చిత్రాలలో తనకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు.

‘నువ్వే కావాలి’లో కోవై సరళ పండించిన కామెడీ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగునాట మరింత బిజీ అయిపోయారామె. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్‌లో కోవై సరళ నటించిన అనేక చిత్రాలు జనానికి కితకితలు పెట్టాయి. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో ప్రవేశించి, వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నారామె.

వ్యక్తిగత జీవితానికి వస్తే తన తోబుట్టువుల ఆలనాపాలనా చూసుకోవడం కోసం కోవై సరళ వివాహం చేసుకోలేదు.ఆ పిల్లలనే కన్నబిడ్డల్లా పెంచుకున్నారామె. తన అభిమాన హీరో ఎమ్జీఆర్ స్ఫూర్తితో కోవై సరళ రాజకీయాలపైనా ఆసక్తి పెంచుకున్నారు. తనకు గుర్తింపు సంపాదించి పెట్టిన కమల్ హాసన్ నెలకొల్పిన ‘మక్కల్ నీది మయం’ పార్టీ సభ్యురాలుగా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారామె.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com