ఐకానిక్ స్టార్-అల్లు అర్జున్
- April 08, 2025
అల్లు వారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో.. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి క్రియేట్ చేసుకున్నాడు.తనకంటూ పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకొని స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.
1983 ఏప్రిల్ 8న మద్రాసులో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండో కుమారుడిగా అర్జున్ జన్మించాడు. అలనాటి దిగ్గజ హాస్యనటులు స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి నట వారసుడు, మనవడు. తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ . మెగాస్టార్ చిరంజీవికి స్వయానా మేనల్లుడు. రామలింగయ్య గారి ప్రోద్బలంతో 1985లో విజేత, 1986లో స్వాతిముత్యం సినిమాల్లో బాలనటుడిగా అర్జున్ నటించాడు.
అర్జున్ చిన్నప్పటి నుంచీ మంచి డ్యాన్సర్. అల్లు అర్జున్ లోని ఈ ప్రతిభను గమనించిన చిరంజీవి 2001 లో తను హీరోగా నటించిన "డాడీ" చిత్రంలో ఒక చిన్న డ్యాన్స్ బిట్ చేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2003 లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "గంగోత్రి" సినిమాతో పూర్తి స్థాయి హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించాడు అల్లు అర్జున్. తర్వాత నటించిన ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య-2 చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. మెగాస్టార్ హీరోగా నటించిన "శంకర్ దాదా జిందాబాద్" చిత్రంలో అతిథి పాత్రలో నటించాడు.
ఆ తర్వాత కూడా చేస్తున్న ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన అర్జున్..తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక 2014లో వచ్చిన రేసుగుర్రం సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు.ఈ యాక్షన్ కామెడీ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ తరువాత కూడా సరైనోడు, సన్ అఫ్ సత్యమూర్తి, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలతో వరుసగా 100 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ ని అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడిగా నిలిచాడు. అలా వైకుంఠపురంలో సినిమాతో అయితే ఏకంగా 280 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
ఇక తన డబ్బింగ్ సినిమాలతో కేరళతో పాటు నార్త్ ఆడియన్స్‌ను అలరించిన అల్లు అర్జున్…2021 చివర్లో సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు కానీ.. మిగతా రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీలో రూ. 100 కోట్ల షేర్ (రూ. 353 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. తాజాగా సెకండ్ పార్ట్‌ని కూడా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ అంచనాలకు మించి ఉండడంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి తలపించింది.
కెరీర్ మొదటిలో మెగా హీరో, అల్లు వారి హీరో అని అనిపించుకున్న అర్జున్.. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్టైల్‌ని క్రియేట్ చేసుకొని స్టైలిష్ స్టార్‌గా, పాత్ర కోసం సినిమా కోసం తన చూపించే డెడికేషన్‌కి ఐకాన్ స్టార్ అనిపించుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!