మీడియా సానుకూల దృక్పథాన్ని పెంచాలి: వెంకయ్యనాయుడు
- April 10, 2025
హైదరాబాద్: సమాజంలో సానుకూల దృక్పథం పెంపొందించేలా, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా మీడియా కృషి చేయాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రతినిధులు గురువారం వెంకయ్యనాయుడుని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ ప్రతిని వెంకయ్యనాయుడుకి అందించారు.ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పత్రికలు, ఎలక్ర్టానిక్ మీడియా, డిజిటల్ మీడియాలు సంచనాలకు దూరంగా, వాస్తవాలకు దగ్గరగా సమాచారాన్ని ఇవ్వాలన్నారు. సమాజ నిర్మాణంలో, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన మీడియా విశ్వసనీయతను పోగొట్టుకోకూడదని సూచించారు. పాత్రికేయులు నిత్యం దేశహితాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. దేశానికి హాని కలిగించే వార్తలను, సమాచారాన్ని ప్రోత్సహించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం మన దేశానిదని గ్రహించాలని, అందుకే దేశానికి హాని కలిగించే విధంగా వార్తలు రాయకూడదని సూచించారు. దేశ సమైక్యతను ప్రోత్సహించే వార్తలు, ప్రకృతి వనరులను పరిరక్షించే విధంగా ప్రోత్సహించే వార్తలు రావాలన్నారు. ‘‘జర్నలిజం అంటే ఏ ఇజం వైపు మొగ్గు చూపకుండా నిజం మాత్రమే వినిపించే, చూపించే విధంగా ఉండాలి. కొంతమంది నేతలు సమాజాన్ని చీల్చే విధంగా, కులమత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులు అటువంటి వారికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకూడదు. జాతీయతా భావాన్ని పెంచే విధంగా, సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి పాటుపడే నేతలకు మద్దతుగా జర్నలిస్టులు, మీడియా ఉండాలి.’’ అని సూచించారు.
ఒకే దేశం-ఒకే ఎన్నికతో ప్రయోజనం
ఒకేదేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనపై ఇటీవల దేశవ్యాప్తంగా చర్చజరుగుతుండడంపై స్పందిస్తూ జమిలి ఎన్నికల వల్ల చాలా ప్రయోజనం ఉందన్నారు. కొన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం హేతుబద్ధంగా లేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు ముప్పు అన్న వాదనలో పసలేదన్నారు. ఒకేసారి కేంద్రానికి, రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించినా కేంద్రంలో ఎవరికి ఓటువేయాలో, రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలో ప్రజలు వివేచనతో, విచక్షణతో నిర్ణయం తీసుకోగలరని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను వ్యతిరేకించడం అంటే ప్రజల విజ్ఞతను ప్రశ్నించడమే అన్నారు. లోక్ సభకు, ఏదైనా రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగినా కేంద్రంలో ఒక పార్టీని, రాష్ట్రంలో మరో పార్టీని ఎన్నుకున్న సందర్భంగా గతంలో చాలా ఉన్నాయని ఉదాహరణలను ఉటంకించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!