బహుముఖ ప్రజ్ఞాశీలి-పఠాభి
- May 06, 2025
నెల్లూరు నెరజాణల సొత్తు బహుముఖ ప్రజ్ఞ- కవి తిక్కన కవిత్వంలోనేనా? రాజకీయాల్లోనూ, ఆటు యుద్ధ రంగంలోనూ సవ్యసాచి, అట్లా చెప్పుకుంటూ వస్తే తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి ఎవ్వరికీ తీసిపోరు. కవిత్వం రాసి సాహితీ లోకాన్ని ఒక ఊపు ఊపేసి, తర్వాత నిర్మాత, దర్శకుడుగా సినీ రంగంలో అనితర సాధ్యమైన కీర్తిని పొందారు. నేడు బహుముఖ ప్రజ్ఞాశీలి తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
భారతదేశ సాంస్కృతిక రంగంలో పఠాభిగా సుపరిచితులైన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి 1919, ఫిబ్రవరి 19న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్సులోని అవిభక్త నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులో భూస్వామ్య కుటుంబానికి చెందిన తిక్కవరపు రామిరెడ్డి, సుదర్శనమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి రామిరెడ్డి ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుడిగా, దానకర్ణుడిగా ప్రసిద్ధి గాంచారు. తండ్రికి ఉన్న పలుకుబడి కారణంగా నెల్లూరులోని వారింటికి అప్పటి జాతీయవాద నేతలు తరచూ వచ్చేవారు. పఠాభి 8వ ఏటనే వారింటికి వచ్చిన మహాత్మా గాంధీకి సపర్యలు చేశారు.
పఠాభి తన ప్రాథమిక విద్యను నెల్లూరులోని తమ ఇంట్లో పూర్తిచేసిన తర్వాత కలకత్తాలోని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోనూ, అమెరికాలోని కొలంబియాలోనూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. కొలంబియాలో చదువుతున్న సమయంలో గణితంలో ఆయనలోని అపారమైన ప్రజ్ఞకు విదేశీయులు సైతం ఆశ్చర్యపోయారు.
సాహిత్యపరంగా ఆయనకు శ్రీశ్రీతో చాలా సాన్నిహిత్యం వుండేది. తాను తన 12 మంది స్నేహితురాళ్ల నేపథ్యంలో రాసిన 'ఫిడేలు రాగాల డజన్' శ్రీశ్రీకి చూపించినపుడు నూతన ప్రయోగాలతో కవిత్వం చాలా బాగుందని, వెంటనే అచ్చు వేయమని, తాను పీఠిక రాస్తానని ప్రోత్సహించారట ఆయన! సాహిత్యంలో సమవుజ్జి అయిన బెజవాడ గోపాలరెడ్డి ఆయనకు స్వయానా బావ. 1930లో పఠాభి గారు "ఫిడేలు రాగాల డజన్" ప్రచురించారు. పద్యం, భావ కవిత్వానికి పూర్తి భిన్నమైన ప్రక్రియ. ఆయన కవితలో మాత్రా ఛందస్సు రూపేణా పరిఢవించింది. నిజానికి పఠాభి ఊహించని స్పందన ఆ కవితా సంపుటికి లభించింది.
శ్రీశ్రీ మరో ప్రపంచం, ఆరుద్ర 'శ్వమేవాహం' లాగా ఆ కవితాసంపుటికి ఆంధ్ర దేశ సాహిత్యంలో స్థానంలభించింది. పఠాభి 'ఫిడేలు' తర్వాత "పఠాభి ఫన్ చాంగం", "కయిత నాదయిత" అనే సంపుటులు కూడా వెలువరించారు. అవి మూడూ పాఠక జనామోదం పొందినప్పటికీ, "ఫిడేలు రాగాల డజన్' రాష్ట్రంలో మారుమ్రోగి పోయింది. అందులో పఠాభి తిరుగుబాటు చూడండి.
"నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రల్తో
పద్యాల నడుముల్ విరగదంతాను
చిన్నయ సూరి బాల వ్యాకరణాన్ని చాల దండిస్తాను"
ఇట్లా కొనసాగుతుంది కవిత. సాహిత్యం నుంచి అతని దృష్టి సినీ రంగం వైపు మళ్లినప్పుడు ఆయన నిర్మాతగా, దర్శకుడుగా ఉన్నత శ్రేణి చిత్రాలను అటు తెలుగులోనూ, ఇటు కన్నడంలోనూ నిర్మించారు. కన్నడిగులకు తొలి స్వర్ణకమలాన్ని 'సంస్కార' చిత్రంతో సంపాదించి పెట్టారా యన. తెలుగులో 'పెళ్లి నాటి ప్రమాణాలు, 'శ్రీకృష్ణార్జున యుద్ధం', 'భాగ్య చక్రం' వంటి చక్కని చిత్రాలను నిర్మించారు.
పఠాభి చేయని వ్యాపారం లేదు. సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువని ఆయన మిత్రులు చెబుతారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే నటి, సమాజ సేవకురాలు స్నేహలతా రెడ్డిని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. నిజానికి ఆయన కుటుంబ పెద్దలకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన స్త్రీ కోసం తన తండ్రి అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నారు. స్నేహలతతో కలిసి పఠాభి అనేక ఉద్యమాలకు సారథ్యం వహించారు. ప్రముఖ సోషలిస్టు దిగ్గజ నేతలైన లోహియా, జార్జ్ ఫెర్నాండేజ్ గార్లతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సోషలిస్టు పార్టీలో పనిచేశారు.
ఎమర్జెన్సీ కాలంలో స్నేహలత అరెస్టయి, జైల్లో సరైన వైద్యం లభించక మరణించారు. ''బ్రాంకైటిస్ ఇస్నోఫిలిస్' అనే వ్యాధి అమెను పట్టి పీడించింది. ఊపిరి పీల్చు కోవడానికి ఆమె పడ్డబాధ, కనీసం, మందులైనా అందించని బెంగళూరు జైలు సిబ్బంది క్రూరత్వాన్ని ఆమె తన మిత్రులకు రాసిన లేఖలో ఉల్లేఖించారు. ఎమర్జెన్సీ దురాగతాన్ని, క్రూరత్వ నేపథ్యాన్ని ఆ తర్వాత కళ్లకు కట్టేటట్లు చందు మారుత (కన్నడ) చిత్రంలో పఠాభి చిత్రీకరించారు. వీరికి ఒక కుమారుడు కోణార్క్ మనోహర్ రెడ్డి, కుమార్తె వందనారెడ్డి ఉన్నారు.
బహుముఖ ప్రజ్ఞతో రాణించడమే గాకుండా, పుట్టిన విక్రమ సింహపురి సీమకు సైతం జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చిన పఠాభి 2006, మే6వ తేదీన తన 87వ ఏట బెంగుళూరులో కన్నుమూశారు. పఠాభి శతజయంతి సందర్భంగా, 2019 ఫిబ్రవరి 19న మనసు ఫౌండేషన్ "పఠాభి రచనలు- లభ్య సమగ్ర రచనల సంపుటం" ను నెల్లూరులో జరిగిన శతజయంతి సభలో విడుదల చేసింది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!