టాలీవుడ్ సీనియర్ నటుడు-చలపతిరావు

- May 08, 2025 , by Maagulf
టాలీవుడ్ సీనియర్ నటుడు-చలపతిరావు

నిండైన విగ్రహంతో విలన్ గా జడిపించి, కమెడియన్ గా కితకితలు పెట్టి, కొన్నిసార్లు సెంటిమెంట్ నూ పండించి జనాన్ని ఆకట్టుకున్నారు చలపతిరావు. అనేక ప్రేమకథా చిత్రాల్లో అమ్మాయికో, అబ్బాయికో తండ్రిగా నటించి అలరించారాయన. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న యన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. ఆయన తనయుడు రవిబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ నటునిగా మారినా, తరువాత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గానూ మెప్పించారు. తండ్రినీ డైరెక్ట్ చేశారు రవిబాబు. అలా పుత్రోత్సాహంతో పొంగిపోతుంటారు చలపతిరావు. నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం... 

చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు 1944 మే 8న కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించారు. ఆయన కన్నవారు మణియ్య, వియ్యమ్మ. చదువుకొనే రోజుల నుంచీ చలపతిరావుకు సినిమాలంటే పిచ్చి. యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు చూసి, ఆయనలా తానూ తెరపై కనిపించాలని ఆశించారు చలపతిరావు. మద్రాసు చేరుకొని పలు ప్రయత్నాలు చేశారు. కొన్ని చిత్రాలలో చిన్నాచితకా పాత్రల్లో కనిపించారు. తరువాత యన్టీఆర్ ను కలసి తన పరిస్థితి వివరించగా, ఆయన ప్రోత్సహించారు. అలా తొలిసారి తెరపై డైలాగ్ చెప్పే పాత్ర యన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో లభించింది. ఇందులో యన్టీఆర్, నాగభూషణం మునిసిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయగా, ఎన్నికల అధికారి పాత్రలో చలపతిరావు నటించారు. 

1969లో విడుదలైన ‘కథానాయకుడు’ ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందులో చలపతిరావుకు కాసింత గుర్తింపు లభించింది. ఆ తరువాత నుంచీ యన్టీఆర్ చిత్రాలలో తనకు లభించిన వేషాలు వేస్తూ ముందుకు సాగారు. అనేక చిత్రాలలో విలన్ దగ్గర ఉండే అనుచరునిగా కనిపించారు. పలు సినిమాల్లో అమ్మాయిలను రేప్ చేసే పాత్రల్లోనూ నటించారు. దాంతో అలాంటి వేషాలే చలపతిరావును పలకరించసాగాయి. 

చలపతిరావు నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’. ఈ చిత్రానికి యన్టీఆరే దర్శక నిర్మాత. పైగా ఈ సినిమాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దాంతో చలపతిరావుతో యన్టీఆర్ పలు పాత్రలు పోషింప చేశారు. సూతుడు, ఇంద్రుడు, బ్రాహ్మణుడు, జరాసంధుడు వంటి పాత్రల్లో ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో కనిపించారు చలపతిరావు. సంచలన విజయం సాధించిన ఆ చిత్రం తరువాత చలపతిరావుకు మంచి పాత్రలు రావడం మొదలయింది. అప్పటి దాకా బిట్ రోల్స్ లో కనిపించిన చలపతిరావు, ఆ తరువాత కాసింత గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించసాగారు.

దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన తొలి చిత్రం ‘గులాబి’లో హీరోయిన్ తండ్రి పాత్రను ధరింప చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.చలపతిరావు ఇలాంటి పాత్రలూ పోషించగలరా అని జనం అనుకొనేలా చేశారు. ఆ పై కృష్ణవంశీ తన రెండో చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’లో హీరో నాగార్జునకు తండ్రిగా చలపతిరావును నటింప చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటి నుంచీ చలపతిరావుకు అనేక చిత్రాలలో నాయికానాయకులకు తండ్రిగా నటించే అవకాశాలు లభించాయి. 

చలపతిరావు భాగస్వామిగా కొన్ని చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా ‘కలియుగ కృష్ణుడు’ నిర్మాణంలో తొలిసారి ఆయన భాగస్వామి అయ్యారు. తరువాత “కడప రెడ్డెమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ళ పంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి” వంటి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. కొంతకాలంగా చలపతిరావు చిత్రాలలో కనిపించడం లేదు. 2022, డిసెంబర్ 24న తన 78 ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. ఏది ఏమైనా చలపతిరావు పేరు వినగానే ఆయన పోషించిన పలు పాత్రలు దృశ్య మాధ్యమం ద్వారా మన కనుల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com