ఉస్తాద్ స్టార్-రామ్ పోతినేని
- May 15, 2025
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టెప్పులు, స్టైలిష్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. 'దేవదాస్' తో హీరోగా పరిచయమై, ఉస్తాద్ హీరోగా మారిన రామ్ పోతినేని పుట్టినరోజు నేడు.
1988 మే 15వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త పోతినేని మురళీ, పద్మశ్రీ దంపతులకు హైదరాబాద్ లో రామ్ జన్మించాడు. రామ్ పెదనాన్న ప్రముఖ టాలీవుడ్ సీనియర్ సినిమా ప్రొడ్యూసర్, స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవి కిశోర్. చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో, సెంట్ జాన్ పాఠశాలలో రామ్ చదువుకున్నాడు. టాలీవుడ్ యుంగ్ హీరో శర్వానంద్ తో కూడా బంధుత్వం ఉంది. రామ్ అక్క మధుస్మితను శర్వా అన్న కళ్యాణ్ వివాహం చేసుకున్నాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
రామ్ చిన్నతనంలోనే సినిమాల మీద ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 15 ఏళ్లకే 2002లో 'అడయాళం' అనే తమిళ షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించాడు. ఈ షార్ట్ ఫిలిమ్‌లో రామ్ డ్రగ్స్‌కి బానిస అయిన ఓ కుర్రాడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో నూతన నటీనటులతో తీసిన 'కాదల్' (ప్రేమిస్తే) చిత్రానికి ఆడిషన్ ఇచ్చాడు, కాని వయస్సు సరిపోక పోవడంతో ఆ సినిమా ఛాన్స్ మిస్సయ్యాడు. ఆ తర్వాత ప్రముఖ నట శిక్షకులు ఎన్.జె. భిక్షు, అరుణా భిక్షుల దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.
2006లో 18 సంవత్సరాలకే వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఇందులో హీరోయిన్ ఇలియానా. ‘దేవదాసు’ సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్.. ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టడమే కాదు.. డాన్సులు ఫైట్లు స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి.
రామ్ రెండో చిత్రం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జగడం’ బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. అయితే ఈ సినిమాలో రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన ‘రెడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.. అతనికి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాని అదే పేరుతో హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేసి బంపర్ హిట్ అందుకున్నాడు.
రెడీ సినిమా తర్వాత రామ్‌కి ఆ స్థాయి పెద్ద హిట్లు లభించలేదు. 'మస్కా' సినిమాతో మాస్ ఆడియన్స్ ని మెప్పించిన రామ్.. 'గణేశ్', ‘రామరామ కృష్ణకృష్ణ’ చిత్రాలతో ఫ్లాప్స్ చవి చూసాడు. 'కందిరీగ' చిత్రం హిట్టిచ్చినా.. ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’ మూవీస్ నిరాశ పరిచాయి. ‘పండగ చేస్కో’ చిత్రం పర్వాలేదనిపించగా.. 2016 లో కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'నేను శైలజ' సినిమా రామ్ కు మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'శివం', ‘హైపర్’, 'ఉన్నది ఒకటే జిందగీ' ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేదు.
2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటివరకూ చాక్లెట్ బాయ్‌లా ఉన్న రామ్‌ను ఈ సినిమాలో పక్కా మాస్ లుక్ లో చూపించాడు పూరీ. ఈ సినిమాతో రామ్ కు మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాస్త ఉస్తాద్ రామ్ గా మారాడు. అయితే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 'రెడ్' ఓకే అనిపించినా.. కోలీవుడ్ లీడింగ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ద్విబాషా చిత్రం 'ది వారియర్' మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. 2023 చివర్లో వచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద, 2024లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
రామ్‌కు నార్త్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. అతను నటించిన ప్రతీ సినిమా హిందీలోకి డబ్ కాబడి, మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. యూట్యూబ్ లో 2 బిలియన్ల వ్యూస్ ఘనత వహించిన మొదటి హీరోగా.. ఏకైక సౌత్ హీరోగా రామ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. దీంతో అతని సినిమాల డబ్బింగ్ రైట్స్ & డిజిటల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా మార్కెట్ ను విస్తరించుకోవడంపై దృష్టి సారించిన రామ్.. దీనికి తగ్గట్టుగానే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లను సెట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తన 22వ చిత్రం "ఆంధ్ర కింగ్ తాలూకా" ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
టాలీవుడ్ లోని సంపన్న యువ హీరోల జాబితాలో రామ్ ముందుంటాడు. వందల కోట్లకు వారసుడైనప్పట్టికి, సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఎంతో కష్టపడి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వడం రామ్‌కే చెల్లింది. రాబోయే రోజుల్లో సరికొత్త చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ హోదా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..