అద్భుతమైన నటీమణి-శాంతకుమారి
- May 17, 2025
తెలుగు సినిమా ఆరంభంలో నాటకాల్లో నటించిన వారినే కెమెరా ముందూ నటింప చేసేవారు. ఇప్పటికీ కొందరు నాటకాల వారిని తెరపై చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే రూపురేఖలనే మార్చే సే రోజులు వచ్చాయి కానీ, ఆ రోజుల్లో పాత్రకు తగ్గ రూపం, అందుకు తగ్గ అభినయం, వాటిని మించిన వాచకం తప్పని సరిగా నటీనటులకు ఉండాల్సిందే! తెలుగునేలపై పలు నాటకాల ద్వారా నటిగా తనను తాను నిరూపించుకొని తరువాతి రోజుల్లో శాంతకుమారిగా తెరపై ఓ వెలుగు వెలిగారు. నేడు సుప్రసిద్ధ నటీమణి శాంతకుమారి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 1920 మే 17న ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో వెల్లాల శ్రీనివాసరావు, పెద్ద నరసమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే ఆమె హావభావాలు చూసి, నటిగా భలే రాణిస్తుందనే వారు. ఇంట్లోనే పురాణాలను భట్టీయం వేసిన ఆమె రంగస్థలంపై గుక్క పోకుండా సంబాషణలు, పద్యాలు చెప్పే తీరు, నటించిన వైనం చూసి జనం జేజేలు పలికారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన శాంతకుమారి మద్రాసులోని ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్ కావాలని వెళ్ళారు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. సాలూరు రాజేశ్వరరావుతో కలసి కొన్ని లలిత గీతాలు పాడారు. తరువాత విద్యోదయ పాఠశాలలో సంగీతం నేర్పేందుకు నెలకు రెండు రూపాయల జీతంపై చేరారు. అదే సమయంలో ‘శశిరేఖా పరిణయం’లో శశిరేఖగా నటించే అవకాశం ఆమెకు లభించింది.
చిత్రసీమలో అడుగు పెట్టగానే సుబ్బమ్మ కాస్తా శాంతకుమారిగా మారిపోయారు. ఆ తరువాత పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘సారంగధర’లో చిత్రాంగిగా నటించి మెప్పించారు శాంతకుమారి. ఆ సినిమా పూర్తి కాగానే శాంతకుమారి, పుల్లయ్య పెళ్ళాడారు. భర్త పి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాలాజీ’ చిత్రంలో పద్మావతిగా నటించి అలరించారు. అదే కథ తరువాతి రోజుల్లో ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా యన్టీఆర్ తో పుల్లయ్య రూపొందించారు. ఈ చిత్రంలో వకుళామాతగా శాంతకుమారి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
అలాగే 1937లో రూపొందిన ‘సారంగధర’లో చిత్రాంగిగా నటించిన శాంతకుమారి, 1957లో తెరకెక్కిన ‘సారంగధర’లో రత్నాంగిగా నటించడం విశేషం! “ధర్మపత్ని, పార్వతీకళ్యాణం, కృష్ణప్రేమ” వంటి చిత్రాలలో నాయికగా నటించి ఆకట్టుకున్నారామె. చిత్రమేమంటే తన కంటే వయసులో నాలుగేళ్ళు చిన్నవాడయిన ఏయన్నార్ కు నాయికగా ‘మాయాలోకం’లో నటించారు శాంతకుమారి. ఆ తరువాత అనేక చిత్రాలలో ఏయన్నార్ కు తల్లిగా అభినయించారామె. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి హీరోలకు పలు చిత్రాలలో తల్లిగా నటించి ఆకట్టుకున్నారామె.
ఎన్టీఆర్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘రాముడు-భీముడు’లో శాంతకుమారి ఆయనకు అక్కగా నటించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తల్లా పెళ్ళామా’లో శాంతకుమారిని తల్లి పాత్రలో నటింప చేశారు. అందులో హరికృష్ణకు తినిపిస్తూ, “మమతలెరిగిన నా తండ్రి…” అనే పాటను శాంతకుమారి స్వయంగా గానం చేశారు. తన ఓపిక ఉన్నన్ని రోజులు నటించారామె. నాయికగా నటించిన రోజుల్లో తన పాటలు తానే పాడుకొనేవారామె. తరువాతి రోజుల్లోనూ కొందరు శాంతకుమారి పాత్రలకు ఆమెతోనే పాటలు పాడించారు. సినిమాలలో నటించడం మానేసిన తరువాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను రాసి, స్వరపరిచేవారు శాంతకుమారి.
పుల్లయ్య, శాంతకుమారి దంపతులు చిత్రసీమలో ప్రవేశించిన కొత్తవారిని ఎంతగానో ప్రోత్సహించేవారు. అందువల్ల ఆ దంపతులను అందరూ ‘అమ్మానాన్న’గా భావించేవారు. సినీ పరిశ్రమలో శాంతకుమారిని ‘మమ్మీ’ అని, పుల్లయ్యను ‘డాడీ’ అంటూ అభిమానంగా పిలిచేవారు. ఈ దంపతులు ‘పద్మశ్రీ’ పతాకంపై కొన్ని చిత్రాలనూ నిర్మించారు. 1981లో పి.పుల్లయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించగా, 1999లో శాంతకుమారికి కూడా వెంకయ్య అవార్డు దక్కింది. ఇలా భార్యాభర్తలు ఒకే అవార్డును అందుకోవడం అన్నది విశేషం. దాదాపు నాలుగు దశాబ్దాలు నటిగా కొనసాగిన శాంతకుమారి 2006 జనవరి 16న తుదిశ్వాస విడిచారు.ఈ నాటికీ శాంతకుమారి నటించిన చిత్రాలు బుల్లితెర పై ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఆమె అభినయం నవతరాన్నీ సైతం ఆకట్టుకుంటూనే ఉంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..