విజయవాడలో కొత్త నేషనల్ హైవే

- May 20, 2025 , by Maagulf
విజయవాడలో కొత్త నేషనల్ హైవే

అమరావతి: ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనుల్ని వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ అయ్యే రోడ్లపై ఫోకస్ పెట్టింది. తాజాగా అమరావతిని తెలంగాణకు కనెక్ట్ చేసే గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణను పూర్తిచేసే పనిలో ఉంది. ఎన్టీఆర్ జిల్లా(NTR District)లో 30 కిలోమీటర్ల మేర ఈ హైవే నిర్మాణం కోసం 329.30 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 243.67 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 85.63 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.ఈ భూసేకరణ పూర్తయితే, విజయవాడ-ఖమ్మం మధ్య రాకపోకలు మరింత సులువుగా సాగుతాయి అంటున్నారు.విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కోసం అధికారులు మిగిలిన భూమిని సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎక్కువగా ఉండటంతో వాటిని ముందుగా పూర్తి చేస్తారు.ఆ తర్వాత ప్రైవేటు భూములపై దృష్టి పెడతారు. ఖమ్మం-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను మూడు ప్యాకేజీలుగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు పనులు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి ఎన్టీఆర్ జిల్లా మీదుగా మూడో ప్యాకేజీ పని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు మిగిలిన భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లాలోని రెమిడిచర్ల నుంచి మొదలయ్యే ప్యాకేజ్ 03 గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు గంపలగూడెం మండలంలోని తునికిపాడు దగ్గర ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తాయి. ప్రస్తుతం ఇక్కడే భూసేకరణ జరుగుతోంది.

మొత్తం 30 కిలోమీటర్ల రహదారి కోసం 329.30 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 273.73 ఎకరాలు ప్రైవేటు భూములు ఉండగా వీటిలో ఇప్పటికే 243.67 ఎకరాలను సేకరించగా మరో 30.6 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఈ భూములతో పాటుగా ప్రభుత్వ భూములు 32.74 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ 22.83 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 85.63 ఎకరాల సేకరణ పూర్తయితే గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు మార్గం సుగమం అవుతుంది.ఈ హైవేకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో కలిపి 9,86,125 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. గంపలగూడెంలోని తునికిపాడులో 36,704.98 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే జి.కొండూరు పరిధిలోని గ్రామాల మీదుగా విజయవాడ రూరల్ మండలంలోకి నేషనల్ హైవే వస్తుంది. దీంతో ఈ గ్రామాలన్నింటిలోనూ భూసేకరణ జరుగుతోంది. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు మీదుగా విజయవాడ శివారులోని జక్కంపూడి వద్ద వెస్ట్ బైపాస్‌కు ఈ రోడ్డు కలుస్తుంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ భూసేకరణ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com