వెదర్ బడ్జెట్ ....!

- May 29, 2025 , by Maagulf
వెదర్ బడ్జెట్ ....!

వాతావరణ బడ్జెట్ భావనను ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం వాతావరణ ఆర్ధిక నిపుణుడు జాన్వార్డ్ ప్రవేశపెట్టారు. పారిస్ ఒప్పంద లక్ష్యాలతో ప్రజా ఆర్థికాలను సమ ప్రాధాన్యం చేయడానికి ఆయన, ఇతర నిపుణులతో కలిసి వాతావరణ మార్పు బడ్జెట్ సమీకృత సూచిక (బడ్జెట్ ఇంటిగ్రేషన్ ఇండెక్స్) వంటి పరిపూరకరమైన సాధనాలు, చొరవలను సమర్పించారు. 2017లో పారిస్‌లో నిర్వహించిన “ఒకే ఒకగ్రహం సమావేశం" (వన్ ప్లానెట్ సమ్మిట్) లో ప్రకటించిన గ్రీన్ బడ్జెటింగ్ చొరవపై సహకారం, బడ్జెట్ పరిధిలో ఆకుపచ్చ (గ్రీన్) వృద్ధిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడాన్ని మరింత ప్రోత్సహించింది.

వాతావరణ బడ్జెట్ అనేది విధానాలు, చర్యలు, బడ్జెట్‌పై నిర్ణయం తీసుకోవడంలో వాతావరణ నిబద్ధతలు, పరిగణనలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే పాలనా వ్యవస్థ. ఇందులో సంబంధించిన ఖర్చులను గుర్తించడం, వర్గీకరించడం, ముఖ్యంగా వాతావరణ మార్పును నిర్వహించాల్సిన, పర్యవేక్షించాల్సిన బడ్జెట్ అంశంగా పరిగణించడం జరుగుతుంది. ఈ విధానం విస్తృతమైన "గ్రీన్ బడ్జెటింగ్" లో భాగం. ఇది ప్రజా బడ్జెట్లు, వాతావరణం, పర్యావరణ లక్ష్యాలతో సమప్రాధాన్యము నిర్ధారించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

సుస్థిరమైన అభివృద్ధి కోసం వాతావరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి దేశం నార్వే. రాజధాని ఓస్లో మరియు కొన్ని నగరాలు, మునిసిపల్ ఉద్గారాలను కనిపెట్టి తగ్గించడానికి వాతావరణ బడ్జెట్‌ను స్వీకరించాయి. కార్బన్ సంగ్రహణ, నిల్వ, విద్యుత్వాహన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, సున్నాఉద్గార మండలాలు వంటి చర్యలను తీసుకున్నాయి. 

వాతావరణ బడ్జెట్ ప్రభుత్వాలకు వాతావరణ పెట్టుబడులకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వడానికి, వ్యయంలో జవాబుదారీతనం పారదర్శకతను మెరుగుపరచడానికి జాతీయ అభివృద్ధి ప్రణాళికలు, వాతావరణ చర్యల పర్యవేక్షణ,మూల్యాంకనం, సమర్థవంతమైన చర్యలు గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం (ఉదా., పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ద్వారా), వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా (ఉదా. వాతావరణ స్థితిస్థాపక మౌలిక సదుపాయాలను నిర్మించడం) రెండింటికీ వనరుల కేటాయింపును సులభతరం చేస్తుంది. 

వాతావరణ బడ్జెట్లు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటాయి. వీటిలో తగినంత నిధులు లేకపోవడం, డేటా సేకరణ, పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం, విసృత బడ్జెట్లలో ఏకీకరణ, రాజకీయ సవాళ్లు, రాజకీయ సంకల్పం, మద్దతుకు సంబంధించిన సమస్యలు, ప్రజల అవగాహన, అంతర్జాతీయ సహకారం మొదలైన సవాళ్లు ఉన్నాయి.

జూన్ 2024 నాటికి, ప్రపంచ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో దాదాపు 82 శాతానికి బాధ్యత వహించే 107 దేశాలు, జాతీయ వాతావరణ కార్యాచరణ ప్రణాళికవంటి విధాన పత్రంలోనికర సున్నా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల విడుదల ప్రతిజ్ఞలను చేసాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికా 2020లో 2.3 బిలియన్ల డాలర్లను అందించింది. 2025కి ఆ దేశం 11.4 బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తుంది. కానీ ఇది ఇప్పటికీ అమెరికా న్యాయమైన వాటాలో పావు వంతు మాత్రమేనని ఓవర్సీస్ డెవలప్మెంట్ సంస్థ (ODI) తెలిపింది. మొత్తం మీద, 27 దేశాల యూరోపియన్ యూనియన్ వాతావరణ ఆర్ధిక సహాయం అందించే అతిపెద్ద సమూహం. 2020లో 23.38 బిలియన్ యూరోలు (26.15 బిలియన్ డాలర్లు) అందించింది.

వాతావరణ మార్పుల వల్ల అతి తక్కువ ప్రభావితమైన దేశాలలో సాధారణంగా నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ వంటి స్కాండినేవియన్ దేశాలు, అలాగే ఐస్లాండ్, సింగపూర్ ఉన్నాయి. వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి దేశం యునైటెడ్ కింగ్డమ్. మే 1, 2018న, పార్లమెంట్ పర్యావరణ మరియు వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం 2050 నాటికి నికర గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తొలగించడానికి చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది, ఇతర చర్యలతో పాటు వృథా శూన్యత (జీరోవెస్ట్) ఆర్ధిక వ్యవస్థను ప్రతిపాదించింది. వాతావరణ సూచికలో స్వీడన్ అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు.

2005తో పోలిస్తే 2030 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 59 శాతం తగ్గించాలని 2045 నాటికి నికర జీరో కార్బన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశానికి నిర్దిష్ట వాతావరణ బడ్జెట్ రూపకల్పన లేనప్పటికీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు కేంద్ర బడ్జెట్లో వనరులు కేటాయించబడ్డాయి. డేటా విస్తరణ (డేటా ఎన్వలప్మెంట్) విశ్లేషణ ప్రకారం, వాతావరణ అనుకూలత కోసం భారతదేశానికి 2030 నాటికి దాదాపు రూ.85.6 లక్షల కోట్ల సంచిత వ్యయం అవసరం అవుతుంది, ఇది గణనీయమైన దేశీయ అంతర్జాతీయ ఫైనాన్సింగ్ అవసరాన్ని నొక్కి చెబుతుంది.

2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించడానికి, 2030 నాటికి దాని ఉద్గారాల తీవ్రతను 45శాతం తగ్గించడానికి భారతదేశం కూడా ప్రతిజ్ఞ చేసింది. 2008లో ప్రారంభించబడిన వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక వివిధ రకాల జాతీయ సౌర మిషన్, జాతీయ ఇంధన సామర్థ్యమిషన్, జాతీయ సుస్థిర ఆవాసంపై మిషన్, జాతీయ నీటి మిషన్, హిమాలయన్ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి జాతీయ మిషన్, గ్రీన్ ఇండియా కోసం జాతీయ మిషన్, జాతీయ సస్టైనబుల్ వ్యవసాయం మిషన్, స్వచ్ఛమైన వాతావరణం (క్లీన్ క్లైమేట్) కోసం జాతీయ వ్యూహాత్మక జాతీయ మిషన్లను వివరిస్తుంది.

2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాలలో 50 శాతం పునరుత్పాదక వనరుల నుండి తీర్చాలని ప్రతిజ్ఞ చేసింది. సవరించిన ఇంధన పరిరక్షణ చట్టం పరికరాలు, ఉపకరణాలు, భవనాలు, పరి శ్రమల ద్వారా శక్తి వినియోగాన్ని నియంత్రిస్తుంది. జాతీయ సుస్థిర ఆవాస మిషన్ భవనాలు, పట్టణ ప్రణాళిక, వ్యర్థాల నిర్వహణలో శక్తి సామ ర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ స్పేస్లు మరియు సమర్థవంతమైన వ్యర్థ వ్యవస్థలు వంటి స్థిరమైన పట్టణ అభి వృద్ది పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది.

భారత దేశంలోని ఇతర వాతావరణ చర్యలు చర్యలు దేశీయ కార్బన్ మార్కెట్ అభివృద్ధి, కార్బన్ సంగ్రహణ, నిల్వ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిం చడానికి, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ, వివిధ వాయు కాలుష్య నియంత్రణ చర్యలు స్వచ్ఛమైన గాలి చొరవలను అమలు చేయడం మొదలైనవి. 2030 నాటికి మూడు వేల మిలియన్ టన్నుల వరకూ కార్బన్ డై ఆక్సైడ్ అదనపు సంచిత కార్బన్ సింక్‌ను సృష్టించడానికి భారతదేశం చెట్ల కవచాన్నిపెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

వాతావరణ సమస్య మొత్తం ప్రపంచానికి సంబంధించినది కాబట్టి, ప్రపంచ దేశాలు వాతావరణ బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. వాతావరణ బడ్జెటను ప్రవేశపెట్టడానికి ఆర్థిక బడ్జెట్ మాదిరిగానే నిర్మాణాత్మక, బహుళ రంగాల విధానం అవసరం, కానీ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను కని పెట్టి తగ్గించడంపై దృష్టి పెట్టాలి. చట్టపరమైన, సంస్థాగత చట్రం, ఆధార గీత (బేస్క్రీన్) అంచనా భవిష్యత్ ఉద్గారాలను పారిస్ ఒప్పందం ఆధారంగా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం, జాతీయ బడ్జెట్ పర్యవేక్షణ, కాలానుగుణంగా ఏకీకరణ డేటా సేకరణ విశ్లేషణాత్మక సాధనాలను సామర్థ్య నిర్మాణం మెరుగుపరచడం, వాతావరణ చర్యల ప్రభావాన్ని క్రమం తప్పకుండా అంచనా వేయడం లక్ష్యాలను సర్దుబాటు చేయడం వంటి కీలక చర్యలు కూడా అవసరం. అప్పుడు మాత్రమే ప్రపంచం శుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించగలదు.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com