సినిమా రివ్యూ: ‘భైరవం’.!

- May 30, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘భైరవం’.!

ముగ్గురి హీరోల యాక్షన్ డ్రామానే ‘భైరవం’ సినిమా. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోలుగా దివ్య పిళ్లై, ఆనంది, అదితి శంకర్ హీరోయిన్లుగా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలను ఎఫెక్టివ్‌గా కట్ చేశారు. మరి, సినిమా అంచనాల్ని అందుకుందా.? రీ ఎంట్రీలో వచ్చిన మనోజ్ వంటి హీరోకీ, లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన నారా రోహిత్.. ఇంకా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కీ ‘భైరవం’ ఎంతే మేర కలిసొచ్చిందీ.. తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
ఏ రక్త సంబంధం లేకుండానే స్నేహ బంధంతో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వుంటారు గణపతి వర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్). ఈ ఇద్దరి కోసం ప్రాణమిచ్చేంత అభిమానం చూపిస్తాడు శీను (బెల్లంకొండ శ్రీనివాస్). ఊరిలో వారాహి అమ్మవారి దేవాలయానికి కోట్ల విలువ చేసే భూములూ, ఆభరణాలూ వుంటాయ్. తర తరాలుగా వాటికి రక్షణ కవచంలా కాపాడుకుంటూ వస్తారు గణపతి, వరద కుటుంబాలు. ఈ భూముల్ని ఎలాగైనా కాచేయాలని మంత్రి (శరత్ లోహితాశ్వ) అనుకుంటాడు. ఈ క్రమంలో అడ్డుగా వున్న గణపతి, వరదల స్నేహాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్యా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మరి, మంత్రి ప్రయత్నం ఫలించిందా.? స్నేహితులు విడిపోయారా.? లేక కలిసే మంత్రిని ఎదుర్కొన్నారా.? తెలయాలంటే ‘భైరవం’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీనటుల పనితీరు:                                                                                                           నారా రోహిత్ ఎటువంటి పాత్ర పోషించినా ఆ పాత్రకు ప్రాణం పోస్తాడన్న సంగతి ఆయన గత చిత్రాల ద్వారా తెలిసిందే. ఈ సారి కూడా అదే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు తన వరద పాత్రలో.రీ ఎంట్రీలో మంచు మనోజ్‌కి దక్కిన ఓ మంచి పాత్రగా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో గణపతి పాత్ర. భీకరమైన సంభాషణలు చెబుతూ.. అక్కడక్కడా నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ.. తనదైన స్టైల్‌లో పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యంగ్‌స్టర్ బెల్లంకొండ  శ్రీనివాస్ ఇన్నాళ్లూ కమర్షియల్ హీరోగా తన ప్రతిభ చూపించాడు. ఈ సినిమాలో ఇద్దరు సీనియర్లను మ్యాచ్ చేస్తూ.. కథకి కీలకమైన పాత్రలో నటించి మెప్పించాడు. వరద, గణపతి  పాత్రలకు జోడీగా నటించిన దివ్య పిళ్లై, ఆనంది పాత్రలు ఈ సినిమాలో కీలకమైన భూమిక పోషించాయ్. యంగ్ హీరోయిన్ అదితిని కేవలం పాటల వరకే పరిమితం చేశారు. సహజ నటి జయసుధ.. తనకు కోట్టిన పిండి వంటి పాత్రనే చేశారు. ఆ పాత్రలో తన అనుభవాన్నంతా రంగరించి చాలా అలవోకగా నటించేశారు. విలన్ పాత్రలో శరత్ లోహితాశ్వ బాగా మెప్పించారు. వెన్నెల కిషోర్ పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది. మిగిలిన పాత్రధారులు పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ, ఎంచుకున్న నటీనటుల ఎంపిక బాగుంది. కథనాన్ని కూడా ప్రత్యేకంగా ఏమీ నడిపింది లేదు. కానీ, లీడ్ రోల్స్‌కి ఇచ్చిన యాక్షన్ ఎలివేషన్లే సినిమాకి ప్రధాన ఆకర్షణ. భావోద్వేగాలు కూడా సినిమాలో కీలకమే. కానీ, అవేమీ ప్రేక్షకుడి హృదయాన్ని తాకేలా అనిపించవు. ఎలివేషన్ల మీద పెట్టిన ఫోకస్ కథపైనా, కథనం పైనా ఇంకాస్త పెట్టి వుంటే బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్. అంత మంది ఆర్టిస్టులతో  తెరను నిండుగా ఉన్నతంగా మలచడానికి నిర్మాతలు ఎక్కడా రాజీ పడినట్లు లేదు. ఫస్టాఫ్‌ ఒకింత బోరింగ్‌గా అనిపించినా.. సెకండాఫ్ యాక్షన్ ఘట్టాలు కొంత బెటర్ అనిపిస్తాయ్. ఎడిటింగ్‌లో అక్కడక్కడా కొన్ని కతెరలు పడి వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ, పాటలు మాత్రం.. సీరియస్‌గా సాగుతున్న కథనానికి బ్రేకులు వేసినట్లనిపిస్తుంది. ఓవరాల్‌గా చేస్తే, సినిమా సాంకేతికంగా వున్నతంగానే అనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్:
హీరోల ఎంపిక, వారి పరిచయ సన్నివేశాల్లో డిజైన్ చేసైిన యాక్షన్ ఘట్టాలు... ఇంటర్వెల్ బ్లాక్..పతాక సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్:
పాత కథే, ప్రత్యేకత లేని కథనం, ఆకట్టుకోని భావోద్వేగాలు.. అనవసరం అనిపించిన పాటలు..

చివరిగా:
ట్రిపుల్ యాక్షన్ డ్రామా.. లాజిక్స్ అడక్కుండా.. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా.. వెళితే ‘భైరవం’ యాక్షన్ మూవీ.. ఓకే ఒకసారి చూసేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com