తెలంగాణ: ఈ రోజు మధ్యాహ్నం ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

- June 08, 2025 , by Maagulf
తెలంగాణ: ఈ రోజు మధ్యాహ్నం ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

హైదరాబాద్: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు చివరికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించేందుకు తీసుకున్న ప్రయత్నాలు ఇప్పుడు సఫలమయ్యే దశకు చేరుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:20 గంటల మధ్య కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.ఈ విస్తరణలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ, ఎస్సీ మరియు బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంది.

కొత్త మంత్రులుగా వి.శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్?
ఈసారి మంత్రివర్గ విస్తరణలో మూడు పదవులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో బీసీ వర్గం నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ (మాదిగ) వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎస్సీ (మాల) వర్గం నుంచి వివేక్‌లకు అవకాశం దక్కనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అదే సమయంలో శాసనసభ ఉప సభాపతి పదవికి రామచంద్రునాయక్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎంపికల వెనుక కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది.

అధిష్ఠాన చర్చలు..ఫైనల్ సంతకం
ఈ నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం తీసుకున్నవిగా తెలిసింది. వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం నిన్న తుది ముద్ర వేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అనంతరం పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపి విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేశారు.

అసంతృప్తుల ఓర్పు.. శాంతనిద్ర?
మొదట మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీ వర్గాలకే అవకాశం కల్పించాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే, మాదిగ సామాజికవర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఆయన సోదరుడు, ప్రస్తుత మంత్రి వెంకట్‌రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమవుతుందని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

ఇంకా ఖాళీ ఉన్న మంత్రి పదవులు.. ఆశలు కల్పిస్తున్నాయి
ప్రస్తుతం ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఇంకా ముగ్గురికి మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. వీటితో పాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు జరుగుతోంది. బీసీ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్‌గా కొనసాగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత సభాపతి ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇచ్చే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం గట్టిగా పోటీపడుతున్న వారిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మాదిగ వర్గం నుంచి ఉద్యమం..ముఖ్యమంత్రికి వినతి
ఇదిలావుండగా, ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున, దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఎంను కలిసిన వారిలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేముల వీరేశం, సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగినన్ని అవకాశాలు రాలేదని, ఈసారైనా మంత్రివర్గంలో తమకు తప్పనిసరిగా చోటు కల్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.

మీనాక్షి నటరాజన్‌ పాత్ర కీలకం
గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో ఉండి, పార్టీలోని నేతలు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపిన మీనాక్షి నటరాజన్, సామాజిక న్యాయానికి అనుగుణంగా మంత్రివర్గ విస్తరణ ఉండాలని అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ నైతికతకు భిన్నంగా మాట్లాడే వారిని భవిష్యత్తు పదవుల్లో పరిగణనలోకి తీసుకోబోమని అధిష్ఠానం స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com