తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు

- June 14, 2025 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు ముమ్మరంగా కురుస్తున్నాయి.

ఉపరితల ఆవర్తనంతో వర్షాలు
ఉపరితల ఆవర్తనం కర్ణాటక దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశ్చిమ మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా దక్షిణ ఒడిస్సా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి మీ ఎత్తులో ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి.

ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాలకు IMD వర్షా సూచన చేసింది. ద్రోణి ఇప్పుడు పశ్చిమ-మధ్య అరేబియా సముద్రం నుండి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం (జూన్‌ 14) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రబలత
ద్రోణి ప్రభావంతో ఏపీలో నేటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం నుండి రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృత వాతావరణం నెలకొంటుంది. రేపు ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. నిన్న శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయానికి కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 50 మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగల 48. 5 మిమీ, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 44.5 మిమీ, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురం 40.5 మిమీ, నంద్యాల జిల్లా చౌతకూరులో 32.7 మిమీ చొప్పున వర్షపాతం రికార్తైంది.

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలోనూ వర్షాలు కొనసాగుతాయనే సూచనలు వెలువడుతున్నాయి. జూన్ 14 నుండి 16 తేదీల వరకు కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముంది.

ఈ రోజు తెలంగాణ లోని నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే..ఈ రోజు తెలంగాణలోని ఖమ్మంలో గరిష్టంగా 36.4, మహబూబ్ నగర్ లో కనిష్టంగా 29.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com