ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన కేటీఆర్..

- June 16, 2025 , by Maagulf
ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన కేటీఆర్..

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థలకు నగదు చెల్లించినట్లు కేటీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఎదుట భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తమపై కేసులు పెట్టి విచారణల పేరుతో ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోబోమని అన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. ఇవాళ నన్ను ఏసీబీ విచారణకు పిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది. మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా. విచారణ అనంతరం నన్ను అరెస్టు చేసినా చేయొచ్చు అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లొచ్చాం. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు.. వంద సార్లయినా జైలుకు వెళ్తా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

లై డిటెక్టర్ కు కూడా నేను సిద్ధం. కాంగ్రెస్, బీజేపీవి దొంగాటలు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ కేసులు అంటూ కేటీఆర్ అన్నారు. రైతు బంధును.. ఎలక్షన్ బంధుగా మార్చేశారు. 420 గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. లక్షలాది మంది కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరుకు ముందు కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని నందినగర్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ భవన్ కు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు తరలివచ్చారు. అక్కడి నుంచి కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com