సైబర్ దాడులతో ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

- June 18, 2025 , by Maagulf
సైబర్ దాడులతో ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్‌ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉంది. తాజాగా, సైబర్‌ దాడులు కూడా ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం ఇరాన్‌కు చెందిన ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, సెపా బ్యాంక్ పై భారీ సైబర్‌ దాడులు జరిగాయి. ఫలితంగా ఆ బ్యాంక్ సర్వర్లు, ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. కొన్ని గంటలు కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ దాడుల ప్రభావం పెట్రోల్‌ బంక్‌లపై కూడా పడింది. నెట్‌వర్క్‌ లేనందున ప్రజలు ఇంధనం పొందలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున ప్రయత్నించి, ఆన్‌లైన్‌ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించారు. అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటివే మరిన్ని దాడులు జరగవచ్చనే భయం ఇరాన్‌ను పట్టుకుంది.

ప్రభుత్వ కమ్యూనికేషన్ పరికరాలపై నిషేధం
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలు పబ్లిక్ నెట్‌వర్క్‌తో పనిచేసే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వాడకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. వారు వాడుతున్న పరికరాలను తక్షణమే సమర్పించాలని ఆదేశించింది.

ఫోన్ల ద్వారా ట్రాకింగ్‌కు భయంతో ఆంక్షలు
ఇరాన్ అధికారులు అనుమానిస్తున్నారు–ఫోన్లలోని ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా ఇజ్రాయెల్ దళాలు తమను గమ్యం చేసుకుంటున్నాయని. హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యకు ఈ విధానమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే అధికారులు కమ్యూనికేషన్ పరికరాలపై పూర్తిగా నిషేధం విధించారు.

టెహ్రాన్‌లో పరిస్థితి బీభత్సం
యుద్ధ ప్రభావం టెహ్రాన్ జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. నగరంలో ఆహార కొరత మొదలైంది. దుకాణాలు మూతపడటంతో బ్రెడ్‌ కూడా దొరకడం లేదు. ప్రజలు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ “టెహ్రాన్ ఖాళీ చేయాలి” అన్నా, పోలీసులు నిషేధం విధిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com