హ్యాండ్సమ్ యాక్టర్-అరవింద్ స్వామి

- June 18, 2025 , by Maagulf
హ్యాండ్సమ్ యాక్టర్-అరవింద్ స్వామి

ఆరడగుల అందం, పసిమిఛాయ, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి సైతం ఈ అరవిందుదుడిని పరిణయం ఆడాలని ఒకానొక సమయంలో ఉవ్విళ్ళూరింది. దీనిని బట్టే అప్పట్లో అరవింద స్వామి క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. తర్వాత సినిమాల నుంచి తప్పుకొని మంచి వ్యాపారవేత్తగా రాణించారు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు అరవింద్ స్వామి. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

అరవింద్ స్వామి 1970 జూన్ 18న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి వి.డి.స్వామి తమిళనాట పేరు మోసిన వ్యాపారవేత్త. తల్లి భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన వసంత. మద్రాసు లయోలా కాలేజ్ లో బి.కామ్, చదివి పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన అరవింద్ స్వామి అక్కడ ఎంబీఏ చేశారు. చెన్నైలో చదువుకుంటున్న సమయంలో కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించారు. ఆ యాడ్స్ లో అరవింద్ ను చూసిన మణిరత్నం తన ‘దళపతి’లో ఓ కీలక పాత్రకు ఆయనను ఎంచుకున్నారు.

ఓ వైపు రజనీకాంత్, మరోవైపు మమ్ముట్టి మధ్యలో అరవింద్ అయినా ‘దళపతి’లో నటునిగా మార్కులు సంపాదించారు. ఆ పై మణి తెరకెక్కించిన ‘రోజా’తో అరవింద్ హీరో అయిపోయారు. ఈ సినిమా అనువాదమై తెలుగునాట సైతం అలరించింది. అలాగే హిందీవారినీ ఆకట్టుకుంది. ఆ ఒక్క సినిమాతోనే అరవింద్ నటునిగా, ఎ.ఆర్. రహమాన్ సంగీత దర్శకునిగా ఎంతో పాపులర్ అయిపోయారు. మణిరత్నం రూపొందించిన ‘బొంబాయి’ సినిమా సైతం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విశేషంగా మురిపించింది. ఈ సినిమా తరువాత అరవింద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అప్పుడే శ్రీదేవి మనసు కూడా అరవింద్ వైపు సాగింది.

ప్రముఖ మళయాళ దర్శకులు భరతన్ రూపొందించిన ‘దేవరాగం’లో శ్రీదేవి, అరవింద్ కలసి నటించారు. ఆ సినిమా తరువాత వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారనీ విశేషంగా వినిపించింది. అప్పటికే అరవింద్ ఓ ఇంటివాడు. అయినా సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం సహజమేగా! తెలుగులో అరవింద్ స్వామి నేరుగా నటించిన చిత్రం ‘మౌనం’. ఈ చిత్రాన్ని ‘అంకురం’ ఫేమ్ సి.ఉమామహేశ్వరరావు తెరకెక్కించారు. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. సాత్ రంగ్ కే సప్నే చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అరవింద్ అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో మణిరత్నం నిర్మించి దర్శకత్వం వహించిన సఖి చిత్రం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.

2000-13 వరకు తమ కుటుంబ వ్యాపారాలతో పాటుగా తనే సొంతంగా టెక్నాలజీ, మానవవనరులు రిలేటెడ్ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే 2005లో జరిగిన ఒక ప్రమాదంలో అరవింద్ తీవ్రంగా గాయపడి దాదాపు ఐదేళ్ల పాటు నడవలేకపోయారు. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలో సైతం పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో టాలెంట్ మాగ్జిమమ్ అనే కంపెనీ స్టార్ట్ చేసి విజయవంతంగా రన్ చేశారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.3,300 కోట్లు ఉంటుందని సమాచారం.

వ్యాపారాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 2013లో మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన కడలి సినిమాతో ఇండస్ట్రీలోకి అరవింద్ రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన "తనీ ఒరువన్" చిత్రంతో విలన్‌గా మారి తన నటనతో సినీ క్రిటిక్స్ మరియు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదే చిత్రం తెలుగులో ధృవ చిత్రంగా తెరకెక్కగా అందులోను నటించారు. దాదాపు 21 ఏళ్ళ తర్వాత ధృవ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అరవింద్ స్టైలిష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. 2024లో వచ్చిన సత్యం సుందరం చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com