ఓటర్ ఐడీ కార్డుల జారీ పై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్

- June 19, 2025 , by Maagulf
ఓటర్ ఐడీ కార్డుల జారీ పై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్

న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు కీలక సంస్కరణలు చేపట్టింది. ఇప్పటి వరకు ఓటర్ ఐడీ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసిన తర్వాత కనీసం ఒక నెల నుంచి రెండు నెలల వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ ఆలస్యం ఓటర్లను అసంతృప్తికి గురిచేసేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ ఐడీ ప్రధాన పత్రం కావడంతో, ఈ పత్రాన్ని త్వరితగతిన ప్రజలకు అందించేందుకు తాజా నిర్ణయం తీసుకుంది.

ఓటర్లకు 15 రోజుల్లో కార్డు:
కొత్త ఓటర్ల నమోదుకు గానీ, ఇప్పటికే ఉన్న ఓటర్ కార్డులో వివరాలను సరిచేసుకునేందుకు గానీ దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఓటర్ ఐడీ కార్డు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త కార్డు లేదా మార్పులు చేర్పులు చేసిన కార్డు పొందడానికి నెల రోజులకు పైగా సమయం పడుతుండగా, ఈ నూతన విధానంతో ఆ జాప్యం తగ్గనుంది.

రియల్ టైమ్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్ అప్డేట్స్:
ఈ కొత్త విధానం ప్రకారం ఓటర్ ఐడీ తయారీ నుండి డెలివరీ వరకు రకు ప్రతి దశను రియల్ టైమ్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికి, అలాగే తమ ఓటర్ కార్డులోని వివరాలలో మార్పులు కోరిన వారికి ఇది వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్డు తయారీ నుంచి ఓటరు చేతికి అందే వరకు ప్రతి దశను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) స్థాయి నుంచి పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేసేంత వరకు రియల్-టైమ్ ట్రాకింగ్ చేయనున్నట్లు పోల్ అథారిటీ తెలిపింది. అంతేకాకుండా, కార్డు ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లకు తెలియజేయనున్నారు.

త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యం:
ఈ నిర్ణయం వెనుక మరో ముఖ్యమైన కారణం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, వచ్చే ఏడాది తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు సత్వర సేవలు అందించేందుకు ఎన్నికల సంఘం ఈ దిశగా కసరత్తు చేపట్టింది. . ఇదే సమయంలో యువ ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుండటంతో, వీరికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత వేగవంతమైన సేవలు అందించాలనే దిశగా ఈ చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com