మెట్రో ఫేజ్-2 కు అనుమతులు ఇవ్వండి..కేంద్ర మంత్రికి సీఎం రేవంత్
- June 19, 2025
న్యూ ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-II)కు అవసరమైన అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరణ అత్యవసరమని ఆయన వివరించారు.
ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ఆయన నివాసంలో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 76.4 కి.మీ పొడవైన మెట్రో ఫేజ్-II ప్రాజెక్టును రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి దీనిని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
సుస్థిర అభివృద్ధికి మెట్రో కీలకం
మెట్రో ఫేజ్-II అమలుతో నగర రవాణా వ్యవస్థ మరింత వేగవంతం అవుతుందని, రహదారి ట్రాఫిక్ తగ్గి ప్రజలకు అనుకూలమైన ప్రయాణ అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు.ఇది నగర సుస్థిరాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు అవసరమైన సవరణలతో ప్రాజెక్టు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) ఇప్పటికే సమర్పించినట్టు సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఇతర విభాగాలు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి,రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







