గోవా ఉద్దండ నేత-ప్రతాప్ సింగ్ రాణే
- June 19, 2025
ప్రతాప్ సింగ్ రాణే..గోవా రాజకీయాలను ఐదున్నర దశాబ్దాల పాటు తిరుగులేకుండా శాసించిన నాయకుడు. సంపన్న రాచ కుటుంబంలో జన్మించినా ప్రజాస్వామ్య విధానాల పట్ల అచంచలమైన విశ్వాసంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి రాజకీయ విరమణ వరకు ఆ రాష్ట్ర ప్రజల కష్టసుఖాల్లో భాగమయ్యారు.తన అసామాన్యమైన ఉదార వ్యక్తితత్వంతో ప్రత్యర్థులను సైతం ఆకర్షించారు. గోవాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఒకటా... రెండా.. రికార్డు స్థాయిలో ఐదు పర్యాయాలు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నేడు గోవా రాజకీయ ఉద్దండ నేత ప్రతాప్ సింగ్ రాణే మీద ప్రత్యేక కథనం...
ప్రతాప్ సింగ్ రాణే పూర్తిపేరు ప్రతాప్ సింగ్ రావోజీ రాణే. 1938, జనవరి 28న ఒకప్పుడు పోర్చగీస్ పాలనలో ఉన్న గోవాలోని సన్క్యూలిమ్ రాజ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం సన్క్యూలిమ్ కోటలోనే సాగినప్పటికి, వారి తండ్రి ప్రోద్బలంతో పూణేలో ఉన్న శివాజీ మిలిటరీ బోర్డింగ్ స్కూల్లో చేరారు. ఆ తర్వాత పూణే ఆర్ట్స్ కాలేజీ నుంచి బీఎస్సి పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి టెక్సాస్ ఎ & ఎం యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి బీబీఎం పూర్తిచేశారు.
రాణే కుటుంబానికి గ్వాలియర్ రాజ కుటుంబంతో పాటుగా ఇతర మరాఠా రాజ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తండ్రి రావోజీ సత్రవ్ రాణే పోర్చగీస్ పాలనకు వ్యతిరేకంగా గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. గోవా దేశంలో విలీనం జరిగిన తర్వాత వీరి కుటుంబం స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేది. గోవా రాజకీయ కురువృద్ధుడు మరియు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) వ్యవస్థాపకుడైన దయానంద్ బందోద్కర్ ఆహ్వానం మేరకు రాణే 1969లో ఆ పార్టీలో చేరారు. బందోద్కర్ శిష్యరికంలో రాష్ట్ర రాజకీయాల మీద ఆసక్తితో కూడిన పట్టును సాధించారు.
1972లో సత్తారి నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికైన వెంటనే బందోద్కర్ మంత్రివర్గంలో రెవెన్యూ, అసెంబ్లీ వ్యవహారాలు, స్థానిక పరిపాలన శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బందోద్కర్ మార్గదర్శనంలో పాలనా వ్యవహారాల్లో పట్టు సాధించారు. బందోద్కర్ రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దబడుతున్న సమయంలోనే 1973లో బందోద్కర్ ఆకస్మిక మరణంతో రాణే రాజకీయంగా వెనకబడ్డారు. బందోద్కర్ కుమార్తె శశికళ కకోద్కర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మంత్రివర్గంలో 1973-77 మధ్యలో న్యాయ శాఖ, లేబర్, హోసింగ్, రెవెన్యూ, పౌర సరఫరాలు, స్థానిక పరిపాలన మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. అయితే, శశికళ భర్త ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం పెరగడంతో పాటుగా, రాణేకి పార్టీలో పెరుగుతున్న ఆదరణను నివారించేందుకు అతని మద్దతుదారులపై వేటు వేయడం వంటి వ్యవహారాలతో పార్టీకి ఆదరణ కరువైంది.
1977 నాటికి శశికళతో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఎంజిపికి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన రాణే శాసనసభలో కకోద్కర్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాడారు. పైగా గోవాలో అతిపెద్ద సామాజిక వర్గమైన మరాఠాలకు బందోద్కర్ తర్వాత నాయకుడిగా అవతరించడం రాణే రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 1979లో శశికళ ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలనా ఏర్పడిన సమయంలో రాణే కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలు సైతం రాణేకు మద్దతుగా నిలవడం జరిగింది.
1980 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి గోవా & డమన్ అండ్ డయ్యు మూడో సీఎంగా రాణే బాధ్యతలు చేపట్టారు. 1980-87 వరకు సీఎంగా కొనసాగిన రాణే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, విద్యుత్ సంస్కరణలు, కదంబ రవాణా వ్యవస్థ రూపకల్పన, స్కూల్స్, కాలేజీలు మరియు విశ్వవిద్యాలయాల ఏర్పాటు వంటి ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి పనులు రాణే హయాంలో నిరాటంకంగా సాగుతూ వచ్చాయి. 1987లో డమన్ అండ్ డయ్యు గోవా నుంచి విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరణ తర్వాత గోవా రాష్ట్ర తోలి ముఖ్యమంత్రిగా రాణే బాధ్యతలు చేపట్టారు. 1987-90 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
1990 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత మూడు నెలలు సీఎంగా ఉన్న తర్వాత రాణే వ్యతిరేక వర్గ నేతలు కలిసి అసమ్మతి వర్గంగా మారి ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించడంతో సీఎంగా దిగిపోయారు. 1990-94 వరకు వివిధ వ్యక్తులు సిఎంలుగా మారి ప్రజల్లో నాయకుల పట్ల విశ్వాసం సన్నగిల్లడంతో 1994లో మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం రాణే నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీని గెలిపించడమే కాకుండా ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు.
1994-98 వరకు సీఎంగా ఉన్న రాణే రాష్ట్రాన్ని అప్పులు ఊబి నుంచి బయట పడేసేందుకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. టూరిజం రంగానికి కావాల్సిన ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. లిక్కర్ తయారీ మీద ఉన్న అధిక పన్నులు రద్దు చేయడంతో దేశంలో ఉన్న ప్రముఖ లిక్కర్ తయారీ కంపెనీలు తమ ప్లాంట్స్ గోవాలో స్థాపించడం మొదలుపెట్టాయి. గోవాకు టూరిజంతో పాటుగా మైనింగ్ మీద సైతం అధిక ఆదాయం సమకూరుతుంది. మైనింగ్ రంగ సంస్కరణల విషయంలో చాలా బాగా చొరవ చూపించి అందుకు కావాల్సిన బిల్లులను అసెంబ్లీలో పాస్ చేయించారు. ఆ నాలుగేళ్లలో గోవా ఎకానమీ బాగా పుంజుకుంది. దాంతోపాటుగా యువతకు ఉపాధి లభించింది.
1998 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో పాటుగా సీనియర్ నాయకుడు విల్ఫ్రెడ్ డిసౌజా వల్ల పార్టీ చీలి ఎంజిపి, భాజపా మరియు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఆ ప్రభుత్వం 128 రోజుల తర్వాత కూలిపోవడం, డిసౌజాతో వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999 నుంచి 2002 వరకు గోవా అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నారు. 2002-05 వరకు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 2005లో మనోహర్ పారికర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత స్వతంత్రుల మద్దతుతో ఐదోసారి సీఎం అయ్యారు. 2005-07 వరకు సీఎంగా పనిచేసిన తర్వాత 2007-12 వరకు రెండోసారి గోవా స్పీకర్ అయ్యారు. బహుశా దేశ రాజకీయాల్లో సీఎంగా పనిచేసిన వ్యక్తి స్పీకర్ బాధ్యతలను నిర్వర్తించడం ఒక్క రాణే గారికి మాత్రమే సాధ్యం అయ్యింది.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన ప్రతాప్ రాణే 2017 వరకు అదే పదవిలో కొనసాగారు. 2017లో దాదాపుగా అధికారంలోకి రాబోయే సమయంలో కాంగ్రెస్ సీనియర్ల తప్పిదాల వల్ల భాజపా అధికారంలోకి రావడం జరిగింది. 1972 నుంచి 2022 వరకు సత్తారి, పోరియం నియోజకవర్గాల నుంచి 11 సార్లు ఎన్నికయ్యారు. గోవా రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నేతగా రాణే నిలిచారు. 2022లో క్రియాశీలక రాజకీయాల నుంచి విరమణ పొందారు.
ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రతాప్ రాణే గోవా ప్రజానీకానికి చేసిన విస్తృతమైన సేవలను అన్ని వర్గాల ప్రజలు, నేతలు కొనియాడారు తప్పించి ఏనాడు దెప్పిపొడవలేదు. ఆ రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నేతలతో కంటే స్వపక్ష అసమ్మతి నేతలతోనే ఎక్కువగా రాజకీయ అస్తిత్వ పోరాటాలు చేశారు. మనోహర్ పారికర్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా అవతరిస్తున్న సమయంలో రాణే వ్యవహరించిన వ్యూహాత్మక వైఖరి కారణంగానే గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని పర్యాయాలు చీలిపోయినా నాయకత్వ లోపం కనపడలేదు. పైగా పారికర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించేవారు. ప్రస్తుతం రాజకీయాల కంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..