ప్రజా వారధి-కొల్లు రవీంద్ర
- June 20, 2025
కొల్లు రవీంద్ర ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న బలమైన నాయకుల్లో ఒకరు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రవీంద్ర ..ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన దగ్గరకు వచ్చే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారిని సొంత మనుషుల్లా చూసుకుంటారు. టీడీపీ యువనేత నారా లోకేష్ బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో రవీంద్ర ఒకరు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
కొల్లు రవీంద్ర 1973, జూన్ 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మధ్యతరగతి అగ్నికుల క్షత్రియుల కుటుంబంలో జన్మించారు.మచిలీపట్నంలోనే ఇంటర్ వరకు చదువుకున్న రవీంద్ర విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో చదువుకు ఆటంకం కలుగుతుంది గుర్తించి బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు.ఆ తర్వాత గుంటూరులోని హిందూ కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేశారు.
రవీంద్ర ఒకవైపు విద్యార్థి రాజకీయాల్లో ఉంటూనే తన భవిష్యత్తు మీద దృష్టి సారించి వ్యాపార రంగంలోకి దిగారు. వ్యాపార రంగంలో ఉంటూనే ఆయనకు ప్రముఖ తెదేపా నేత , మాజీ మంత్రి స్వర్గీయ నడకుదిటి నరసింహారావు గారి కుమార్తె నీలమతో వివాహం జరిగింది. అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు ఆకర్షితుడైన రవీంద్ర తెదేపాలో సాధారణ కార్యకర్తగా చేరి, తన కృషి మరియు క్రమశిక్షణతో పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలోనే దాదాపు దశాబ్దం పాటు కొనసాగారు.
రవీంద్ర 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ నరసింహారావు మచిలీపట్నం నుంచి పోటీ చేసిన సమయంలో ఆయన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించి విజయాన్ని తెచ్చిపెట్టారు. మామ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్రను చంద్రబాబు గుర్తించి రాజకీయంగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు.అలా బాబు ప్రోత్సాహం తొడవ్వడంతో రవీంద్రకు పార్టీలో గుర్తింపు లభిస్తూ వచ్చింది.2004 ఎన్నికల్లో కూడా మామ తరపున పనిచేశారు. ఆ ఎన్నికల్లో అయన ఓటమి పాలైన తర్వాత రాజకీయాల్లో ఇమడలేక రాజకీయ విరమణ చేసిన తర్వాత, మచిలీపట్నంలో పార్టీకి అన్ని తానై వ్యవహరించేందుకు ప్రయత్నం చేశారు.
2009లో తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగిన రవీంద్ర ప్రజారాజ్యం అభ్యర్థి కారణంగా ఓట్లు చీలడం వల్ల ఓటమి పాలయ్యారు. అయితే, ఓటమి పాలైన నాటి నుండి నియోజకవర్గంలోనే తిరుగుతూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వచ్చారు.అదే సమయంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో సైతం మచిలీపట్నం కేంద్రంగా పార్టీ తరపున పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో అధినేత బాబు గారి మచిలీపట్నం పర్యటనను విజయవంతం చేయడంలో నాయకులతో కలిసి సమిష్టిగా కృషి చేశారు. 2014 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2014-19 మధ్య యువజన సర్వీసులు, చేనేత మరియు బీసీ సంక్షేమం, న్యాయ, ఎక్సైజ్, స్కిల్ డెవలప్మెంట్, ఎన్.ఆర్.ఐ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు.ఈ సమయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి సమర్థవంతంగా పనిచేస్తూ బాబు మెప్పును పొందారు. మచిలీపట్నంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా నిర్వహించారు.బాబుతో మాట్లాడి మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ముందడుగు పడేలా చేశారు. మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సామాజిక వర్గంలో బాగా వెనుకబడిన వర్గాలకు బలమైన నాయకుడుగా ఎదిగారు. 2019లో కొన్ని తప్పుల కారణంగా ఓటమి పాలయ్యారు.
2019-24 వరకు మచిలీపట్నం కేంద్రంగా రవీంద్ర అప్పటి అధికార పార్టీ నేతల బెదిరింపులు సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఉద్యమించారు. రవీంద్ర చేస్తున్న పోరాటాలకు హడలెత్తిన అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఆయనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించి 54 రోజుల పాటు జైల్లో పెట్టించారు. తనపై పెట్టిన కేసులకి వేరవకుండా ప్రభుత్వ అక్రమాలపై రాజీ లేని పోరాటం చేస్తూ వచ్చిన రవీంద్ర యువనేత నారా లోకేష్ బాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. లోకేష్ సలహా మేరకు బీసీ సాధికార కన్వీనర్ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలోని బీసీ వర్గాలను పార్టీకి దగ్గరయ్యేందుకు కృషి చేశారు.
2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి రెండో సారి ఎన్నికైన రవీంద్ర కూటమి ప్రభుత్వంలో మైనింగ్, ఎక్సైజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.మంత్రిగా తీరిక లేకుండా గడుపుతున్నా తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొల్లు రవీంద్రకి జన్మదిన శుభాకాంక్షలు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా