ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చట్టపరమైన చ‌ర్య‌లు: ఎండీ వీసీ సజ్జనర్

- June 23, 2025 , by Maagulf
ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చట్టపరమైన చ‌ర్య‌లు: ఎండీ వీసీ సజ్జనర్

హైదరాబాద్: త‌మ సిబ్బంది పై దాడుల‌కు పాల్ప‌డితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చ‌రించారు.పోలీస్ శాఖ స‌హ‌కారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్ ను వీసీ స‌జ్జ‌న‌ర్  సోమవారం ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయ‌న‌ను అడిగి తెలుసుకున్నారు. 

గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. 

మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న రూట్ నంబ‌ర్ 300 ఆర్డినరీ బ‌స్సు కింద బైక్ పడి ఒక గర్భిణి మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ ఒక్కసారిగా తెరవడంతో బైక్ అదుపు తప్పి బస్సు వెనుక టైర్ల కింద పడింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 198 వ‌ద్ద ఈ నెల 19న జ‌రిగిందీ ప్రమాదం.

ఈ రోడ్డు ప్రమాదంలో ఎలాంటి తప్పు లేకున్నా డ్రైవ‌ర్ విద్యా సాగర్ పై కొందరు  విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశారు. అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ  తీవ్రంగా కొట్టారు. విధులు ముగించుకుని ఇండ్లకు వెళ్తున్న ఆర్టీసీ కానిస్టేబుళ్లు  భాస్కర్, ముఫకర్ అలీ లు డ్రైవర్ ను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర గాయ‌ల‌వ‌డంతో అక్కడి నుంచి  తార్నాకలోని ఆర్టీసీ ఆస్ప‌త్రికి డ్రైవర్ ను త‌ర‌లించారు. 

ఈ ప్రమాదంలో తమ డ్రైవ‌ర్‌ది ఎలాంటి తప్పులేదని, ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.

ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల పిర్యాదు మేరకు దుండగులపై సైబరాబాద్ కమిషనరేట్ అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్‌లోని 121(1), 126(2), 115(2) 352, 351(2) ) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు. 

తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com