కన్నడ రాజకీయ బాహుబలి-డీకే శివకుమార్
- June 24, 2025
డీకే శివకుమార్... ప్రస్తుత దేశ రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకుల్లో ఒకరు. సాధారణ కుటుంబ నేపథ్యం ఆయన కలలు కన్న రాజకీయ రంగంలో ఎదగడానికి అవరోధం కాలేదు. విద్యార్ధి నేతగా మొదలై ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ ఉన్నారు. మోడీ - షా ద్వయం రాజకీయ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నిన ఏకైక నేతగా నిలిచారు. అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ శివుడు ఇచ్చిన మాట కోసం, నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్లే మొండిఘటంగా ముద్రపడ్డారు. నేడు కన్నడ రాజకీయ బాహుబలి డీకే శివకుమార్ మీద ప్రత్యేక కథనం...
డీకేస్, కనకపుర బందే(రాక్ ఆఫ్ కనకపుర), శివుడు, శివన్నగా పిలుచుకునే డీకే శివకుమార్ పూర్తిపేరు దొడ్డఆలహళ్ళి కెంపెగౌడ శివకుమార్ 1962, మే 15న కర్ణాటక రాష్ట్రంలోని ఉమ్మడి మైసూర్ జిల్లాలోని కనకపురా తాలూకా దొడ్డఆలహళ్ళి గ్రామంలో వక్కలింగ సముదాయానికి చెందిన కెంపెగౌడ, గౌరమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే జరిగినా, హైస్కూల్ నుంచి పక్కనే ఉన్న బెంగళూరు నగరంలో చదువుకున్నారు. HKES కాలేజీ నుంచి పీయూసీ, ప్రముఖ SJR కాలేజీలో బీఏ పొలిటికల్ సైన్స్ (పూర్తి చేయలేదు) చదివారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తిచేశారు.
డీకే హైస్కూల్ చదువుకునే రోజుల నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. పీయూసీ చదివేటప్పుడు విద్యార్ధి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించి SJR కాలేజీ యూనియన్ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయ్యారు. తోలి నుంచి కాంగ్రెస్ అనుకూల కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రయాణాన్ని నిర్ణయించుకున్న డీకే 1979లో ఆ పార్టీలో చేరారు. దేవరాజ్ ఆర్స్ పార్టీని చీల్చిన కారణంగా కాంగ్రెస్ అప్పుడే నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్న సమయం కూడా ఆయనకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఎస్.ఎం కృష్ణ మద్దతుతో యూత్ కాంగ్రెస్‌లో స్థానం సంపాదించారు.
1984లో కర్ణాటక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన తర్వాత వచ్చిన 1985 అసెంబ్లీ ఎన్నికల్లో సతానూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దేవెగౌడపై పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో కేవలం 15 వేల ఓట్లతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనా, రాజకీయంగా మాత్రం బాగా లభించింది. కాంగ్రెస్ పార్టీలో తన గురువు కృష్ణ తర్వాత ఒక్కలింగ సముదాయంలో బలమైన నేతగా ఎదిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 1987లో బెంగుళూరు గ్రామీణ జిల్లా పంచాయితీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 ఎన్నికల్లో అదే సతానూర్ నుంచి తన 27వ ఏట ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1990లో వీరేంద్రపాటిల్ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన బంగారప్ప మంత్రివర్గంలో కారాగారాలు మరియు హోంగార్డ్స్ మంత్రిగా 1992 వరకు పనిచేశారు.
బంగారప్ప తర్వాత వచ్చిన వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో స్థానం లభించకపోవడమే కాకుండా, పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడం, అవమానాలు కలగలసి డీకేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేలా ప్రోత్సహించాయి. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సతానూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థీగా పోటీచేసి రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఆ కాంగ్రెస్ ఓటమి తర్వాత కూడా పార్టీకి అనుబంధ ఎమ్యెల్యేగా అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత తన గురువు ద్వారా తిరిగి పార్టీలో చేరారు. 1999లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన కృష్ణ ఆదేశాల మేరకు ఎన్నికల వార్ రూమ్ బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కృష్ణ సీఎం అయ్యారు. కృష్ణ మంత్రివర్గంలో 1999 నుంచి 2004 వరకు నగరాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
కృష్ణ అండదండలతో బెంగుళూరు గ్రామీణ ప్రాంతం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సహకార సంస్థలు మరియు గ్రానైట్ క్వారీలన్ని తన కిందకి తెచ్చుకున్నారు. 2002లో మహారాష్ట్ర సీఎం విలాసరావ్ దేశముఖ్ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎమ్యెల్యేలను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించిన సేన పార్టీకి చిక్కకుండా ఎమ్యెల్యేలను క్షేమంగా బెంగుళూరుకు తీసుకువచ్చి రిసార్టులో భద్రంగా దాచే బాధ్యతను కృష్ణ డీకేకి అప్పగించడం. ఆ బాధ్యతను డీకే విజయవంతంగా పూర్తి చేసి దేశముఖ్ ప్రభుత్వం కూలకుండా చూశారు. ఈ సంఘటన తర్వాత దేశముఖ్ డీకేకు మంచి మిత్రుడయ్యారు. 2002లో వచ్చిన ఉపఎన్నికల్లో కనకపుర పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగిన దేవెగౌడ మీద పోటీచేసి ఓడిపోయారు.
2004 ఎన్నికల్లో సతానూర్ నుంచి నాలుగోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన డీకే కాంగ్రెస్ పార్టీలో అగ్రనేత హోదాను అందుకున్నారు. 2004-05 మధ్య ధరమ్ సింగ్ ప్రభుత్వంలో పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సతానూర్ రద్దై కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసిపోవడంతో 2008 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్యెల్యే, జేడీఎస్ రాజకీయ దిగ్గజం పిజెఆర్ సింధియాను ఓడించారు. 2008లో కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్య 2010 వరకు అందులోనే కొనసాగారు. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో కనకపుర నుంచి ఆరోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన డీకే సిద్దరామయ్య మంత్రివర్గంలో ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2017లో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన మోడీ - షాలను తట్టుకొని మరి ఎమ్యెల్యేల రిసార్ట్ రాజకీయాలతో ఆటను కాంగ్రెస్ వైపు తిప్పడంలో డీకే కీలకంగా వ్యవహరించారు. ఈ చర్య వల్ల ఢిల్లీ పెద్దలకు సోనియా, రాహుల్ గాంధీలకు ఇష్టుడిగా మారారు. అధిష్టానం వద్ద ఉన్న మద్దతుతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం సాధించడం మొదలుపెట్టారు. అయితే, డీకే ఆధిపత్యాన్ని సిద్దరామయ్య అనుచరులుగా ఉన్న ఉత్తర కర్ణాటక కాంగ్రెస్ నేతలైన రమేష్ మరియు సతీష్ జర్కిహోళిలు తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దు ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల కారణంగా కాంగ్రెస్ ఓటమి పాలైంది కానీ డీకే ఏడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
2018 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాక హంగ్ ఏర్పడటంతో కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్యెల్యేలను తమవైపు తిప్పుకొని అధికారాన్ని కైవసం చేసుకోవాలని భాజపా భావించింది. అందుకు తగ్గట్లే కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దల ఆశీస్సులతో ఆపరేషన్ కమలం పేరుతో ఆ ఇరు పార్టీ ఎమ్యెల్యేలను లొంగ దీసుకోవడం మొదలుపెట్టింది. భాజపా ఎత్తులను పసిగట్టిన ఆ రెండు పార్టీల పెద్దలు సమిష్టిగా అలోచించి ఎమ్యెల్యేలను కాపాడే బాధ్యతను డీకే మీద పెట్టారు. తన రాజకీయ ఎదుగుదలకు ఇదే మంచి అవకాశం అని భావించిన ఆయన ఎమ్యెల్యేలను భాజపా వైపు పోనీయకుండా కాపుకాశారు. డీకే చేసిన ప్రయత్నాల వల్లే 2018లో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో కొలువుదీరింది.
2018-19 వరకు సాగిన ఆ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో డీకే ఇరిగేషన్ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో భాజపా చేపట్టిన ఆపరేషన్ కమలం వల్ల ప్రభుత్వం పడిపోయింది. 2020లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన డీకే వచ్చే ఎన్నికల అప్పటి నుండే పార్టీని, శ్రేణులను మానసికంగా సన్నద్ధం చేస్తూనే మరోవైపు భాజపా ప్రభుత్వ అక్రమాలపై రాజీలేకుండా పోరాడారు. ఇదే సమయంలో పార్టీలో తనకు పట్టు చిక్కకుండా చేసేందుకు తన ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టి పార్టీని నడిపారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎంతో శ్రమించి పార్టీని ప్రభుత్వంలోని తేవడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, తన అనుచరులకు ఇప్పించిన స్థానాల్లో భాజపా గెలవడం, పార్టీలో సీనియర్ నాయకులతో సన్నిహిత సంబంధాలు అంతగా లేకపోవడం అనే మైనెస్సుల మూలంగానే తన చిరకాల స్వప్నమైన సీఎం పదవి తనకి కాకుండా సిద్ధరామయ్యను వరించింది. డీకేను సీఎం కానీయకుండా చేసిన నాయకుల్లో సతీష్ జర్కిహోళి ముఖ్యపాత్ర వహించారు. ఆ ఎన్నికల్లో ఎనిమిదోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటుగా ఇరిగేషన్ మరియు బెంగుళూరు నగర అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
డీకే గొప్ప రాజకీయ చతురత కలిగిన నాయకుడు. 2018లో తెలంగాణా కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీని పటిష్ట పరిచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. అలాగే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో సైతం పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు అలుపెరుగకుండా శ్రమించారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీకి డీకే బాగా దగ్గరయ్యారు. ఒకానొక సమయంలో కర్ణాటకను వదిలి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించమని రాహుల్ స్వయంగా అడిగినప్పట్టికి డీకే సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికి రాహుల్ గాంధీ తలపెట్టేబోయే ప్రతి రాజకీయ కార్యక్రమం గురించి తన టీంతో పాటుగా డీకేతోనూ చర్చించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
డీకే రాజకీయాల్లో ఎదిగిన విధంగానే ఆర్థికంగానూ ఎదిగారు. 90వ దశకంలో బెంగుళూరులో ఐటీ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని గ్రహించి బెంగళూరులో పదుల సంఖ్యలో ల్యాండ్స్ కొన్నారు, తన డబ్బులిచ్చి తనకు కావాల్సిన వారిచేత కొనిపించారు. డీకే ఊహ నిజమై 2010 నాటికి ఆ ల్యాండ్ ధరలు కోట్ల రూపాయలు పలకడం ద్వారా వ్యక్తిగత ఆస్తుల విలువ పెరిగిపోయాయి. బెంగుళూరులో ఉన్న భూములే కాకుండా కనకపుర ప్రాంతంలో ఉన్న గ్రానైట్స్ క్వారీల ద్వారా కూడా కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని చూడటం మొదలుపెట్టారు. ఇవే కాకుండా ముంబై, మైసూర్ మరియు మంగళూరు ప్రాంతాల్లో హోటల్స్, మాల్స్ , ఓపెన్ ల్యాండ్స్ ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టారు. వీటితో పాటుగా రియల్ ఎస్టేట్, లిక్కర్ మరియు విద్యాసంస్థల్లో వాటాలు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మాత్రం 1413 కోట్ల రూపాయలు తనపేరిట చూపించారు. ఇక ఆయన తమ్ముడు మాజీ ఎంపీ డీకే సురేష్ 600 కోట్ల రూపాయలు తనపేరిట చూపించారు.
డీకే రాజకీయ జీవితం మొత్తం పోరాటాలతోనే సాగుతూ ఉంది. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబంతో మొదలైన రాజకీయ వైరంలో చాలా కష్టం మీద రాజకీయంగా పైకి ఎదిగి బెంగళూరు, బెంగుళూరు గ్రామీణం, మాండ్య జిల్లాలలో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో గౌడ కుటుంబ స్థానమైన హాసన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించారు. అయితే, ఈ క్రమంలో తమ్ముడు సురేష్ ఓడిపోయారు. గౌడ కుటుంబం తర్వాత డీకేకు రాజకీయంగా వైరం ఉన్నది ఉత్తర కర్ణాటకకు చెందిన జర్కిహోళి సోదరులతోనే ! ఉత్తర కర్ణాటకలో వ్యవసాయం నుంచి అన్ని రంగాల్లో వాళ్ళకు పట్టు, అపార ఆర్థిక వనరుల కారణంగా వారిని ఢీకొట్టే స్థాయికి ఎవరు చేరుకోలేదు. ఇలాంటి సమయంలోనే తన మనిషి లక్ష్మీ హెబ్బల్కర్ ను బెల్గామ్ రూరల్ నుంచి గెలిపించుకొని ఆ ప్రాంతంలో తన హవా నడపలనే తలంపుతో వెళ్తున్న సమయంలోనే జర్కిహోళిలతో రాజకీయ వైరం కాస్త తీవ్రమైన వ్యక్తిగత వైరంగా మారిందని అంటారు. 2023లో డీకేను సీఎం కానీయకుండా తమ గురువైన సిద్దరామయ్యను సీఎం చేయడానికి ఆర్థికంగా చాలా ఖర్చు చేసి అనుకున్నది సాధించారు.
విద్యార్థి జీవితంలోనే రాజకీయాల్లోకి వచ్చి తన కృషి, పట్టుదల మరియు క్రమశిక్షణతో ఈరోజు కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ, రాజధాని బెంగుళూరును మకుటంలేని మహారాజుగా ఏలుతున్నారు డీకే శివకుమార్. ఈ క్రమంలో ఆయన చేసిన త్యాగాలు, కార్యకర్తల కృషిని ఎప్పటికి మరువలేదు. మొదటి నుంచి తనతో నడుస్తున్న వారిని అన్ని విధాలా సెటిల్ చేయడమే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చారు అంటారు ఆయన్ని దగ్గరగా గమనించిన వారు. ఆఖరికి తన మిత్రుడైన సిద్దార్థ ఆత్మహత్య చేసుకొని మరణించిన తర్వాత, వారి కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా సిద్దార్థ కుమారుడితో తన కూతుర్నిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో శివకుమార్‌ని మించిన శక్తివంతుడైన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి మరొకరు లేరు అనేది వాస్తవం. తన జీవిత లక్ష్యమైన కర్ణాటక సీఎం పదవిని 2028లో దక్కించుకునేందుకు ఇప్పటి నుండే తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా