సోషలిస్టు కార్మిక దిగ్గజం-జార్జి ఫెర్నాండెజ్
- June 28, 2025
జార్జి ఫెర్నాండెజ్...స్వాతంత్ర భారతదేశంలో కార్మిక ఉద్యమానికి పట్టుగొమ్మగా నిలిచిన నాయకుడు.కెనర తీరంలోని మంగళాపురం అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆయన దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు.పదవులతో సంబంధం లేకుండా నమ్మిన సామ్యవాదాం కోసం రాజీలేని పోరాటం చేశారు. కార్మికులే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బ్రతికిన జార్జి రైల్వే, పరిశ్రమలు మరియు రక్షణ శాఖల మంత్రిగా సేవలందించారు. నేడు సోషలిస్టు కార్మిక దిగ్గజం జార్జి ఫెర్నాండెజ్ మీద ప్రత్యేక కథనం..
జార్జి ఫెర్నాండెజ్ అలియాస్ జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ 1930, జూన్ 3న ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన కెనరా జిల్లా మంగళాపురం (మంగళూరు) పట్టణంలో మంగళూరియన్ కేథలిక్కు కుటుంబంలో జాన్ జోసెఫ్ ఫెర్నాండెజ్. ఆలిస్ మార్తా దంపతులకు జన్మించారు. మంగళూరులోని సెయింట్ ఆలోసియాస్ విద్యాసంస్థలో ఎసిఎల్సి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి క్రైస్తవ మత ప్రచారకుడి శిక్షణ పొందారు. తన 19వ ఏట కొన్ని కారణాల వల్ల ఆ శిక్షణ వదిలేశారు.
జార్జి చిన్నతనం నుంచే సామాజిక స్పృహ మెండుగా కలిగి ఉన్న వ్యక్తి. మత ప్రచారకుడి శిక్షణ మధ్యలోనే వదిలేసి మంగళూరు వచ్చిన తర్వాత నుంచి తన పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడైన బాలప్ప మార్గదర్శనంలో కార్మికుల కోసం పనిచేయడం మొదలుపెట్టారు. మొదట అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారి కోసం కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలా అనతికాలంలోనే అన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారు.
కార్మిక ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలోనే సోషలిస్టు భావజాలం పట్ల ఆకర్షితుడై ప్రముఖ సోషలిస్టు నాయకుడు లోహియాకు దగ్గరయ్యారు. 1949లో మంగళూరులో జరిగిన కార్మిక సమ్మెలో కీలకమైన పాత్ర పోషించిన జార్జిని గుర్తించిన బొంబాయి కార్మిక దిగ్గజ నేత మరియు మంగళూరు వాసి అయినటువంటి ప్లాసిడ్ డిమెల్లోతనతో పాటు బొంబాయిలో పనిచేసేందుకు ఆహ్వానించారు. డిమెల్లో పిలుపుతో మంగళూరు నుంచి బొంబాయి చేరుకున్న జార్జి, ఆరంభంలో చాలా ఇబ్బందులు, కష్టనష్టాలు ఓర్చుకొని కార్మిక నాయకుడిగా ఎదిగారు. డిమెల్లో మరణాంతరం బొంబాయి వస్త్రపరిశ్రమ, షిప్పింగ్, రైల్వే కార్మిక సంఘాలకు నాయకుడయ్యారు.
కార్మిక నాయకుడిగా కొనసాగుతూనే ప్రజా సోషలిస్టు పార్టీ కార్యకలాపాల్లో ఉండేవారు. లోహియాకు తక్కువ కాలంలోనే అత్యంత కావాల్సిన వ్యక్తిగా అయ్యారు. 1958లో అనామకుడిగా బొంబాయి వచ్చిన జార్జి 1967 నాటికి నగరంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. 1961 నుంచి 1967 వరకు బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1967 లోక్‌సభ ఎన్నికల్లో బొంబాయి దక్షిణం నుంచి సంయుక్త సోషలిస్టు అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ దిగ్గజం ఎస్.కె.పాటిల్ మీద అనూహ్యంగా ఘన విజయం సాధించారు. ఆ ఒక్క విజయంతోనే జార్జి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1971లో అదే స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి చెందారు.
1974లో రైల్వే సిబ్బందికి మెరుగైన వేతనాలు, పని దినాల కుదింపు వంటి పలు సమస్యల ప్రాతిపదికన బొంబాయిలో రైల్వే సమ్మెను ఫెర్నాండెజ్ నిర్వహించారు. ఈ సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే కార్మికులు సమ్మెను పాటించడంతో అప్పటి కేంద్ర పెద్దలు దిగివచ్చి సమస్యను పరిష్కరించడానికి అంగీకరించారు. సమస్య పరిష్కారానికి హామీ దొరికినప్పటికి, సమ్మెకు కారకుడైన జార్జిని మీద ప్రభుత్వ పెద్దలు కక్షగట్టారు. 1975లో ఇందిరా ఎమెర్జెన్సీ విధించిన తర్వాత జార్జిని అరెస్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసినా, కొందరి సన్నిహితుల వల్ల తప్పించుకున్నారు. 1976లో బరోడా డైనమైట్ కేసు మీద అక్రమంగా అరెస్ట్ అయ్యి 1977 వరకు జైల్లో ఉన్నారు.
1977లో ఎమెర్జెన్సీ అంతం అయ్యి ఎన్నికలు జరగగా జార్జి ఫెర్నాండెజ్ జనతాపార్టీ తరపున బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుండి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో తంతి తపాలా, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ శాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. ఐబీఎం, కోకోలా లాంటి బడా అంతర్జాతీయ సంస్థలను దారిలోకి తెచ్చిన ఏకైక నేతగా గుర్తింపు పొందారు. పరిశ్రమల విధానంలో సరళీకరణలకు ప్రణాళికలు వేశారు. 1979లో దేశాయ్ ప్రభుత్వం కూలిన తరవాత చరణ్ సింగ్ వైపు నిలవకుండా దేశాయ్ ప్రాతినిధ్యం వహించిన జనతా(ఎస్) వైపు నిలిచారు.1980 ఎన్నికల్లో అదే పార్టీ నుండి ముజఫర్‌పూర్‌లో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. చరణ్ సింగ్, జనసంఘ్ వర్గాలు విడిపోయిన తర్వాత మిగిలిపోయిన చంద్రశేఖర్ నాయకత్వంలోని జనతా పార్టీలో ఉన్నారు.
1983లో కర్ణాటక రాష్ట్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన స్వరాష్ట్రంలోనే ఎక్కువగా గడుపుతూ వచ్చారు. 1984 ఎన్నికల్లో ముజఫర్‌పూర్ నుంచి కాకుండా బెంగళూరు ఉత్తరం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికి ఓటమికి వెరవని జార్జి జనతా పార్టీ కార్యకలాపాల్లో బిజీగా దేశం మొత్తం పర్యటనలు చేస్తూ ఆ ఐదేళ్లు గడిపారు. 1988లో జనతాదళ్ పార్టీలో జనతాపార్టీ విలీనం అయిన తర్వాత ఆ పార్టీ తరపున 1989లో ముజఫర్‌పూర్ నుంచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. విపి సింగ్ మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా 1989-90 మధ్యన పనిచేశారు. కొంకణ్ రైల్వే లైన్, ఫాస్ట్ ట్రాక్ ట్రైన్స్ మరియు రిజర్వేషన్స్ సౌకర్యాన్ని తీసుకురావడంలో జార్జి కృషి చేశారు.
1990 మధ్యలో భాజపా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించడంతో సింగ్ ప్రభుత్వం పడిపోవడం, చంద్రశేఖర్ పార్టీని చీల్చి ప్రధాని కావడం వెను వెంటనే జరిగిపోయాయి. 1990లో జార్జి, నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పలువురు బీహార్ నాయకులూ మాత్రం సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీలోనే కొనసాగారు. 1991లో ఐదోసారి ముజఫర్‌పూర్ నుంచి ఎన్నికైన జార్జి పార్లమెంట్లో సీనియర్ నాయకుడిగా పార్టీ ఎంపీలకు మార్గదర్శనం వహిస్తూ వచ్చారు. అయితే, 1993 నాటికి లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర సీనియర్ పార్టీ నాయకులతో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా జరుగుతూ వచ్చారు. ఫెర్నాండెజ్‌తో పాటు ఇతర సీనియర్ నాయకుడైన నితీశ్ కుమార్ సైతం లాలూ ప్రవర్తనతో విసిగి వేసారిపోయి పార్టీ నుంచి బయటకు వచ్చారు.
1994లో పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన కుర్మీ - కుష్వాహా చేతనా ర్యాలీ ద్వారా నితీశ్ సైతం రాష్ట్ర స్థాయి నాయకుడిగా తన బలాన్ని నిరూపించారు. నితీశ్ ప్రాబల్యాన్ని చూసిన ఫెర్నాండెజ్ ఒక్క నిమిషం ఆలోచించకుండా జనతాదళ్ పార్టీకి రాజీనామా చేసి నితిశ్ కుమార్‌తో సమతా పార్టీని స్థాపించారు. సమతా పార్టీలోకి లాలూ బాధిత వర్గాలన్ని వచ్చాయి. 1995 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సమతా పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించినా ఫలితం లాలూకు అనుకూలంగా రావడంతో నిరాశపడ్డారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఈసారి సమతా పార్టీ అభ్యర్థిగా నలంద నుంచి ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. నితీశ్ కుమార్‌ను భాజపాకు జోడి చేయాలని భావించిన ఆరెస్సెస్ సిద్ధాంతకర్త మరియు ప్రముఖ బీహార్ వెటరన్ జర్నలిస్టు దీనానాథ్ మిశ్రా, జార్జితో చర్చలు జరిపి సమతా - భాజపా పొత్తుకు పునాది వేశారు.
1998 ఎన్నికల్లో ఏడోసారి నలంద నుంచి ఎన్నికైన జార్జి ఫెర్నాండెజ్ భాజపా నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1999 వరకు పనిచేశారు. ఈ సమయంలోనే అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించడం, కార్గిల్ యుద్ధంలో దేశానికి తిరుగులేని విజయాన్ని చేకూర్చడంలో ఫెర్నాండెజ్ ముఖ్యపాత్ర వహించారు. ఇదిలా ఉంటె 1999లో ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోవడటంతో 1999లో మరోసారి లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సైతం నలంద నుంచి ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికైన జార్జి వాజపేయ్ మంత్రివర్గంలో రెండోసారి కేంద్రమంత్రి అయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఆ మంత్రి పదవిలోనే కొనసాగారు. 2003లో సమతా పార్టీ, జేడీయూలో విలీనం జరగడం వల్ల లాలూ వర్గాన్ని ఎదుర్కోవడానికి బలం చేకూరింది.
2004లో 9వ సారి ముజఫర్‌పూర్ నుంచి జేడీయూ తరపున ఎన్నికైన జార్జి క్రమంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ నితీశ్ చేతిలో ఓటమి చెందడం ఆయనకు సంతోషాన్ని కలిగించింది. అయితే, 2008 నాటికి అనారోగ్యం తీవ్రంగా ఇబ్బందికి గురిచేయడం, తన సహచరురాలైన జయ జైట్లీని రాజకీయాల్లోకి తేవాలని చేసిన ప్రయత్నాలను పార్టీ అగ్రనేతలైన నితీశ్, శరద్ యాదవ్‌లు వ్యతిరేకించారు. జయ వల్లే జార్జి క్రియాశీలక రాజకీయ జీవితం ముగుస్తుందని ఎవరు ఊహించలేదు. 2009 లోక్ సభ ఎన్నికల్లో నితీశ్ జార్జికి టిక్కెట్ ఇవ్వలేదు. దీన్ని ఆయన జీర్ణించుకోలేక పోయినా తన అనారోగ్యం క్రమంగా కృంగదీయడం కూడా బాగా ఇబ్బంది పెట్టింది. 2010లో నితీశ్ జార్జిని రాజ్యసభకు పంపించారు. 2011లో అల్జీమర్స్ వ్యాధి కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా భారతదేశ రాజకీయాల నుంచి కార్మిక యోధుడి నిష్క్రమణ జరిగింది.
రాజకీయవేత్తగా, కార్మిక నాయకుడిగానే కాకుండా జర్నలిస్టుగా సైతం జార్జి ఫెర్నాండెజ్ రాణించారు. చదువుకునే రోజుల్లోనే కొంకణి భాషలో కొంకణి యువక్, కన్నడలో రైతువాణి పత్రికలను నిర్వహించారు. బొంబాయి వచ్చిన కొద్దీ రోజులకే డిమెల్లో సూచనలతో "డాక్మ్యాన్" అనే సైక్లో స్టైల్ పత్రికను నిర్వహించారు. ఈ పత్రికతో పాటుగా ఫ్రీ ప్రెస్ జర్నల్ ఇంగ్లిష్ పత్రికకు పనిచేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికి పలు పత్రికలకు ఆర్టికల్స్, కాలమ్స్ రాస్తూ వచ్చారు. జార్జి రాసిన ఆర్టికల్స్, కాలమ్స్ ఆరోజుల్లో ప్రజలను విశేషంగా ఆకట్టుకునేవి.జర్నలిస్టుగానే కాకుండా రచయితగా మారి సమకాలీన రాజకీయాల మీద, సోషలిజం మీద పలు పుస్తకాలను విరివిగా జార్జి రాశారు. కన్నడ, హిందీ, కొంకణి, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, తుళు, తమిళం, మలయాళం, లాటిన్ స్పానిష్ భాషల్లో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించారు.
జార్జి ఫెర్నాండెజ్ వ్యక్తిగత జీవితానికి వస్తే, చిన్నతనంలోనే బ్రహ్మచారిగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఒకసారి ఎంపీగా ఢిల్లీ వెళుతున్న సమయంలో కేంద్ర మాజీ మంత్రి హ్యూమయాన్ కబీర్ కుమార్తె రెడ్ క్రాస్ సంస్థ అధికారి లైలా కబీర్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారి ఇరువురు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ, ఇరువురి మతాలు వేరుకావడం, పైగా లైలా కంటే 15 ఏళ్ళు పెద్దవాడైన జార్జిని పెళ్లిచేసుకోవడానికి లైలా కుటుంబం అంగీకరించపోయినప్పటికీ 1971లో ఇరువురు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. వివాహానంతరం లైలా కుటుంబం వారిని అంగీకరించింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు సియాన్ ఫెర్నాండెజ్ జన్మించారు. వివాహం తర్వాత ఇద్దరి మధ్య అనుకున్న విధంగా సఖ్యత లేకపోవడం, వయస్సులో అంతరాలతో పాటుగా జార్జి జయ జైట్లీతో సన్నిహితంగా మెలగడం వారి వివాహ బంధం బీటలు వారింది.
లైలాతో బంధం తెగిపోయిన నాటి నుంచి జయ జైట్లితోనే గడిపిన జార్జి, ఆమెను తన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తూ వచ్చారు. జనతాదళ్ పార్టీలో ఉన్న సమయంలో సైతం వీరి బంధం గురించి ఎన్నో గుసగుసలు వినిపించేవి. సమతా పార్టీ పెట్టిన తర్వాత నుంచి జయ రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడం, జార్జిని కలవడానికి ముందు తనను కలవాలని హుకుమ్స్ జారీ చేయడం వంటివి సహా వ్యవస్థాపకుడైన నితీశ్ కుమార్ ఇతర పార్టీ నాయకులు సహించే వారు కాదు. 1999, 2004లలో జయకు రాజ్యసభ టిక్కెట్ ఇప్పించాలని ఫెర్నాండెజ్ ప్రయత్నించినప్పటికి అది జరగలేదు. ఇదే క్రమంలో అనారోగ్యం తిరగబెట్టడంతో భార్య లైలా జార్జి దగ్గరకి రావడంతో జయ రాజకీయ జీవితం అర్థాంతంగా ముగిసిపోయింది. అవసాన దశలో భార్య, కుమారుడి దగ్గరే గడిపారు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఉద్యమాలకు, రాజకీయాలకు తన జీవితాన్ని అంకితం చేసిన జార్జి ఫెర్నాండెజ్ దేశ రాజకీయాల్లో మాస్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భాషాబేధం లేకుండా అన్ని రాష్ట్రాల వందలాది మంది అనుచరగణం గణాన్ని సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు ఫెర్నాండెజ్. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన భేదాలు తప్పించి వ్యక్తిగత విభదాలు లేని అతికొద్ది మంది జాతీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు. దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకరైన జార్జి ఫెర్నాండెజ్ అల్జీమర్స్ మరియు స్వయం ఫ్లూ వల్ల తన 88వ ఏట ఢిల్లీలోని తన స్వగృహంలో 2019,జనవరి 29న కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా