జాతీయ వైద్యుల దినోత్సవం
- July 01, 2025
‘వైద్యోనారాయణో హరి:’ మన దేశంలో వైద్యులంటే ప్రజలకు ఓ నమ్మకం. ఓ విశ్వాసం. ప్రాణాలు పోసే దేవుడు. ప్రజలు సొంత కుటుంబానికి చెప్పని రహస్యాన్ని వైద్యులకు చెబుతారు. తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తికి ఆపరేషన్ చేసేందుకు శరీరాన్ని అప్పగిస్తారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో వైద్యుడు, రోగి మధ్య బంధం బలహీనపడుతోంది. ఈ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం ఇరువురి బాధ్యత. దానికి వైద్యుల దినోత్సవం కన్నా మంచి తరుణం దొరకదు.నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...
వైద్యాన్ని వృత్తిగా కాకుండా.. దానినో బాధ్యతగా తీసుకుంటూ.. ప్రజలకు సేవలు అందిస్తోన్న వైద్యులను గుర్తిస్తూ.. వారికి థ్యాంక్యూ చెప్పేందుకు ఈ స్పెషల్ డే నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. ఎందరి ప్రాణాలనో కాపాడుతున్న వారందరి సేవలు గుర్తించడమే లక్ష్యంగా దీనిని చేస్తున్నారు. వైద్యులను గౌరవిస్తూ వారి అందించే సేవలను గుర్తిస్తూ.. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులుగా వారు సమాజానికి అందించే సేవలను గుర్తిస్తూ.. ప్రతి సంవత్సరం భారతదేశంలో జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
భారత వైద్య రంగానికి పితామహుడిగా భావించే డాక్టర్ బీసీ రాయ్ అలియాస్ బీదాన్ చంద్ర రాయ్.. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అనేక వైద్య సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జాధవ్‌పూర్ టీబీ ఆస్పత్రి, చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ ఆస్పత్రి, విక్టోరియా ఇన్‌స్టిట్యూషన్, చిత్తరంజన్ క్యాన్సర్ ఆస్పత్రి, చిత్తరంజన్ సేవా సదన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ తదతర ప్రతిష్టాత్మక సంస్థలన్నీ ఆయన హయాంలో పురుడు పోసుకున్నవే.
మహిళలకు సామాజిక సేవ, నర్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి ఆయన ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1943లో దేశ అత్యున్నత వైద్య సంస్థ భారత మెడికల్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టిన ఆయన్ను 1962 ఫిబ్రవరి 4న భారతరత్న వరించింది. జూన్ 1న జన్మించిన రాయ్ అదే రోజున కన్నుమూశారు. ఆయన స్మారకార్థం జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
ఈ రోజున పలు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ పలు కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తాయి. అలాగే హెల్త్కేర్ అవగాహన సదస్సులు, వర్క్షాప్లు నిర్వహిస్తారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేయడం, ఎడ్యూకేషనల్ సెషన్స్ నిర్వహించే.. వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తారు. సీరియస్ మెడికల్ కండీషన్స్పై వైద్యుల దినోత్సవం రోజు వైద్యులు అవగాహన కల్పించేలా వీటిని నిర్వహిస్తారు.
వైద్యం వ్యాపారంగా మారటం అంటే ఆరోగ్య సంరక్షణలో, వైద్య రంగంలో మార్కెట్ సూత్రాలను అన్వయించి పెట్టుబడి పెట్టడం, లాభాలను సంపాదించడం అనే సూత్రాన్ని అమలు పరచటమే. కార్పొరేటు వైద్యం, కార్పొరేట్ హాస్పిటళ్లు, ఫార్మా రంగంలో ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ సంస్థల స్ధానంలో ప్రవేశించిన తర్వాత ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత పెరిగింది. సామాన్య ప్రజలకు కూడా అత్యంత ఆధునిక వైద్యం అందుతుంది. కానీ సామాన్య ప్రజలు కార్పొరేట్ బిల్లులు భరించే స్థితిలో లేకపోవటమే విషాదం. వైద్య వృత్తిలో నైతిక విలువలకు స్థానం లేకుండా పోయింది. లాభాపేక్ష ఒకటే ధ్యేయంగా వైద్య వృత్తి కొనసాగుతుంది. పెరిగిన మందుల ధరలు, పెరిగిన వైద్య పరీక్షల ఖర్చు, పెరిగిన హాస్పిటల్ ఫీజులు పేద-మధ్యతరగతి ప్రజలు ఖర్చు పెట్టలేక పోతున్నారు.
నాణ్యమైన వైద్య సేవలు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. వైద్యం వ్యాపారం కావడం వలన సమాజంలోని బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. తక్కువ ఆదాయ వర్గాలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వైద్య ఖర్చులను భరించలేక అప్పులలో కూరుకు పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ వెనుకబడిన ప్రాంతాలలో వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటం, వైద్యుల కొరత వల్ల వారికి వైద్యం అసలు అందుబాటులో లేనే లేదు. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచేలా చూసేందుకు ప్రపంచ వ్యాపితంగా వివిధ ఆరోగ్య సంరక్షణ నమూనాలు ఉన్నాయి. బ్రిటన్‌లో వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. క్యూబాలో ప్రజలందరికీ అత్యుత్తమమైన వైద్యం అందుబాటులో ఉంచారు. ప్రపంచంలో వైద్యులు ఏ దేశంలో అవసరం ఉన్న క్యూబా సహాయం చేస్తుంది. యూరోప్, కెనడా, చైనా లలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.
వైద్యం కేవలం వ్యాపారం కాకుండా ప్రభుత్వ కర్తవ్యంగా ఉండేలా ప్రజలు, ప్రభుత్వాలు కృషి చేయాలి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వ నిధులతో నిర్వహించాలి. అందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి ప్రభుత్వమే తీసుకురావాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసి వ్యాధుల నివారణకు, ప్రాథమిక చికిత్సకు, అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆరోగ్య విద్యపై దృష్టి సారించాలి. ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థను సాధించటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. మొత్తం సమాజం యొక్క ఉమ్మడి కృషి వలననే సాధ్యం అవుతుంది. దీన్ని సాధించడానికి పూనుకోవాలని డాక్టర్స్ డే గుర్తు చేస్తున్నది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు