మోడీ-షాల విధేయుడు-భూపేంద్ర యాదవ్
- July 02, 2025
భూపేంద్ర యాదవ్... భాజపాకు ఉన్న వ్యూహాత్మక నాయకుల్లో ఒకరు. ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన యాదవ్ విద్యార్ధి రాజకీయాల్లో ఒక దశబ్దం పాటు గడిపారు. ఆ తర్వాత వసుంధర రాజే ఆశీస్సులు మరియు నితిన్ గడ్కరీ ప్రోత్సాహంతో భాజపాలో కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. అమిత్ షా ఢిల్లీ వనవాసంలో సవాసిగా మారి... ఆ తర్వాత నమ్మిన బంటుగా మారారు. చేపట్టిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తూ పార్టీలో స్థానాన్ని పదిల పరుచుకొని నరేంద్రుడి మంత్రివర్గంలో చోటు సాధించారు. నేడు భాజపా వ్యూహకర్త భూపేంద్ర యాదవ్ మీద ప్రత్యేక కథనం..
భూపేంద్ర జీగా ప్రసిద్ధులైన భూపేంద్ర కదమ్ సింగ్ యాదవ్ 1969, జూన్ 30న హర్యానాలోని జమాల్పూర్ గ్రామంలో కదమ్ సింగ్, సంత్రా దేవి దంపతులకు జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో రాజస్థాన్ అల్వార్ పట్టణంలో స్థిరపడింది. అక్కడే భూపేంద్ర బాల్యం, విద్యాభ్యాసం సాగింది. అల్వార్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మరియు లా పూర్తి చేశారు. అనంతరం అల్వార్, జైపూర్లలో లా ప్రాక్టీస్ చేశారు.
భూపేంద్ర హైస్కూల్ రోజుల్లోనే ఆరెస్సెస్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. డిగ్రీ చదివే రోజుల్లో ఎబివిపిలో క్రియాశీలకంగా ఉంటూ పలు హోదాల్లో పనిచేశారు. సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు ఎబివిపి కార్యక్రమాల్లోనే ఒక దశబ్దం గడిపారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సంఘ్ లా విభాగంలో పనిచేశారు. ఆ సంస్థలో క్రియాశీలకంగా ఉంటూనే భాజపా తరపున ఎన్నికల సమయంలో ప్రచారాలు నిర్వహించారు. సంఘ్ పెద్దల ఆశీస్సులు, రాజస్థాన్ భాజపా నేత వసుంధర రాజే ప్రాపకంలో భాజపాకు దగ్గరయ్యారు. 2010లో గడ్కరీ భాజపా జాతీయ అధ్యక్షుడైన తర్వాత పార్టీ జాతీయ కార్యదర్శిగా చేరారు.అప్పటి నుండి రాజస్థాన్ కంటే జాతీయ రాజకీయాల్లోనే పూర్తి సమయాన్ని వెచ్చించడం మొదలుపెట్టారు.
2012లో రాజస్థాన్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన భూపేంద్ర యాదవ్ 2012 నుంచి ఉత్తర భారత రాష్ట్రాలకు ఇంఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టి ఆ రెండు రాష్ట్రాల్లో భాజపా అన్ని స్థానాలను కైవసం చేసుకోవడంతో భూపేంద్రకు ఢిల్లీలో ముఖ్యంగా మోడీ - షా వద్ద పరపతి లభించింది. అమిత్ షా పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయన అప్పగించిన ప్రతి బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసేవారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ద్వారా షాకు మరింత దగ్గరయ్యారు. యాదవ్ సేవలను మెచ్చిన షా 2018లో సైతం రెండోసారి రాజ్యసభకు పంపించారు.
రెండోసారి ఎంపీ అయిన నాటి నుంచి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం భాజపా అధికారంలోకి రావడంతో షా ఈసారి పార్టీ పగ్గాలు వదిలి కేంద్ర హోం మంత్రి కావడంతో, షా ప్రతినిధిగా యాదవ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేవారు. యాదవ్ పనితీరును మెచ్చిన షా 2021లో కేంద్ర పదవి కట్టబెట్టారు. 2021-24 వరకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ మూడేళ్ళలో ఒకవైపు తన మంత్రివర్గ బాధ్యతలు చూస్తూనే పార్టీ అధ్యక్షుడు నడ్డాకు సహాయకారిగా ఉంటూ పార్టీ వ్యహారాలు చూసేవారు.
2024 ఎన్నికల్లో షా ఆదేశాల మేరకు తొలిసారి అల్వార్ నుంచి బరిలోకి దిగి ఎంపీగా ఎన్నికయ్యారు. మోడీ 3.0 మంత్రివర్గంలో అటవీ & పర్యవరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యాదవ్ షా ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే వారిలో ప్రథమ స్థానం వహిస్తారని భాజపా నేతలే చెబుతారు. మోడీ - షాలకు వీర విధేయత చూపడం ద్వారా ఎందరో సీనియర్ నేతల కంటే ముందుగానే మంత్రి పదవులు పొందారు. ఆ విధేయత వల్లే ప్రస్తుతం నూతన భాజపా జాతీయ అధ్యక్ష పదవి రేసులో అందరికంటే ముందున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!