కాంప్రహెన్సివ్ స్టార్-సి.ఎస్.ఆర్
- July 11, 2025
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం).ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సీఎస్సార్. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన తొలితరం నటులలో సీఎస్సార్ ఒకరు. డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమనేది ఆయనతోనే మొదలైందని చెప్పచ్చు. ఆయన వాయిస్ .. ఆయన డైలాగ్ చెప్పే విధానం అంత డిఫరెంట్ గా ఉండేవి. అలాగే అరుపులు .. కేకలు .. హంగామాలు లేకుండా విలనిజాన్ని పండించడం కూడా ఆయన నుంచే ఆరంభమైందని అనాలి. ఇక తెలుగు తెరపై ఊతపదాలు .. మేనరిజాలకు కూడా ఆయనే ఆద్యుడు .. పూజ్యుడు అని చెప్పాలి. అప్పట్లో ఆయన డైలాగ్స్ కోసమే సినిమాలను మళ్లీ మళ్లీ చూసేవాళ్లున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నేడు కాంప్రహెన్సివ్ స్టార్ సి.ఎస్.ఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
సి.ఎస్.ఆర్ పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు.1907, జూలై 11న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంలోని అవిభక్త గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆయన జన్మించారు. సి.ఎస్.ఆర్ తండ్రికి నాటకాలంటే ఇష్టం .. అందువలన ఆయన ఆ చుట్టుపక్కల ఎక్కడ నాటకాలు ఆడుతున్నా అక్కడికి వెళ్లేవారు. అప్పుడప్పుడు తండ్రితో కలిసి సీఎస్ ఆర్ కూడా నాటకాలకు వెళుతూ ఉండేవారు. అలా వెళ్లడం వలన ఆయనకి నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. స్కూల్ చదువులనాటికే ఆయన పాటలు .. పద్యాలు బాగా పాడేవారు. ఇక టీనేజ్ లోకి అడుగుపెట్టే సమయానికి, జానపద నాటకాలైనా .. పౌరాణిక నాటకాలైనా సీఎస్ ఆర్ వేయవలసిందే అనే పేరు తెచ్చుకున్నారు.
నాటకాలలో సి.ఎస్.ఆర్ డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆయన వాయిస్ ఆయనకి చాలా హెల్ప్ అయింది. ఆయన డైలాగ్స్ లోని విరుపులు ప్రేక్షకులకు గమ్మత్తుగా అనిపించాయి. నాటకాలలో రాణించినవారు సినిమాల దిశగా అడుగులు వేసినట్టుగానే ఆయన ప్రయాణం కూడా సినిమాల వైపుకు సాగింది. ‘ద్రౌపది వస్త్రాపహరణం’ సినిమాలో కృష్ణుడి పాత్రను పోషించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతకుముందు తాను స్టేజ్ పై కృష్ణుడి పాత్రను చాలాసార్లు పోషించి ఉండటం వలన, ఆయన పెద్దగా టెన్షన్ పడలేదు. పద్యాలన్నీ తనకి కంఠతా రావడం వలన ఆయన మరింత ధైర్యంతో ఉన్నారు.
అయితే స్టేజ్ పై నటించడానికి .. సినిమాల్లో కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉందనే విషయం ఆయనకి మొదటి రోజునే అర్థమైపోయింది. పద్యం ఒక తీరుగా వెళుతున్న సమయంలో కట్ చెప్పగానే ఆయన చాలా అసహనానికి లోనయ్యేవారట. మళ్లీ మూడ్ లోకి రావడానికి ఆయనకి చాలా సమయం పట్టేది. ఇక స్టేజ్ పై లా మూమెంట్స్ విషయంలో స్వేచ్ఛ లేకపోవడం ఆయనకి మరో అసంతృప్తి. ఇక సినిమాలు తనకి సరిపడవనే నిర్ణయానికి ఆయన వచ్చేశారు. హాయిగా వెనక్కి వెళ్లి నాటకాలు వేసుకోవడమంత సుఖం లేదని ఆయన భావించారు.
ఆయనలో మంచి ప్రతిభా పాటవాలు ఉన్నాయనీ, ఒకటి రెండు రోజులు సర్దుకుంటే ఎలా చేయాలనే పట్లు అర్థమైపోతాయనీ, తొందరపడొద్దని సన్నిహితులు చెప్పారట. దాంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. అలా కాస్త ఓర్పుతో ఆయన ‘ద్రౌపది వస్త్రాపహరణం’ పూర్తి చేసి ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాగా ఆడినప్పటికీ, వరుస అవకాశాలతో నిలదోక్కుకోవడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులను తట్టుకున్నారు. హీరోగా మాత్రమే చేస్తామంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదోక్కుకోలేమనే విషయాన్ని ఆయన చాలా తక్కువ సమయంలోనే గ్రహించారు.
అప్పటి నుంచి ఆయన కేరక్టర్ ఆర్టిస్టుగా ముందుకువెళ్లారు. విలన్ గా .. కామెడీ విలన్ గా ఆయన ఇక తనకి తిరుగులేదని పించుకున్నారు. ‘హే రాజన్ .. శృంగార వీరన్’ అంటూ ‘జగదేక వీరుని కథ’లో మంత్రి పాత్రలో, ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉందిగా’ అంటూ ‘మాయా బజార్’లో శకుని పాత్రలో, ‘నమ్మిన చోట చేస్తే మోసం .. నమ్మని చోట చేస్తే లౌక్యం’ అంటూ ‘కన్యాశుల్కం’లో ఆయన చేసిన హడావిడిని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇక ‘ఇల్లరికం’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలు కూడా ఆయన నటనకి నిలువెత్తు నిర్వచనమై నిలుస్తాయి.
పెద్దరికం ముసుగులో కుట్రలు .. కుతంత్రాలు చేసి, అవతలవాడిని పడగొట్టే పాత్రలలో సి.ఎస్.ఆర్ తిరుగులేదనిపించుకున్నారు. మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించే పాత్రలలోను .. తప్పును కప్పిపుచ్చుకునే సన్నివేశాల్లోను ఆయన నటనను అభినందించకుండా ఉండలేం. తెలుగు తెరపై శకుని పాత్రకు ఆయన పెద్దబాలశిక్ష వంటివారు. ఆ తరువాత కాలంలో ఆ పాత్ర ఎవరు చేయవలసి వచ్చినా, ఆయన పోషించిన పాత్రను చూసిన తరువాతనే ముందుకు వెళ్లారు .. అదీ ఆయన గొప్పతనం. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఒకసారి వినేసి చెప్పడం ఆయన ప్రత్యేకత అంటారు. తర్వాత కాలంలో సీఎస్సార్ ను అనుకరిస్తూ, ఆయన వాచకాన్ని ఒడిసిపట్టి ఎందరో నటులు తెరమీద నటించారు కానీ, ఎవరూ ఆయన దరిదాపుల్లోకి రాకపోవడం గమనార్హం!
ఇక తెరపై ఆయన ఎంత కఠినంగా కనిపిస్తారో .. బయట అంత సున్నితమైన మనసున్నవారని చెబుతారు. అవకాశాల కోసం వచ్చి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నవారికి వెంటనే సాయం చేసేవారని అంటారు. ఇక ఆయన దగ్గరున్న మరో గొప్పగుణం ఏమిటంటే, అందరితో కలుపుగోలుగా ఉండటం. తాను పెద్ద స్టార్ ననే విషయాన్ని ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గర చూపించేవారు కాదట. ‘నాటకాల నుంచి వచ్చినవాడిని .. జీవితమే ఒక నాటకమని తెలిసినవాడిని .. నాకెందుకయ్యా చింత’ అనేమాట తరచూ అంటూ ఉండేవారట.
టాకీలు రాకముందు అంటే 1932కు పూర్వం ప్రజలకు వినోద సాధనం నాటకాలే. టాకీలు వచ్చిన కొత్తల్లో నాటకరంగం నుంచి సినిమారంగంలోకి ఎంతోమంది గొప్పగొప్ప రంగస్థల నటులు వచ్చారు. వారిలో కొందరు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించారు. హరిశ్చంద్రుడు అంటే డి.వి.సుబ్బారావు, సత్యభామ అంటే స్థానం నరసింహారావు, దుర్యోధనుడు అంటే మాధవపెద్ది వెంకట్రామయ్య, యముడు/కంసుడు అంటే వేమూరు గగ్గయ్య, నారదుడు అంటే పువ్వుల సూరిబాబు, ధర్మరాజు అంటే అద్దంకి శ్రీరామమూర్తి, వసుదేవుడు అంటే పారుపల్లి సుబ్బారావు...వీరే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవారు. అయితే వారి ప్రస్థానం ఎంతోకాలం కొనసాగలేదు. కానీ ఆనాటి నుంచి సినీరంగంలో నిలదొక్కుకున్న అతి తక్కువమంది నటులలో సి.ఎస్.ఆర్ గారిది ప్రధమస్థానం.
రంగస్థలం అనే ఒక నటనాలయంలో సాటి నటులందరూ సి.ఎస్.ఆర్‌కు గురువులు. వీరందరి కలబోత సి.ఎస్.ఆర్. ఆయనకున్న ప్రత్యేకత పద్యం ఆలపించే విధానం. ఆయన అదృష్టం నాటకాలలో శ్రీకృష్ణుడు పాత్ర దొరకడం. ఆరోజుల్లో శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ వంటి నాటకాల్లో కృష్ణ పాత్ర ధరించాలి అంటే సి.ఎస్.ఆర్, లేకుంటే కల్యాణం రఘురామయ్యే. తన సమకాలీనులైన అద్దంకి శ్రీరామమూర్తి, తుంగల చలపతి, పారుపల్లి వంటి గాయకులున్న రోజుల్లో సి.ఎస్.ఆర్ వారిని అధిగమించి పేరు చేచ్చుకోవడం విశేషమే. అర్ధయుక్తంగా, శ్రావ్యంగా పద్యాలు పాడడంలో సి.ఎస్.ఆర్ ప్రవీణుడు. రంగస్థల నటుడుగా ఆర్జించిన పేరుతోనే ‘ద్రౌపదీ వస్తాప్రహరణం’ సినిమాలో తొలిసారి కృష్ణుడుగా వెండి తెరమీద దర్శనం ఇచ్చారు. అదే పరంపర కొన్నేళ్లు అప్రతిహతంగా కొనసాగింది. తరువాత సాంఘిక చిత్రాల్లో హీరోగా వెలిగారు. నలభై ఏళ్లు పైబడిన తరువాత క్యారక్టర్ నటుడుగా స్థిరపడ్డారు. కేవలం స్వయంకృషితోనే సి.ఎస్.ఆర్ అగ్రశ్రేణి నటుడయ్యారు.
తాను జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగాపలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్గా, హాస్యనటుడి గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వారు ఈ సీఎస్సార్ . జీవితంలో అవమానాలు .. అభినందనలు అనుభవాలుగా చదువుకున్నవారాయన. పరిస్థితుల ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో .. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ప్రత్యక్షంగా చూసినారాయన. అందువల్లనే చివరి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా వాటిని కూడా తట్టుకుని నిలబడ్డారు. ఏదేవైనా టాకీలు మొదలైన తొలినాళ్లలో .. తెరపైకి వచ్చిన తొలితరం నటుల్లో సీఎస్సార్ ఒక ఆణిముత్యం .. ఒక జాతిరత్నం అని చెప్పొచ్చు. అటువంటి అసమాన ప్రతిభగల సి.ఎస్.ఆర్ 1963 అక్టోబరు 8న తన 56వ సంవత్సరంలో చనిపోయారు. ఆయన పోషించిన పత్రాలు ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!