వెండితెర బామ్మా-నిర్మలమ్మ

- July 18, 2025 , by Maagulf
వెండితెర బామ్మా-నిర్మలమ్మ

మీ మొహాలు మండా..అప్పుడే తెల్లారిందేంట్రా.. జూదానికి..! ఏరెన్నొంకలు తిరిగినా సముద్రంలోనే కలవాలని...పెళ్ళాం మీద మనసొచ్చింది గావాల.. ఇన్నాళ్ళుగా మాట ఇనని కొడుకు ఒక పిల్లను తీసుకొచ్చి ఇంటో పెట్టాడని సంబర పడనా...హోటల్లో తిరిగే పిల్లని తీసుకొచ్చాడని ఏడవనా! ఇలా తిట్లు తిట్టే బామ్మ తెలుగు తెరను వదిలేసినా ఆ తిట్లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఒక నటి జీవించి ఉందంటే అది సినిమా మీద ఉన్న ప్రేమ కారణం, కాలం మారుతూ వస్తుంటే ఈ అభిమానమూ మారుతూ వస్తుంది. ముఖ్యంగా ఈమధ్య కాలంలో మన బామ్మ పాత్రల నిర్మలమ్మనే తీసుకుంటే ఆమె సహజమైన నటన తెలుగు చిత్రాలనే కాదు.... మన తెలుగు లోగిళ్ళనూ పూనితం చేసిందనే చెప్పాలి. వందలాది తెలుగు చిత్రాల్లో కనిపించి కాస్త చమత్కారంగానో, చివట్లేస్తూనే కనిపించే పాత్రకు మనం అంతా దాసోహం అయిపోయామనే చెప్పాలి. నేడు ప్రముఖ నటి నిర్మలమ్మ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం....

నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. 1926, జూలై 18న ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గంగయ్య, కోటమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించారు. ఊహ తెలిసినప్పటి నుండి నాటకాలంటే పిచ్చి ఇష్టంతో మూడో తరగతిలోనే చదువు ఆపేసి నాటకాలు చూస్తూ కాలం గడిపేస్తుంటే ఊర్లో పరువుతీస్తుందని బంధువులంతా తిట్టేవారట. కానీ పెద్దక్క మాత్రం సపోర్ట్ చేసేది. అలా మొదట సతీ సక్కుబాయి నాటిక గన్నవరంలో మొట్ట మొదట వేసినప్పుడు నిర్మలమ్మకు 14 ఏళ్ళు. మరీ బక్కపలచగా ఉందని ఏం నటించగలదని వచ్చిన విమర్శలన్నీ తిప్పి కొడుతూ బాగా రాటుదేలింది.

నటి సావిత్రమ్మతో కలిసి స్టేజీమీద నృత్యాలు చేస్తున్నప్పుడు జి.వి. కృష్ణారావు అనే నాటకాల కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ ఇష్టపడి పెళ్ళి చేసుకుంటానన్నాడు. పెళ్ళిచూపుల కోసం నిర్మ‌ల‌మ్మ ఇంటివ‌ద్ద‌కు వెళ్ళినపుడు... పెళ్లి అయ్యాక కూడా న‌టిస్తాన‌ని, తన న‌ట‌న‌కు అడ్డు చెప్ప‌కుంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాన‌ని కండీష‌న్ పెట్టింది. అలా నిర్మలమ్మని రెండో భార్యగా స్వీకరించాడు కృష్ణారావు. ఇక ఇద్దరూ కలిసి నాటక కంపెనీ ఉదయం స్థాపించి నాటకాలేసేవారు. అలా వేస్తూ వేస్తూ 1943 చివరిలో గరుడ గర్వభంగంతో ఒక్కసారిగా సినీరంగంలోకి ప్రవేశించింది మన నిర్మలమ్మ. ఆపై నిర్మల చేయని పాత్రంటూ లేదు.

కాకినాడ‌లో క‌రువు రోజులు అనే నాట‌కంలో న‌టిస్తుండ‌గా నటుడు పృథ్వీరాజ్‌క‌పూర్ నుంచి ఆమెకు ప్ర‌శంస‌లు అందాయి. ఇంకో సందర్భంలో ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ "నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు" అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ. మరోసారి 'మనుషులు మారాలి' అనే చిత్రం శతదినోత్సవాలకు వెళ్ళిన హిందీ నటుడు ప్రాణ్. నువ్వు శోభన్ బాబుకే అమ్మ కాదు. 'భారత్ కీ మా' అని అన్నాడు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

 ఆమె తెరమీద బాధగా డైలాగులు చెపుతుంటే ఇక్కడ కూర్చున్న ప్రేక్షకుడి కళ్ళు తడవాల్సిందే. తిట్టిందంటే నోరు మూసుకోవాల్సిందే. గాఢ నిద్రలో కూడా నిర్మలమ్మ తిట్లు లేపి కూర్చోపెడతాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి నిర్మలమ్మ సినీ ప్రయాణం ఎందరో అగ్ర హీరోలతో, హీరోయిన్స్‌తో పోటా పోటీగా సాగింది. 60 ఏళ్ళపాటు తెలుగు తెర‌పై ప‌లు పాత్ర‌ల‌ను పోషించిన నిర్మలమ్మ, జీవితంలో హెచ్. ఎమ్. రెడ్డి, బి. ఎన్. రెడ్డి, కె.వి.రెడ్డి దగ్గర పనిచేయలేకపోయాననే బాధ నిర్మలమ్మకు బాగా ఉండేది. రఘుపతి వెంకయ్య అవార్డులు వంటివి తమలాంటి వారికి అదట్టలోదని ఆమె అవసాన దశలో చాలా బాధపడ్డారు. చివరి వరకు నటించాలని తపించినా, అనారోగ్యంతో శరీరం సహకరించలేదు. అలా అనారోగ్యం కారణంగా తన 88వ ఏట 2009, ఫిబ్రవరి 19న కన్నుమూశారు. నిర్మలమ్మను మరిపించేలా బామ్మ పాత్రలు చేయగలిగిన వారు మాత్రం ఇంత వరకూ కనిపించలేదు.  

--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com