చ‌రిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్‌ వసీం..

- September 02, 2025 , by Maagulf
చ‌రిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్‌ వసీం..

యూఏఈ కెప్టెన్ ముహమ్మద్‌ వసీం అరుదైన ఘ‌న‌త సాధించాడు. ట్రై సిరీస్‌లో భాగంగా సోమ‌వారం షార్జా వేదిక‌గా అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 సిక్స‌ర్లు బాదాడు. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. క్ర‌మంలో అత‌డు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ్రేక్ చేశాడు.

టీమ్ఇండియా సార‌థిగా రోహిత్ శ‌ర్మ 62 ఇన్నింగ్స్‌ల్లో 105 సిక్సర్లు బాదగా.. వసీం 54 ఇన్నింగ్స్‌ల్లోనే 110 సిక్సర్లు కొట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌రువాత ఇయాన్ మోర్గాన్‌, ఆరోన్ ఫించ్‌లు ఉన్నారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు..

  • ముహమ్మద్‌ వసీం (యూఏఈ) – 54 ఇన్నింగ్స్‌ల్లో 110 సిక్స‌ర్లు
  • రోహిత్ శ‌ర్మ (భార‌త్) – 62 ఇన్నింగ్స్‌ల్లో 105 సిక్స‌ర్లు
  • ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్‌) – 65 ఇన్నింగ్స్‌ల్లో 86 సిక్స‌ర్లు
  • ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 76 ఇన్నింగ్స్‌ల్లో 82 సిక్స‌ర్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో ఇబ్రహీం జద్రాన్ (63; 40 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), సెదికుల్లా అటల్ (54; 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు బాదారు. యూఏఈ బౌల‌ర్ల‌లో ముహమ్మద్ రోహిద్ ఖాన్, సగీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com