కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం

- September 15, 2025 , by Maagulf
కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం

: కరీంనగర్‌లో రీజనల్ పాస్‌పోర్ట్ ఆధునీకరించిన నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, జాయింట్ సెక్రటరీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ – “పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అప్రెడేషన్ కావడం ఆనందదాయకం. కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను 2009-14లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని తీసుకొచ్చి మున్సిపల్ భవనంలో ప్రారంభించాం. ప్రస్తుతం ఇది 250 స్లాట్లతో నడుస్తుండగా, బండి సంజయ్ చొరవతో 500 స్లాట్లకు విస్తరించే సదుపాయాలు తీసుకొచ్చారు” అని తెలిపారు.

అలాగే “గతంలో సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్తే ఉదయం 4 గంటలకు లైన్‌లో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కరీంనగర్ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందుతున్నాయి. పాస్‌పోర్ట్ ప్రతి ఒక్కరికీ అవసరం. భారతీయుడిగా గుర్తింపు పొందేందుకు ఇది తప్పనిసరి. అవసరమైనప్పుడే పాస్‌పోర్ట్ తీసుకుంటే ఆలస్యం అవుతుంది, అందువల్ల ప్రతి ఒక్కరూ సమయానికి పాస్‌పోర్ట్ తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి గుర్తుచేసుకుంటూ –“కరీంనగర్‌కు పాస్‌పోర్ట్ కార్యాలయం రావడానికి నేను ఢిల్లీలో వందల సార్లు తిరిగాను. గతంలో ఉపాధి కోసం మాత్రమే పాస్‌పోర్ట్ అవసరం ఉండేది. ఇప్పుడు ఉన్నత విద్య, ఉద్యోగాలు, పర్యటనల కోసం విదేశాలకు వెళ్తున్నారు. చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఇక్కడి నుంచే పాస్‌పోర్ట్ సదుపాయం పొందుతున్నారు. ఆధునీకరణకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయం భవిష్యత్తులో స్వంత భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com