ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం

- September 17, 2025 , by Maagulf
ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం

న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చారిత్రాత్మక రక్తదాన శిబిరం నిర్వహించారు. “నమో కే నామ్ రక్తదాన్”  పేరుతో సాగిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా రక్తదాన చరిత్రలో కొత్త మైలురాయి సృష్టించింది.గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఒక్కరోజులోనే 378 మెగా శిబిరాలు ఏర్పాటు చేసి, 56,265 యూనిట్ల రక్తాన్ని సేకరించడం విశేషం. ఒక నాయకుడి పుట్టినరోజు కోసం ఇంత భారీ స్థాయిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి.ఈ మెగా కార్యక్రమాన్ని అఖిల్ భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ (ABTYP) నిర్వహించింది. ఉదయం 6 గంటలకు గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒకేసారి రక్తదానం జరగడం ఈ కార్యక్రమాన్ని మరింత విశేషంగా మార్చింది.

కార్యక్రమం విజయవంతం కావడానికి వేలాది వాలంటీర్లు కృషి చేశారు. తేరాపంత్ యువక్ పరిషత్ నుంచి 1500 మంది వాలంటీర్లు, జాతీయ సేవా పథకం (NSS) నుండి 500 మందికి పైగా వాలంటీర్లు సహకరించారు. అదనంగా, 75కి పైగా బ్లడ్ బ్యాంకులు ఈ డ్రైవ్‌లో భాగమయ్యాయి.ఈ మెగా డ్రైవ్‌లో 75,000 మంది యువ కార్మికులు, 4,000 బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, 5,000 మంది వైద్యులు, 25,000 సాంకేతిక నిపుణులు, 1 లక్షకు పైగా వాలంటీర్లు, 3 లక్షల మంది దాతలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సంఖ్యలు రక్తదాన చరిత్రలో అరుదైన రికార్డుగా నిలిచాయి.

తేరాపంత్ యువక్ పరిషత్ నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమానికి 50కి పైగా సామాజిక సంస్థలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి. “రక్తదాన అమృత్ మహోత్సవ్ 2.0″లో భాగంగా సాగిన ఈ కార్య‌క్ర‌మం దేశానికి గర్వకారణంగా నిలిచింది.ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ తరువాత, మోదీ జన్మదినం సందర్భంగా ప్రజలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేకరించిన రక్తం ద్వారా పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయాలని నిర్వాహకులు సంకల్పించారు.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రక్తదాన కార్యక్రమం ప్రతిధ్వనించింది. నేపాల్, శ్రీలంక, యుఎఇ, ఆస్ట్రేలియా, యుకెతో సహా 75 దేశాల్లో 7,500 శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒకే రోజులో దాదాపు మూడు లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించడమే లక్ష్యం.ఈ రక్తదాన మహోత్సవం కేవలం ఒక వేడుక కాదు. సమాజానికి అవసరమైన సమయంలో సహాయం చేయాలనే సందేశాన్ని అందించింది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించబడటం చరిత్రలో నిలిచిపోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com