సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు

- September 23, 2025 , by Maagulf
సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు

విజయవాడ: ప్రజలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో వారి కాళ్ల పై వారు నిలబడేలా చేయడమే అసలైన శ్రేయస్సు అని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.మంగళవారం ఆయన విజయవాడలోని మురళీ రిసార్ట్స్ లో,1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని వివరిస్తూ రాసిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘సర్వశక్తి సంపన్నమైన భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం.యువజనాభా ఎక్కువగా ఉండటం భారత్‌కు కలిసొచ్చే విషయం. కానీ ఆ శక్తిని సక్రమంగా వినియోగించాలంటే యువత తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వాలు ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి.’’ అని సూచించారు.పని చేసే సామర్థ్యం, వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.నిస్సహాయులు, వృద్ధులు, ఆసరా లేని వారు వంటి నిజంగా అవసరమైన వర్గాలకే ఉచితాలు అందించాలన్నారు. ‘‘దేశం బలంగా ఉండాలంటే యువతరం బలంగా ఉండాలి. బలంగా ఉండడమంటే శారీరక బలం మాత్రమేకాదు.ఆర్థికంగా కూడా బలోపేతం అవడం. ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాలు ఇచ్చినంత కాలం వారు బలోపేతం అవరు.’’ అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు మంచి భవిష్యత్తును అందించేలా వ్యవస్థలను తీర్చిదిద్దడమే నేతల ప్రథమ కర్తవ్యం కావాలన్నారు.‘‘వ్యక్తి స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి దశనూ బలోపేతం చేయడం ద్వారా మన దేశాన్ని దృఢంగా, సమున్నతంగా నిలబెట్టాలి.’’ అని నేతలకు సూచించారు.  

సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంతో నాటి సంగతులన్నీ మరోసారి గుర్తుకొస్తున్నాయన్నారు.అవి మరచిపోలేని సంఘటనలని, ఈ పుస్తకంలో రాసిన అంశాలు కొన్ని తనకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవని, తన జీవితంలో ఒక ముఖ్యభాగంగా నిలిచిపోయినవని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి చేసిన ఒక గొప్ప ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమని చెప్పారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరే ఉంటారని, అటువంటి గొప్ప నేతల్లో నందమూరి తారక రామారావు ఒకరు. చలనచిత్ర రంగంలో కోట్ల మంది అభిమానులను చూరగొన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారన్నారు.ఆయన రాజకీయ ప్రవేశం ఎంతో మంది జీవితాల్లో మంచి మార్పు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్రంలో నాడు అధికారంలో ఉన్నవారి సూచనలతో ఆయనను అధికారంలోంచి తొలగించే ప్రయత్నం చేశారని, భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అదొక మాయని మచ్చలా మిగిలిపోయిందని చెప్పారు.  దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారని, పెద్ద ఎత్తున ఉద్యమించారని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను, జైపాల్ రెడ్డిగారు ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయం సహించలేక ఆ నాటి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నామని చెప్పారు.   

ప్రజా ఉద్యమం ఫలితంగా కుట్రదారుల ఎత్తులు పారలేదని, ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.అనంతరం మంత్రివర్గంలో చేరాల్సిందిగా ఎన్టీఆర్ గారు తనను, జైపాల్ రెడ్డిగారిని ఆహ్వానించారని, అయితే ఆయన ఆహ్వానాన్ని తాము సున్నితంగా తిరస్కరించామని చెప్పారు. ఆనాడు రామారావుకి మద్దతు ఇచ్చింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కానీ పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. ‘‘రాజకీయాల్లో ఉన్నవారు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. పదవుల కోసం వెంపర్లాడకూడదు. బాధ్యతతో పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి.’’ అని చెప్పారు.  ఎన్టీఆర్ గారు రాజకీయ సంస్కర్త మాత్రమే కాదని, సంస్కృతి సంరక్షకుడు కూడా అని చెప్పారు. తెలుగు భాషపై ఆయనకు అపారమైన ప్రేమ అని, ఎన్టీఆర్ పై తనకు అభిమానం పెరగడానికి తెలుగుభాషపై వారికి ఉన్న ప్రేమ ఒక ముఖ్యమైన కారణమని వెంకయ్యనాయుడు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com