అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు

- October 07, 2025 , by Maagulf
అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు

డాలస్, టెక్సస్: డాలస్ ప్రాంతంలో ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద మహాత్మాగాంధీ 156 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగద్విఖ్యాత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ అక్టోబర్ 2వ తేదీన వేకువ ఝామునే మహత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. సచిన్ వెంట ప్రసిద్ధ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్, కమ్యూనిటీ నాయకుడు సల్మాన్ ఫర్షోరి విచ్చేశారు.

మహత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర సచిన్ ను సాదరంగా ఆహ్వానించి, ఈ మెమోరియల్ స్థాపన వెనుక ఉన్న కార్యవర్గ సభ్యుల శ్రమ, వేలాది ప్రవాస భారతీయుల సమిష్టి కృషి, దాతల దాతృత్వం, అనుమతి ఇవ్వడంలో అధికారులు అందించిన సహకారంతో దశమ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్న వైనాన్ని సోదాహరణంగా   వివరించారు.

సచిన్ మాట్లాడుతూ – “గాంధీజయంతి రోజున అమెరికాలో గాంధీస్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించడం తన అదృష్టమని, మహాత్మాగాంధీ జీవితం ప్రపంచంలో ఉన్న మానవాళిఅంతటికీ నిత్య నూతన శాంతి సందేశం అన్నారు. ఎంతో ప్రశాంత వాతావరణంలో, సుందరంగా, పరిశుభ్రంగా గాంధీ స్మారకస్థలిని నిర్వహిస్తున్న గాంధీ మెమోరియల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు” అన్నారు.

మహాత్మాగాంధీ 156 వ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన “గాంధీ శాంతి నడక-2025” లో వందలాది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షులు మహేంద్ర రావు అందరినీ ఆహ్వానించి సభను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాన్సల్ జెనరల్ ఆఫ్ ఇండియా డిసి మంజునాథ్, ప్రత్యేక అతిథులుగా సన్నీవేల్ మేయర్ సాజీ జార్జి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ సభ్యుడు బర్ట్ టాకూర్, ఆంధ్రప్రదేశ్ “హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు, ఐ.ఎ.ఎస్ (రి) హాజరై జాతిపితకు పుష్పాంజలి ఘటించి మహాత్మాగాంధీ జీవితంలోని ఎన్నో ఘట్టాలను, ఆయన త్యాగ నిరతిని గుర్తుచేసుకున్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశానికి చిహ్నంగా 10 తెల్లటి కపోతాలను ఆహుతుల కేరింతల మధ్య అతిథులు, నాయకుల అందరూ కలసి ఆకాశంలోకి ఎగురవేసి అందరూ కలసి శాంతినడకలో పాల్గొన్నారు.

ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకులు రాజీవ్ కామత్, మహేంద్ర రావు, బి.యెన్ రావు, జస్టిన్ వర్ఘీస్, షబ్నం మాడ్గిల్, దీపక్ కార్లా, డా. జెపి, ముర్తుజా, కలై, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్, మహాత్మాగాంధీ మెమోరియల్ నాయకులు డా. ప్రసాద్ తోటకూర, తైయాబ్ కుండావాలా, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, అనంత్ మల్లవరపు, కమ్యూనిటీ నాయకులు చంద్ర పొట్టిపాటి, చినసత్యం వీర్నపు, లక్షి పాలేటి, సురేఖా కోయ, క్రాంతి ఉప్పు, చిన్ని మొదలైన వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు.

మురళి వెన్నం హాజరైన అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతంలో కృషి చేసిన కార్యకర్తలకు, వేడి వేడి అల్పాహారం అందించిన “ఇండియా టుడే కెఫే” అధినేత వినోద్ ఉప్పు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com