హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- October 13, 2025
- టీ–చిప్ (T-CHIP) పథకానికి కేంద్రస్థాయిలో మద్దతు ఇస్తామని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ.
- తెలంగాణలో సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి భరోసా.
- శాసనసభ్యులు, పాలసీ మేకర్లు, పెట్టుబడిదారులు, వందలాది మంది ప్రజలు పాల్గొని సరికొత్త సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించారు.
హైదరాబాద్: భారతదేశంలో సెమీకండక్టర్ రంగానికి కొత్త దిశ చూపే చారిత్రాత్మక అడుగుగా, దేశంలోనే తొలి ‘సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (టీ–చిప్®) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక నాయకులు, పారిశ్రామిక వేత్తలు, అకాడమియా, పెట్టుబడిదారులు, ప్రజలు విస్తృతంగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర క్రీడలు,యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుభుల తిరుపతి రెడ్డి హాజరై సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ మ్యూజియంలో హ్యూమనాయిడ్ రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే పెట్ డాగ్, దేశంలోనే తొలి స్వదేశీ ఏఐ చిప్, మళ్లీ వాడదగిన రాకెట్ ఇంజిన్, నెక్స్ట్ జనరేషన్ ఈవీ మరియు డిస్ప్లే టెక్నాలజీలు వంటి అద్భుత ఆవిష్కరణలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించింది. ప్రత్యేకంగా రూపొందించిన 30 రోజుల ఇన్నోవేషన్ రెసిడెన్సీ మోడల్ ద్వారా ప్రతి నెలా కొత్త స్టార్టప్‌లు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు తమ సాంకేతికతను ఇక్కడ ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ...“సెమీకండక్టర్ రంగం దేశ ప్రాధాన్య రంగంగా మారింది. ‘సెమీకాన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల దిశగా టీ–చిప్ చేస్తున్న పని ప్రశంసనీయం.దేశ వ్యాప్తంగా ఈ రంగం అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని విధాలా మద్దతు ఇవ్వడానికి నేను కేంద్ర స్థాయిలో కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ...“టెలంగాణా ఎప్పుడూ సాంకేతిక మార్పులలో ముందంజలో ఉంటుంది.ఈ రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన మద్దతు, మౌలిక వసతులు, ప్రతిభా వికాసం వంటి అన్ని అంశాల్లో సహకరిస్తుంది.ఈ మ్యూజియం విద్యార్థులకు ప్రేరణగా, స్టార్టప్‌లకు వేదికగా, పరిశోధనకు ప్రయోగశాలగా మారనుంది” అని తెలిపారు.
టీ–చిప్ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ...“ఇది కేవలం ప్రదర్శన స్థలం మాత్రమే కాదు – ఇది పరిశోధన, పరిశ్రమ, సమాజం మధ్య వారధిగా నిలుస్తుంది. తెలంగాణా మన ప్రారంభ వేదిక, కానీ మా లక్ష్యం ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి విధాననిర్మాతలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నాయకులు, వందలాది మంది ప్రజలు హాజరై ఆసక్తిగా సాంకేతిక ప్రదర్శనలను వీక్షించారు.ఈ మ్యూజియం ప్రతి నెలా డెమో డేస్, ఇన్వెస్టర్ మీట్స్, గ్లోబల్ షోకేస్‌లు వంటి అనేక కార్యక్రమాలకు వేదిక కానుంది. త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఐటీ పార్కులు, పరిశోధనా కేంద్రాల్లో కూడా ఈ మోడల్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







