ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

- October 19, 2025 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పండుగ కానుకను అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం(DA)ను ఒక నెల పెంచుతున్నట్లు ప్రకటించారు.పెరిగిన డీఏ నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.160 కోట్ల అదనపు భారం పడనున్నట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉద్యోగులు రాష్ట్ర పురోగతిలో కీలక భాగస్వాములని పేర్కొంటూ, “మీ కృషితోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. అందరూ ఆనందంగా దీపావళిని జరుపుకోవాలి” అని అన్నారు.

ఇకపోతే, పోలీస్ శాఖ సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో రూ.105 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లించనున్నారు. అదేవిధంగా, ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు దీపావళికి ముందే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి వచ్చే 60 రోజుల్లో సంస్కరణలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు వంటి అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. వారి సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి బలం” అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com