బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- October 26, 2025
కర్నూల్: కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధ ఘటన రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ పరిశ్రమ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.ఈ దుర్ఘటన భయంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపు చూసేందుకే జంకుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల టికెట్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. శనివారం ఈ మార్పు స్పష్టంగా కనిపించింది.
ప్రమాదానికి ముందు గురువారం హైదరాబాద్ నుంచి కావలికి రూ.1800 వసూలు చేసిన కావేరి ట్రావెల్స్, ఘటన తర్వాత అదే టికెట్‌ను రూ. 1100 తగ్గించింది. ఇతర ప్రైవేటు ఆపరేటర్లు సైతం ధరలను తగ్గించారు. సాధారణంగా రూ. 2000 ఉండే హైదరాబాద్-వెల్లూర్ టికెట్‌ను రూ. 1500కే విక్రయించారు.
అయినప్పటికీ, వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారిలో చాలామంది టికెట్లను రద్దు చేసుకోగా, కొత్త బుకింగ్‌లు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో శనివారం పలు ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్ కౌంటర్లు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. చాలా బస్సులు సగం సీట్లతోనే సర్వీసులు నడపాల్సి వచ్చింది.
మరోవైపు, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కూడా అప్రమత్తమయ్యారు. ఫిట్నెస్ సరిగా లేని బస్సులను రోడ్లపైకి తీస్తే అధికారులు సీజ్ చేస్తారనే భయంతో చాలా సర్వీసులను రద్దు చేసుకున్నారు. ప్రయాణికుల లగేజీని, పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు.ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై నెలకొన్న అనుమానాలతో ప్రయాణికులు ప్రభుత్వ రంగ ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సర్వీసులకు ఆదరణ పెరిగింది. శనివారం బెంగళూరు, విజయవాడ మార్గాల్లో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుకింగ్‌లు గణనీయంగా పెరిగాయి.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ తమ స్లీపర్ బస్సులను ప్రమోట్ చేస్తోంది. “సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోండి” అంటూ తమ స్లీపర్ బస్సుల ఫొటోలతో ‘ఎక్స్’లో ప్రచారం చేస్తోంది.
తాజా వార్తలు
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం







