టీ20 సిరీస్‌.. టీమిండియా ఘన విజయం

- November 02, 2025 , by Maagulf
టీ20 సిరీస్‌.. టీమిండియా ఘన విజయం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న (IND vs AUS) ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఎట్టకేలకు అద్భుత విజయాన్ని అందుకుంది. హోబర్ట్‌లోని బెల్లెరైవ్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.187 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగగా, జితేష్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్) అతనికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి మెరుపులతో భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.హోబర్ట్‌లోని బెల్లెరైవ్ ఓవల్ మైదానం (Bellerive Oval Ground) లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయి తడబడిన ఆసీస్‌ను టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74), మార్కస్ స్టోయినిస్ (39 బంతుల్లో 64) ఆదుకున్నారు.

వీరిద్దరూ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లతో రాణించగా, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), శుభ్‌మన్ గిల్ (15) వేగంగా ఆడారు.

ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24), తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (17) తమ వంతు సహకారం అందించారు. కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ ఆరో వికెట్‌కు అజేయంగా 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీసినప్పటికీ, మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే నవంబరు 6న గోల్డ్ కోస్ట్ లో జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com