ఏపీలో కొత్త జిల్లాలు..

- November 05, 2025 , by Maagulf
ఏపీలో కొత్త జిల్లాలు..

అమరావతి: ఏపీలో జిల్లాల పునర్విభజనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, రామానాయుడు, హోంమంత్రి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.

జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గం పలుమార్లు సమావేశమైంది. తాజాది చివరి సమావేశం అని తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే క్యాబినెట్ సమావేశంలో.. మంత్రివర్గ ఉపసంఘం తయారు చేసిన నివేదికపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన ఏ విధంగా చేయాలి అనేదానిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. జిల్లాలను ఏ విధంగా మార్పు చేయాలి, ఏయే ప్రాంతాలను కలపాలి అనేదానిపై ప్రధానంగా చర్చించారు. రెవెన్యూ డివిజన్ల అంశంపైనా చర్చించారు. అలాగే కొన్ని మండలాలు, గ్రామాల పేర్లలో మార్పులు చేసే అంశంపైనా డిస్కషన్ జరిగింది.

కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చాలి అనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు మార్కాపురను కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలని ప్రతిపాదన ఉంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా మార్చాలన్న ప్రతిపాదనలూ ఉన్నాయి. జిల్లాల సంఖ్యను పెంచడం ద్వారా అధికార యంత్రాంగానికి పరిధి తక్కువగా ఉంటే.. వాటిపై వారు మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com