మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం

- November 13, 2025 , by Maagulf
మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనతో భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, “ఆపరేషన్ సింధూర్” ఘటనలతో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో “ఆపరేషన్ సింధూర్ 2.0” హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజా కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విచారణను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ఉండగానే ఈ ఘటనపై స్పందించారు. దేశ భద్రతకు ముప్పుగా నిలిచే శక్తులపై కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్,అఫ్గానిస్తాన్‌లతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సూసైడ్ బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా, ఆ దాడికి పాక్ తాలిబాన్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఆ దాడికి భారత్ మద్దతుగా ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. గతంలో “ఆపరేషన్ సింధూర్” సమయంలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఈసారి పాకిస్థాన్‌కు అమెరికా మద్దతు దొరకదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సమస్యల్లో చిక్కుకుపోయినందున దక్షిణాసియా ఉద్రిక్తతలపై దృష్టి సారించే అవకాశం తక్కువగా ఉందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com