హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్‌ఐ పై షాకింగ్ నిజాలు

- November 27, 2025 , by Maagulf
హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్‌ఐ పై షాకింగ్ నిజాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్‌ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్‌ పేరు ప్రస్తుతం శాఖ అంతటా పెద్ద చర్చగా మారింది. దర్యాప్తు అధికారి ఎప్పుడూ చేయకూడని అక్రమాలలో నేరుగా పాల్గొన్నాడనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో మొత్తం పోలీసు శాఖ ప్రతిష్టకు గండిపడింది. 2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్‌పై ఆర్థిక లావాదేవీలు, రికవరీ సొత్తు దుర్వినియోగం, అధికార దుర్వినియోగం వంటి తీవ్రమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవలి 4 తులాల బంగారం చోరీ కేసు విచారణలో అతను రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా, లోక్‌ అదాలత్‌లో కేసును క్లోజ్ చేయించి… ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నట్టు దర్యాప్తులో బయటపడింది. పైస్థాయికి సమాచారం చేరడంతో అధికార నివేదికపై అతడిని సస్పెండ్ చేసి, కేసు కూడా నమోదు చేశారు.

సర్వీస్ పిస్టల్ మిస్టరీ – విచారణలో షాకింగ్ వివరాలు
బంగారం కేసు వ్యవహారమే కాకుండా, భానుప్రకాష్‌ తన సర్వీస్ పిస్టల్‌ మిస్సయ్యిందని స్టేషన్‌లో హంగామా చేయడంతో మరో సంచలనం ఏర్పడింది. డ్రాను చెక్ చేస్తే బుల్లెట్లు మాత్రమే ఉండగా గన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీలో రికవరీ బంగారాన్ని డ్రాలో పెట్టి పిసరంత సేపటికి అక్కడి నుంచి తీసుకెళ్తున్న భానుప్రకాష్‌ స్పష్టంగా కనిపించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. కానీ పిస్టల్‌ విషయమై అతడు, “డ్రాలోనే పెట్టాను… ఏమైందో తెలియదు” అని విచారణలో చెబుతున్నట్టు సమాచారం. దీంతో గన్‌ను రాయలసీమ లేదా ఇతర ప్రాంతాల్లోని ముఠాలకు అమ్మేశాడనే కోణంలో టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక దర్యాప్తు వేగంగా సాగుతోంది.

ఆర్థిక ఇబ్బందులు, బెట్టింగ్ వ్యసనమే అసలు కారణమా?
విచారణలో మరిన్ని విచిత్ర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భానుప్రకాష్‌కి బెట్టింగ్ అలవాటు ఉండి, దాదాపు ₹70–80 లక్షలు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక ఒత్తిడే అతన్ని అక్రమాలకు దారితీసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని స్టేషన్‌కు వచ్చి తన వస్తువులు తీసుకెళ్లే క్రమంలోనే పిస్టల్‌ మిస్సింగ్‌ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం భానుప్రకాష్‌పై రికవరీ సొత్తు దుర్వినియోగం కేసులో విచారణ కొనసాగుతోంది. అయితే, పిస్టల్ మిస్సింగ్ మిస్టరీ ఇంకా మాత్రం వీడలేదు…!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com