ఔషధగుణాలెన్నో కలిగిన రోజ్మేరీ..
- July 26, 2016
అందం.. ఆరోగ్యాల రోజ్ మేరీ!
రోజ్మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్నపొద. వంటల్లో కొత్తిమీరలాగ దీన్ని ఎక్కుగా విదేశీ వంటల్లో వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్లు, సూపుల తయారీలోనూ సలాడ్లలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్‌టీ కూడా తయారు చేస్తారు.
రో జ్మేరీ శాస్త్రీయనామం రోజ్మారినస్ అఫిషినాలిస్. బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటి సన్నని ఆకులతో, సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగుపూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ చిన్నపొద ఇది. నీరు నిలవని ఇసుకనేలల్లో, చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. దీనికి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. అలాని ఎండ తీవ్రత ఎక్కువ ఉండకూడదు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. మన దగ్గర సూటిగా ఎండ పడనిచోట నాటుకుంటే మంచిది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపీట్ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.
రెండు రకాల్లో... రోజ్మేరీ నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండినదైనా కూడా వంటల్లో వాడతారు. ఆకు కోసేటప్పుడు గ్రీవంపైన తుంచుకుంటే చిగుళ్లు త్వరగా వస్తాయి. దీన్ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవచ్చు. ఒకసారి నాటిన మొక్క చాన్నాళ్లపాటు నిలిచి ఉంటుంది. రోజ్మేరీలోని రెండు రకాల్లో అఫిషినాలిస్ పొదలాగా పెరిగితే, ప్రోస్ట్రేటస్ కొద్దిగా తీగలాగా సాగుతుంది. ప్రోస్ట్రేటస్ రకం రాక్ గార్డెన్లలోనూ, వేలాడే తొట్లలోనూ పెంచుకోవడానికి కూడా బాగుంటుంది. వంటలో వాడటానికి మాత్రం రెండూ ఒకేలా ఉంటాయి.
సేంద్రియ ఎరువులు వాడితే... రోజ్మేరీ ఆకులు పసుపు పచ్చగా మారుతుంటే, కుండీ మార్చే సమయం దగ్గరపడిందని సంకేతం. ఏడాదికోసారి కుండీ మార్చుకోవాలి. దీన్ని వంటల్లో వాడతాం కనుక వర్మీకంపోస్టు, ఆముదం, వేరుసెనగ పిండి వంటి సేంద్రియ ఎరువుని మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనికి రసం పీల్చే పురుగులు, పిండి, పొలుసు పురుగుల బెడద ఎక్కువే. అలాగే బూడిద తెగులు, వేరుకుళ్లు కూడా ఆశించవచ్చు. నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటి, గాలి సరిగా తగిలేలా చూసుకుంటే మంచిది. వేప, వెల్లుల్లి, మిరపవంటి కషాయాలు చల్లుతూ ఉండాలి. జిగురుగా ఉండే స్టిక్కీ ట్రాపులను(మార్కెట్లలో దొరుకుతాయి) మొక్కల మధ్య తగిలిస్తే వీటిని నివారించవచ్చు.
ఔషధ గుణాలెన్నో... రోజ్మేరీకి ఔషధగుణాలు ఎక్కువే. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులకు నివారణంగా వాడతారు. ఈ నూనెను తలకు మర్దన చేస్తే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుందట. రోజ్మేరీని కలపడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండే నూనెలు(అవిసె నూనె) వంటివి త్వరగా పాడైపోకుండా ఉంటాయట. దీన్ని రూమ్‌ఫ్రెష్‌నర్‌గానూ, పెర్‌ఫ్యూమ్‌ల్లోనూ వాడతారు. జ్ఞాపకానికీ, ప్రేమకూ సంకేతంగా భావిస్తారు కూడా. రోజ్మేరీని కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్థనం చేయవచ్చు. గింజలతో పెంచడం కొంచెం కష్టం. ఈ మొక్క మన దగ్గర కంటే పూణె, బెంగళూరు వంటి నగరల్లోని నర్సరీల్లో సులువుగా దొరుకుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







