తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

- December 14, 2025 , by Maagulf
తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ తెలంగాణలో ఈరోజు మరియు రేపు చలిగాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపారు.

శనివారం (డిసెంబర్ 13) రాత్రి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీలు, పటాన్‌చెరువులో 6.8 డిగ్రీలు,మెదక్‌లో 7.5 డిగ్రీలు నమోదయ్యాయి. రాజేంద్ర నగర్‌లో 8.5 డిగ్రీలు, హనుమకొండలో 10 డిగ్రీలు, హైదరాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రామగుండం (11.5), దుండిగల్ (11.6), హయత్‌నగర్, నిజామాబాద్ (12), ఖమ్మం (13), నల్లగొండ (13.6), భద్రాచలం (14), మహబూబ్‌నగర్ (14.1), హకీమ్‌పేట (15.5) డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.దట్టమైన పొగమంచు కారణంగా మినుములూరు, అరకులో 5 డిగ్రీలు, అరకు, పాడేరు ప్రాంతాల్లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలి తీవ్రతను తట్టుకునేందుకు గిరిజనులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. పొగమంచు అధికంగా ఉండటంతో రహదారులపై వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు చలిగాలుల తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com