IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక

- December 17, 2025 , by Maagulf
IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్‌రావు ను రూ.30 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం అమన్ రావు హైదరాబాద్ అండర్-23 జట్టు తరఫున రంజీ క్రికెట్ టోర్నీలో రాణిస్తున్నారు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో అమన్ తన మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షించారు. 160 స్ట్రైక్‌ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించి తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శనే అతనికి ఐపీఎల్ తలుపులు తెరిచేలా చేసింది.

అమన్ రావుకు క్రికెట్ పట్ల మక్కువ వారసత్వంగానే లభించింది. ఆయన తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో కరీంనగర్‌ హిందూ క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. కుమారుడి ప్రతిభను గుర్తించి అతనికి మెరుగైన శిక్షణ అందించడం కోసం వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లింది.

కేవలం క్రీడల్లోనే కాకుండా.. రాజకీయంగా కూడా వీరి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అమన్‌రావు తాత పేరాల గోపాల్‌రావు గతంలో జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. కరీంనగర్ మట్టి నుంచి ఎదిగిన ఒక యువకుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో భాగం కావడం జిల్లాకు గర్వకారణంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com