గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- January 16, 2026
హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బలూన్ అప్పొజి గూడ శివారులో దిగింది.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.... తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకవైపు 'ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్' ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం మరియు ఆతిథ్యాన్ని చాటుతుండగా, మరోవైపు 'హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ల ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు.
డెస్టినేషన్ తెలంగాణ - ప్రపంచ పర్యాటక కేంద్రంగా.. తెలంగాణలోని సహజ సౌందర్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. "డెస్టినేషన్ తెలంగాణ" అనే బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ, కేవలం దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేలా ఇటువంటి సాహసోపేత క్రీడలు (Adventure Sports) ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా, ఒక గొప్ప అనుభూతిని పొందేలా వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ, భాగస్వామ్య పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యమన్నారు.
ఇదొక అద్భుత అనుభూతి. సంప్రదాయానికి గౌరవం, సాంకేతికతకు స్వాగతం పలుకుతూ పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం. నేడు ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు.. తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ స్థాయి ఎత్తులకు చేరుకోబోతోంది అనడానికి నిదర్శనం" అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులు, యువత, పిల్లలందరికీ ఈ ఫెస్టివల్ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని, ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







